డిజిటల్​ టాలెంట్​కు గ్లోబల్​ హబ్గా ఇండియా 

డిజిటల్​ టాలెంట్​కు గ్లోబల్​ హబ్గా ఇండియా 
  • 50 లక్షలకు చేరిన ఐటీ జాబ్స్
  • ఎగుతులు 17శాతం ఆన్ లైన్ బిజినెస్ 39శాతం

వెలుగు బిజినెస్​ డెస్క్​: మన ఐటీ ఇండస్ట్రీ గత పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా 15.5% గ్రోత్​ను 2021–22లో సాధించింది. అంతకు ముందు 2011లో ఒకసారి ఇంత గ్రోత్​ రికార్డయింది.  ఐటీ కంపెనీల రెవెన్యూ ఏకంగా 227 బిలియన్​ డాలర్లను (దాదాపు రూ.17 లక్షల కోట్లు) అందుకుంది. దీంతో 2026 నాటికి ఏటా 11 నుంచి 14 శాతం గ్రోత్​తో 350 బిలియన్​ డాలర్ల (దాదాపు రూ.26 లక్షల కోట్లు) రెవెన్యూ సాధించాలని టార్గెట్​గా పెట్టుకుంది. ఈ డేటాను మంగళవారం నాస్కామ్​ రిలీజ్​ చేసింది. ఐటీ ఇండస్ట్రీలోని అన్ని సెగ్మెంట్స్​ రెండంకెల గ్రోత్​ చూపించినట్లు నాస్కామ్​ వెల్లడించింది.  ఐటీ ఇండస్ట్రీ ఎగుమతులు (హార్డ్​వేర్​తో కలిపి) 17.2% పెరిగాయి. ఈ ఎగుమతులు 178 బిలియన్​ డాలర్లకు ఎగిశాయి. మన దేశపు మొత్తం సర్వీసెస్​ ఎగుమతుల్లో ఐటీ ఎగుమతుల వాటా 51 శాతానికి చేరింది. 

