నేటి నుంచి ఇండియా, ఆస్ట్రేలియా డే/నైట్‌‌ టెస్ట్‌‌

నేటి నుంచి ఇండియా, ఆస్ట్రేలియా డే/నైట్‌‌ టెస్ట్‌‌

టీమిండియా తుదిజట్టు ప్రకటన

రాహుల్, గిల్ కు నిరాశ

ఆసీస్ ను వెంటాడుతున్న గాయాలు

ఉ.9.30 నునంనచి సోని సిక్స్ లో…

ఇండియాది ఒక టెస్ట్‌‌ అనుభవం…! ఆస్ట్రేలియాది ఏడు మ్యాచ్‌‌ల అనుబంధం..! సంచలనం కోసం టీమిండియా ఆరాటం..! ఆధిపత్యం కోసం కంగారూల పోరాటం..! ఈ నేపథ్యంలో అసలు సిసలైన ‘పింక్‌‌’ బాల్‌‌ టెస్ట్‌‌కు రంగం సిద్ధమైంది..! ఇరుజట్ల బలం, బలగం సమం.. అవకాశాలు సమానం.. కానీ సొంతగడ్డపై ఆడటం ఆసీస్‌‌కు అడ్వాంటేజ్‌‌..! ప్రతికూలతలను ఎదిరించి గెలవడం ఇండియాకు అత్యవసరం…! ఓవరాల్‌‌గా రికార్డులు, రివార్డులు.. హిస్టరీని కాసేపు పక్కనబెడితే క్షణక్షణం పరీక్ష పెట్టే పింక్‌‌ టెస్ట్‌‌లో పాస్‌‌ అయ్యేదెవరు..! బంగ్లాను భయపెట్టినట్లుగా టీమిండియా.. ఆసీస్‌‌ను ‘కంగారు’పెడుతుందా? పడుతుందా? చూడాలి..!!

అడిలైడ్‌‌: ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్‌‌లో ఓడి.. టీ20ల్లో గెలిచిన ఇండియా టీమ్‌‌ అసలు పోరాటానికి సిద్ధమైంది. టూర్‌‌ మొదలైనప్పట్నించి హెడ్‌‌లైన్స్‌‌లో నిలుస్తున్న ‘డే/నైట్‌‌’ టెస్ట్‌‌కు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో బోర్డర్‌‌–గవాస్కర్‌‌ ట్రోఫీలో భాగంగా గురువారం నుంచి అడిలైడ్‌‌లో జరిగే పింక్‌‌ టెస్ట్‌‌లో పటిష్టమైన ఆసీస్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. పేపరుమీద చూడటానికి ఇరుజట్లు బలంగానే కనిపిస్తున్నా.. రెండింటిలోనూ టాప్‌‌ ఆర్డర్‌‌ సమస్యలు ఉన్నాయి. అయితే వీటిని ఎంతమేరకు పరిష్కరించుకుంటాయన్న దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్‌‌ ద్వారా డే/నైట్‌‌ టెస్ట్‌‌లకు మరింత ప్రాచుర్యం కలుగుతుందని నిర్వాహకులు భావిస్తుంటే.. క్రికెట్‌‌ ఫ్యాన్స్‌‌ మాత్రం కోహ్లీ వర్సెస్‌‌ స్మిత్‌‌ రైవలరీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఓవరాల్‌‌గా రెండేళ్ల కిందట సిరీస్‌‌ గెలిచిన టీమిండియా.. దానిని నిలబెట్టుకోవాలని పక్కా ప్లాన్స్‌‌ వేస్తుండటం, ఈ మ్యాచ్‌‌ తర్వాత కోహ్లీ అందుబాటులో ఉండకపోవడంతో పింక్‌‌ టెస్ట్‌‌పై చాలా హైప్‌‌ క్రియేట్‌‌ అయ్యింది. దీంతో తెలియని ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరుజట్లు ఎలా ఆడతాయన్నదే ఆసక్తికరంగా మారింది.

