న్యూఢిల్లీ: కొత్త కోచ్.. కొత్త కెప్టెన్.. ఇప్పుడు కొత్త మిడిలార్డర్.. సింపుల్‌గా చెప్పాలంటే టీమిండియా టెస్ట్ టీమ్ ఫ్యూచర్ ఇది..! ఇన్నాళ్లూ మిడిలార్డర్ భారాన్ని మోసిన వెటరన్ ప్లేయర్లు అజింక్యా రహానె, చతేశ్వర్ పుజారా స్థానాలో.. ఇప్పుడు శుభ్‌మన్ గిల్, హనుమ విహారి శకం మొదలుకాబోతున్నది. ఈ ఇద్దరికి బ్యాకప్‌గా శ్రేయస్ అయ్యర్‌ను రెడీ చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఆడే మూడు టెస్ట్‌లకు (శ్రీలంకతో రెండు, ఇంగ్లండ్‌తో ఒకటి)సంబంధించిన మిడిలార్డర్ బ్లూప్రింట్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ సిద్ధం చేసింది. కేప్‌టౌన్‌లో ఇండియా ఆడిన చివరి టెస్ట్ మ్యాచ్‌కు, ఇప్పుడు మొహాలీలో ఆడబోతున్న కోహ్లీ వందో టెస్ట్ టీమ్‌లో కేవలం రెండే ఖాళీలు కనిపిస్తున్నాయి. ఈ రెండింటికి ముగ్గురు యంగ్‌స్టర్స్‌ను రెడీ చేస్తున్నారు. ఈ నెల 4 నుంచి శ్రీలంకతో మొదలయ్యే టెస్ట్ సిరీస్‌కు టీమ్ కాంబినేషన్‌పై మేనేజ్‌మెంట్‌కు ఒకింత స్పష్టత ఇచ్చింది. అయితే గిల్, విహారి, శ్రేయస్.. ఈ ముగ్గురు ఫిట్‌గా ఉంటే ఎవర్ని తప్పిస్తారన్నది పెద్ద ప్రశ్నగా కనిపిస్తున్నది.
విహారి ప్లేస్ సెట్..
టీమిండియా లాంగ్‌టర్మ్ ప్లాన్స్‌లో హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హనుమ విహారి ఇప్పుడు అత్యంత కీలకం కాబోతున్నాడు. అతన్ని ఆరో ప్లేస్‌లో బ్యాటింగ్‌కు దించాలని మేనేజ్‌మెంట్ రెడీ అవుతున్నది. దీనివల్ల బ్యాటింగ్ బలం పెరగడంతో పాటు లోయర్ ఆర్డర్‌తో కలిసి టీమ్‌ను విహారి ముందుకు తీసుకెళ్తాడని బలంగా నమ్ముతోంది. ఇక వైవిధ్యం కోసం రిషబ్ పంత్‌ను ఐదో ప్లేస్‌లో ఆడించనున్నారు. ‘గతంలో రహానెను ఐదో నంబర్‌లో ఆడించేవాళ్లు. కానీ ఇప్పుడు ద్రవిడ్, రోహిత్ ప్లాన్స్ భిన్నంగా ఉన్నాయి. రిషబ్‌ను ఐదో ప్లేస్‌లో దించడం వల్ల విహారిపై ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల అతను స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతాడు. టాప్4లో నలుగురూ రైట్ హ్యాండ్ బ్యాటర్లే ఉన్నారు. ఐదో ప్లేస్‌లో పంత్, ఆ తర్వాత విహారి, ఏడో నంబర్‌లో జడేజా రావడం వల్ల లెఫ్ట్, రైట్ కాంబినేషన్ బాగా కుదురుతుంది. విదేశాల్లో ఐదో నంబర్‌లో ఆడినా.. ఇండియాలో మాత్రం విహారికి ఆరో ప్లేస్ కరెక్ట్. ఎందుకంటే పాత బాల్‌తో స్పిన్నర్లు బౌలింగ్ చేస్తారు. వారిని విహారి బాగా ఎదుర్కోగలడు. రంజీల్లో స్పిన్నర్లపై తన రికార్డు బాగుంది. కాబట్టి ఆరో నంబర్‌లో అతన్ని ఉపయోగించుకోవాలి’ అని మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ
అభిప్రాయపడ్డాడు.
గిల్ కూడా మిడిల్‌లోనే..
గతంలో ఓపెనర్‌గా ఆడిన శుభ్‌మన్ గిల్‌ను కూడా మిడిలార్డర్‌లోనే ఆడించనున్నారు. మూడో నంబర్లోలో అతన్ని బ్యాటింగ్‌కు దించనున్నారు.అవసరం అయితే ఎక్కడైనా ఆడే సామర్థ్యం ఉండటంతో గిల్, విహారి కాంబినేషన్‌ను సెట్ చేసుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నది. రోహిత్, మయాంక్‌ను ఓపెనర్లుగా పంపించి... కోహ్లీని నాలుగో స్థానంలో ఆడించనుంది. ‘మూడో ప్లేస్‌లో గిల్ బెస్ట్ బ్యాటర్. గతంలో అతను ఓపెనర్‌గా ఆడినా, ఈసారి రోహిత్‌తో కలిసి మయాంక్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తేనే బాగుంటుంది. మొదటగా గిల్‌ను మిడిలార్డర్‌కే రెడీ చేశాం. కానీ ఆసీస్‌లో పరిస్థితిని బట్టి అతన్ని ఓపెనర్‌గా పంపించాం. ఇప్పుడు ఆ అవసరం లేదు. వెస్టిండీస్‌లో ఇండియా– ఎ తరఫున మిడిలార్డర్‌లో ఆడిన అతను డబుల్ సెంచరీ సాధించాడు. ఓపెనర్‌గా ఆడిన అనుభవం కూడా ఉంది. కాబట్టి కొత్త బాల్‌ను బాగా డీల్ చేయగలుగుతాడు’ అని దేవాంగ్ గాంధీ పేర్కొన్నాడు. అయితే గిల్, విహారితో పోలిస్తే శ్రేయస్‌కు చాన్స్ రావడం కొద్దిగా కష్టం. ఎందుకంటే అతనికంటే ముందునుంచే ఈ ఇద్దరూ టెస్ట్‌లు ఆడుతున్నారు. ఒకవేళ వీరిలో ఎవరైనా ఫిట్‌గా లేకపోతే అప్పుడు శ్రేయస్‌ను ఉపయోగించుకోవచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి.