డిజిటల్​ ఇన్​ఫ్రానే కారణం...
ఐటీ ఇండస్ట్రీ దేశంలో ఎదగడానికి డిజిటల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ బాగా సాయపడింది. దేశంలోని పబ్లిక్​ డిజిటల్​ ప్లాట్​ఫామ్స్​ టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో ముందుంటున్నాయి. దీంతో దేశీయ డిమాండ్​ కూడా పుంజుకుంటోంది. ఐటీ ఇండస్ట్రీ దేశీయ రెవెన్యూ 2019 తో పోలిస్తే రెట్టింపయి 50 బిలియన్​ డాలర్లకు చేరినట్లు నాస్కామ్​ రిపోర్టు తెలిపింది. ఆన్​లైన్​ బిజినెస్​(ఈ–కామర్స్​) సెగ్మెంట్​ 39 శాతం గ్రోత్​తో 2022లో 79 బిలియన్​ డాలర్ల రెవెన్యూను అందుకోవడం విశేషం. డిజిటల్​ రెవెన్యూ కూడా 32 శాతం పెరిగి 13 బిలియన్​ డాలర్లయింది. 
50 లక్షలకు చేరిన ఐటీ జాబ్స్​....
దేశంలోని ఐటీ ఉద్యోగుల సంఖ్య 50 లక్షలు దాటింది. దీంతో డిజిటల్​ టాలెంట్​కు మన దేశమే గ్లోబల్​ హబ్​గా మారిందని కూడా రిపోర్టు వెల్లడించింది.  2022లో ఐటీ ఇండస్ట్రీ 4.5 లక్షల కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొంది. మన దేశంలోని ఐటీ ఇండస్ట్రీలో 36% మంది (అంటే 18 లక్షలు) మహిళలు పనిచేస్తున్నారని నాస్కామ్​ రిపోర్టు తెలిపింది. ప్రతి ముగ్గురు ఉద్యోగులలో ఒకరు డిజిటల్​ స్కిల్స్​ తెలుసున్న వారని, దేశంలోని డిజిటల్​ టెక్​ టాలెంట్​ పూల్​16 లక్షలకు చేరిందని వివరించింది. ఈ డిజిటల్​ టెక్​ టాలెంట్​ పూల్​ ఏటా 25 శాతం చొప్పున పెరుగుతున్నట్లు తెలిపింది. 2022లో ఐటీ ఇండస్ట్రీలోని 2.8 లక్షల మంది ఉద్యోగులకు కొత్త స్కిల్స్​ నేర్పించినట్లు పేర్కొంది. 2022లో డిజిటల్​ టెక్నాలజీ సెగ్మెంట్లోనే ఎక్కువ మెర్జర్లు, ఎక్విజిషన్లు చోటు చేసుకున్నాయని, మొత్తం 290 మెర్జర్లు జరిగాయని నాస్కామ్​ రిపోర్టు వెల్లడించింది.
మూడో పెద్ద స్టార్టప్​ హబ్​...
మన దేశం ప్రపంచంలోనే మూడో పెద్ద స్టార్టప్​ హబ్​గా మారింది. దేశంలో 25 వేల టెక్​ స్టార్టప్​లు ఏర్పాటయ్యాయి.  42 స్టార్టప్లు ఇప్పటికే​ యూనికార్న్​లుగా మారడం ఒక విశేషమైతే, 11 కంపెనీలు 2021లో ఐపీఓలకు రావడం మరో విశేషమని నాస్కామ్​ రిపోర్టు ప్రస్తావించింది.  ఒక్క 2021లోనే కొత్తగా 2,250 టెక్​ స్టార్టప్​లు దేశంలో ఏర్పాటయ్యాయని, ఇదే ఏడాదిలో రికార్డు లెవెల్లో 24 బిలియన్​ డాలర్ల పెట్టుబడులను స్టార్టప్​లు తెచ్చుకున్నాయని కూడా వెల్లడించింది.
2 వేల ప్రొడక్ట్​ కంపెనీలు....
ప్రొడక్టుల రంగంలోనూ మన సాఫ్ట్​వేర్​ కంపెనీలు దూసుకెళ్తున్నాయని, 2 వేల సాఫ్ట్​వేర్​ ప్రొడక్టు కంపెనీలు, వెయ్యి ఎస్​ఏఏఎస్​ (శాస్​) కంపెనీలు ఇక్కడ ఉన్నాయని నాస్కామ్​ డేటా వివరించింది. దేశంలోని శాస్​ కంపెనీలకు 2021లో 4.5 బిలియన్​ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపింది.
ఇనొవేషన్​తో ఆర్​ అండ్​ డీ లో మరిన్ని పెట్టుబడులొస్తాయ్​....
ఇనొవేషన్​, పార్ట్​నర్షిప్స్​ ద్వారా డిజిటల్​ కేపబిలిటీస్​ పెంచుకుంటే రిసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​లో మరిన్ని పెట్టుబడులు వస్తాయని నాస్కామ్​ అభిప్రాయపడింది. అప్పుడు మరిన్ని ప్రొడక్టులు, ప్లాట్​ఫామ్స్​ తెచ్చే ఛాన్స్​ ఉంటుందని పేర్కొంది. మన ఐటీ ఇండస్ట్రీకి క్లౌడ్​, సైబర్​ సెక్యూరిటీ, డేటా, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​లు టాప్​ ప్రయారిటీలుగా కొనసాగుతున్నాయని, క్వాంటమ్​ టెక్నాలజీస్​ వంటి కొత్త ఏరియాలలో సెంటర్స్​ ఆఫ్​ ఎక్స్​లెన్స్​లను ఇండస్ట్రీ ఏర్పాటు చేయనుందని కూడా నాస్కామ్​ రిపోర్టు తెలిపింది.

ఏ రకంగా చూసినా 2022 సంవత్సరం ఐటీ ఇండస్ట్రీ మర్చిపోలేనిది. అన్ని సెగ్మెంట్లలోనూ భారీ గ్రోత్​ కనిపిస్తోంది. ఉద్యోగాలు బాగా పెరిగాయి. దేశపు ఎకనమిక్​ గ్రోత్​లో ఐటీ ఇండస్ట్రీ చురుగ్గా భాగం పంచుకుంటోంది. దేశాన్ని ట్రిలియన్​ డాలర్​ డిజిటల్​ ఎకానమీగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం. టాలెంట్​, టెక్నాలజీ, కొలాబరేషన్​, ఇనొవేషన్.....నాలుగింటిపై ఫోకస్​ పెడుతున్నాం. ‑ రేఖా ఎం. మీనన్​ నాస్కామ్​ ఛైర్​ పర్సన్​.