రాహుల్‌‌కు నిరాశ

ఈ మ్యాచ్‌‌ కోసం టీమిండియా తుది జట్టును ప్రకటించింది. ముగుర్గు పేసర్లు, ఓ స్పిన్నర్‌‌తో బౌలింగ్‌‌ లైనప్‌‌ను సరి చేసింది. పార్ట్‌‌టైమ్‌‌ స్పిన్నర్‌‌గా విహారి పనికొస్తాడు కాబట్టి రెండో స్పిన్నర్‌‌ లేకుండా ఆడుతోంది. అయితే ఎక్స్‌‌ట్రా బ్యాట్స్‌‌మన్‌‌తో బ్యాటింగ్‌‌ డెప్త్‌‌ను పెంచుకున్నా..  ఎవరూ ఊహించని విధంగా ఓపెనింగ్‌‌లో కుర్రాళ్లపై నమ్మకం పెట్టింది. సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్న కేఎల్‌‌ రాహుల్‌‌ను కాదని మయాంక్‌‌ అగర్వాల్‌‌కు తోడుగా పృథ్వీ షాను కోహ్లీ ఎంపిక చేసుకున్నాడు.  అయితే ఆసీస్‌‌ పేస్‌‌ త్రయం కమిన్స్‌‌, స్టార్క్‌‌, హాజిల్‌‌వుడ్‌‌ స్వింగ్‌‌, బౌన్స్‌‌ ముందు వీళ్లిద్దరు అనుకున్న ఆరంభాన్నిస్తారా? వామప్‌‌లో బాగా ఆడిన శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ను కాకుండా అంతగా ఫామ్‌‌లో లేని పృథ్వీకి మేనేజ్‌‌మెంట్‌‌ ఎలా చాన్స్‌‌ ఇచ్చిందన్నది కూడా అర్థంకాని ప్రశ్న. ఇక వికెట్‌‌ కీపర్‌‌ స్లాట్‌‌ కోసం సాహావైపే మొగ్గారు. ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌లో సెంచరీ బాదినా.. రిషబ్‌‌ను పరిగణనలోకి తీసుకోలేదు. పుజారా, కోహ్లీ, రహానె, విహారి… వీళ్లలో ఏ ఇద్దరు నిలబడ్డా టీమిండియాకు భారీ స్కోరు ఖాయం. పేస్‌‌ బౌలింగ్‌‌లో బుమ్రా, షమీ అటోమెటిక్‌‌ సెలెక్షన్‌‌ కాగా, థర్డ్‌‌ పేసర్‌‌గా ఉమేశ్‌‌ను తీసుకున్నారు. ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌లో రాణించడం ఉమేశ్‌‌కు కలిసొచ్చింది. పింక్‌‌ బాల్‌‌తో ప్రాక్టీస్‌‌ సెషనల్​లో అదరగొట్టిన నటరాజన్‌‌, సిరాజ్‌‌కు చాన్స్‌‌ ఇవ్వలేదు.

బౌలింగ్​ సూపర్బ్​

స్టార్‌‌ ఓపెనర్‌‌ డేవిడ్‌‌ వార్నర్‌‌ లేకపోవడం ఆస్ట్రేలియాకు పెద్ద లోటు. యంగ్‌‌ ప్లేయర్‌‌ పుకోవ్‌‌స్కీ కంకషన్‌‌కు గురికావడం కూడా కంగారూలను కలవరపెడుతోంది. ఈ ఇద్దరు అందుబాటులో లేకపోవడంతో హోమ్‌‌ టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కొత్త ప్రయోగాలు చేస్తున్నది. బర్న్స్‌‌కు తోడుగా వేడ్‌‌ను ఓపెనర్‌‌గా ప్రమోట్‌‌ చేయనుంది. ఇక టాప్‌‌ ఆర్డర్‌‌లో స్మిత్‌‌, లబుషేన్‌‌ చాలా కీలకం కానున్నారు. ప్రస్తుతం సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్న స్మిత్‌‌ చెలరేగితే ఇండియాకు కష్టాలు తప్పవు. టీమ్‌‌ను బ్యాలెన్స్‌‌ చేయడానికి యంగ్ ఆల్‌‌రౌండర్‌‌ కామోరూన్‌‌ గ్రీన్‌‌ను తీసుకొస్తున్నారు. అతను కూడా కంకషన్​కు గురయ్యాడు.  మిడిలార్డర్‌‌లో కెప్టెన్‌‌ పైన్‌‌, హెడ్‌‌ నిలబడితే పోటీ రసవత్తరంగా మారుతుంది. బ్యాటింగ్‌‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆసీస్‌‌ బౌలింగ్‌‌లో మాత్రం సూపర్బ్‌‌గా ఉంది. పింక్‌‌ బాల్‌‌ టెస్ట్‌‌లో అత్యధిక వికెట్లు తీసిన స్టార్క్‌‌, కమిన్స్‌‌, హాజిల్‌‌వుడ్‌‌తో పేస్‌‌ చాలా బలంగా ఉంది. ఏకైక స్పిన్నర్‌‌గా లైయన్‌‌ టీమ్‌‌లోకి వచ్చినా పార్ట్‌‌టైమర్​గా స్మిత్‌‌ ఉపయోగపడనున్నాడు. ఓవరాల్‌‌గా ఫస్ట్‌‌ మ్యాచ్‌‌తోనే ఇండియాకు చెక్‌‌ పెట్టాలని భావిస్తున్న ఆసీస్‌‌.. అందుకు తగ్గ ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. అయితే గ్రౌండ్‌‌లో ఎంతమేరకు ఎగ్జిక్యూట్‌‌ చేస్తుందన్నది చూడాలి.

