ఏడో ఆసియాకప్‌‌ టైటిల్‌‌కు అడుగు దూరంలో ఇండియా విమెన్స్‌‌ టీమ్‌‌

ఏడో ఆసియాకప్‌‌ టైటిల్‌‌కు అడుగు దూరంలో ఇండియా విమెన్స్‌‌ టీమ్‌‌
  • సెమీస్‌లో థాయ్‌లాండ్‌పై గెలుపు
  • రాణించిన హర్మన్‌, జెమీమా, దీప్తి
  • శనివారం శ్రీలంకతో టైటిల్​ ఫైట్​

సిల్హెట్‌‌‌‌: ఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొట్టిన ఇండియా విమెన్స్‌‌ టీమ్‌‌.. ఏడో ఆసియాకప్‌‌ టైటిల్‌‌కు అడుగు దూరంలో నిలిచింది. షెఫాలీ వర్మ (28 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 42), కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ (30 బాల్స్‌‌లో 4 ఫోర్లతో 36) చెలరేగడంతో.. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 74 రన్స్‌‌ తేడాతో థాయ్‌‌లాండ్‌‌ను చిత్తు చేసింది. దీంతో వరుసగా ఎనిమిదోసారి ఆసియా కప్‌‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 148/6 స్కోరు చేసింది. తర్వాత థాయ్‌‌లాండ్‌‌ 20 ఓవర్లలో 74/9 స్కోరుకే పరిమితమైంది. నరుమోల్‌‌ చైవాయ్‌‌ (21), నటాయ బూచతమ్‌‌ (21) టాప్‌‌ స్కోరర్లు. ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ 3, రాజేశ్వరి గైక్వాడ్‌‌ 2 వికెట్లు తీసింది. షెఫాలీకి ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

‘టాప్‌‌’లేపారు..

ఓపెనర్లలో షెఫాలీ తన అటాకింగ్‌‌ ఆటతో థాయ్‌‌ బౌలర్లపై విరుచుకుపడగా, స్మృతి మంధాన (13) ఓ మాదిరిగా ఆడింది. తొలి వికెట్‌‌కు 38 రన్స్‌‌ జోడించి ఔటైంది. తర్వాత జెమీమా రొడ్రిగ్స్‌‌ (27) కూడా సమయోచితంగా స్పందించడంతో రెండో వికెట్‌‌కు 29 రన్స్‌‌ జతయ్యాయి. అయితే థాయ్‌‌ బౌలర్ల ప్రతిభ కంటే ఇండియా బ్యాటర్లు పేలవమైన షాట్లు కొట్టి వికెట్లు ఇచ్చుకున్నారు. జెమీమాతో జతకలిసిన హర్మన్‌‌ స్పష్టమైన షాట్లతో థాయ్‌‌ బౌలర్లపై ఒత్తిడి పెంచింది. కవర్స్‌‌, ఎక్స్‌‌ట్రా కవర్స్‌‌లో బౌండ్రీలు సాధిస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. అయితే 14వ ఓవర్‌‌లో జెమీమా ఔట్‌‌కావడంతో మూడో వికెట్‌‌కు 42 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. రిచా ఘోష్‌‌ (2), దీప్తి శర్మ (3) విఫలమైనా, చివర్లో పూజా వస్త్రాకర్‌‌ (17 నాటౌట్‌‌) వేగంగా ఆడింది. 

బౌలింగ్‌‌ అదుర్స్‌‌..

టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో థాయ్‌‌ ప్లేయర్లు ఏ దశలోనూ ఇండియా బౌలింగ్‌‌ను దీటుగా ఎదుర్కోలేకపోయారు. ముఖ్యంగా దీప్తి శర్మ తన వరుస ఓవర్లలో సూపర్‌‌ స్పిన్‌‌ మ్యాజిక్‌‌తో థాయ్‌‌ టాప్‌‌ ఆర్డర్‌‌ను కూల్చేసింది. దీంతో ననాపట్ (5), నాథకన్‌‌ (4), సోర్నారిస్‌‌ (5) సింగిల్‌‌ డిజిట్‌‌కే పెవిలియన్‌‌కు చేరారు. వెంటనే పేసర్‌‌ రేణుకా సింగ్‌‌ (1/6).. చనిడా సుతిరంగ (1)ను ఔట్‌‌ చేయడంతో థాయ్‌‌లాండ్‌‌ 21 రన్స్‌‌కే 4 వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలుపెట్టింది. మధ్యలో చైవాయ్‌‌, నటాయ నిలకడగా ఆడినా.. రన్‌‌రేట్‌‌ భారీగా ఉండటంతో వీళ్ల ప్రయత్నం కూడా ఫలించలేదు. చివరకు17వ ఓవర్‌‌లో స్నేహ్‌‌ రాణా (1/16).. నటాయాను ఔట్‌‌ చేయడంతో  ఐదో వికెట్‌‌కు 42 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. 19వ ఓవర్‌‌లో రాజేశ్వరి వరుస బాల్స్‌‌లో చైవాయ్‌‌, పనిట్టా మయా (0)ను వెనక్కి పంపడంతో థాయ్‌‌ టార్గెట్‌‌ను ఛేదించలేకపోయింది. ఇన్నింగ్స్‌‌ మొత్తంలో 9 మంది సింగిల్‌‌ డిజిట్‌‌ స్కోరుకే పరిమితమయ్యారు.