ఏడు గెలిచింది..

ప్రపంచం మొత్తం డే/నైట్‌‌ టెస్ట్‌‌ ఆడటానికి భయపడుతున్న రోజుల్లోనే ఆస్ట్రేలియా చాలా పెద్ద సాహసం చేసింది. 2015లో ఫస్ట్‌‌ పింక్‌‌ టెస్ట్‌‌ ఆడి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌‌లు ఆడితే అన్నింటిలోనూ వాళ్లదే విజయం. గట్టిపోటీ ఇచ్చిన జట్టు ఒక్కటైనా లేదు. ముఖ్యంగా రాత్రి పూట జరిగే లాస్ట్‌‌ రెండు సెషన్లలో ఆసీస్‌‌ పేస్‌‌ బౌలింగ్‌‌కు ఎదురొడ్డి నిలవడం చాలా కష్టం. ఎందుకంటే సాయంత్రం వేళ రాబట్టే స్వింగ్‌‌ చాలా భయంకరంగా ఉంటుంది. ఈ స్వింగ్‌‌ కారణంగా బాల్‌‌ కొద్దిగా పక్కకు జరుగుతుంది. దీంతో బ్యాట్స్‌‌మన్‌‌ బాల్‌‌ను స్పష్టంగా చూడలేరు. దీంతో పేస్‌‌, స్వింగ్‌‌, బౌన్స్‌‌ను రాబడుతూ కంగారూల పేసర్లు చాలా కంగారుపెడతారు. మరోవైపు టీమిండియా ఒకే ఒక్క డే/నైట్‌‌ టెస్ట్‌‌ ఆడింది. ఈడెన్‌‌లో జరిగిన ఈ మ్యాచ్‌‌లో బంగ్లాదేశ్‌‌ను మూడు రోజుల్లోనే ఓడించింది. మూడు రోజులూ కంప్లీట్‌‌ డామినేషన్‌‌ చూపిన ఇండియా.. ఆ జోరును ఇక్కడా చూపెడుతుందా? అన్నది ప్రశ్నార్థకం.

పిచ్‌‌, వాతావరణం

పిచ్‌‌ మీద గ్రాస్‌‌ ఉంది. అయితే ఇది పింక్‌‌ బాల్‌‌ను ప్రొటెక్ట్​ చేయడానికి మాత్రమే. స్టార్టింగ్‌‌లో బాల్‌‌ మూవ్‌‌మెంట్‌‌ ఎక్కువగా ఉన్నా.. బ్యాట్స్‌‌మెన్‌‌ భయపడాల్సిన పని లేదు. చిరుజల్లులు పడే చాన్స్‌‌ ఉంది.

జట్లు:

ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌‌),మయాంక్‌‌, పృథ్వీ, పుజారా, రహానె, విహారి, సాహా, అశ్విన్‌‌, ఉమేశ్‌‌, షమీ, బుమ్రా.

ఆస్ట్రేలియా (అంచనా): పైన్‌‌ (కెప్టెన్‌‌), బర్న్స్‌‌, వేడ్‌‌, లబుషేన్‌‌, స్మిత్‌‌, హెడ్‌‌, గ్రీన్‌‌, కమిన్స్‌‌, స్టార్క్‌‌, హాజిల్‌‌వుడ్‌‌, లైయన్‌‌.

1మరో సెంచరీ కొడితే.. ఆసీస్‌‌లో హయ్యెస్ట్‌‌ సెంచరీలు చేసిన ఇండియన్ బ్యాట్స్‌‌మన్‌‌గా కోహ్లీ నిలుస్తాడు. సచిన్‌‌, కోహ్లీ చెరో 6 సెంచరీలతో ఉన్నారు. ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌లో అత్యధిక సెంచరీల లిస్ట్‌‌లో విరాట్‌‌ (70)..  పాంటింగ్‌‌ (71)ను సమం చేస్తాడు.