శ్రేయస్ షైన్ అయ్యేనా!.నేడు విండీస్ తో రెండో వన్డే

శ్రేయస్ షైన్ అయ్యేనా!.నేడు విండీస్ తో రెండో వన్డే
  • 4వ స్థానం కోసం అయ్యర్‌కు పరీక్ష  
  • నేడు విండీస్‌తో ఇండియా రెండో వన్డే

ఓవైపు నాలుగో స్థానం కోసం టీమిండియాకు పరీక్ష.. మరోవైపు ‘యూనివర్స్‌‌ బాస్‌‌’ క్రిస్‌‌ గేల్‌‌కు విజయంతో వీడ్కోలు ఇవ్వాలని విండీస్‌‌ భావిస్తున్న వేళ.. ఇరుజట్ల మధ్య ఆదివారం రెండో వన్డేకు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్‌‌ వర్షార్పణం కావడంతో ఈ మ్యాచ్‌‌పై ఆసక్తి పెరిగింది. దీంతో గెలుపే లక్ష్యంగా రెండు టీమ్‌‌లు బరిలోకి దిగుతున్నా.. విరాట్‌‌సేన ఫేవరెట్‌‌ హోదాతో ఓ అడుగు ముందంజలో ఉంది. ప్రయోగాల పేరుతో కుర్రాళ్లకు అవకాశం ఇస్తున్న టీమిండియా మేనేజ్‌‌మెంట్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌పై ఎక్కువగా దృష్టి సారించింది. కేఎల్‌‌ రాహుల్‌‌ను పక్కనబెట్టి నాలుగో స్థానం కోసం అయ్యర్‌‌ పేరును ప్రకటించడంతో ఈ మ్యాచ్‌‌లో ఈ ముంబైకర్‌‌ హాట్‌‌ టాపిక్‌‌గా మారాడు. మరి అతనిపై పెట్టుకున్న అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి..
మార్పుల్లేకుండానే..

తొలి వన్డే రద్దు కావడంతో అదే జట్టును రెండో వన్డేలోనూ బరిలోకి దించాలని విరాట్‌‌ భావిస్తున్నాడు. కాబట్టి పెద్దగా మార్పులు చేసే చాన్స్‌‌ లేదు. టీ20 సిరీస్‌‌లో అవకాశం దక్కించుకోలేకపోయిన శ్రేయస్‌‌కు ఇది గోల్డెన్‌‌ చాన్స్‌‌. ఎందుకంటే మేనేజ్‌‌మెంట్‌‌ దృష్టిలో రాహుల్‌‌ ఇంకా ఓపెనర్‌‌గానే ఉన్నాడు. రోహిత్‌‌, ధవన్‌‌లో ఎవరు గాయపడినా.. వెంటనే రాహుల్‌‌ను బరిలోకి దిగనున్నాడు. అలాగే వర్క్‌‌లోడ్‌‌ కారణంగా విశ్రాంతి ఇచ్చినా.. ఈ ఇద్దరికి ప్రత్యామ్నాయం రాహులే. కాబట్టి ఈ రెండు మ్యాచ్‌‌ల్లో కనీసం ఒక్క సెంచరీ బాదినా.. మరో రెండు, మూడు సిరీస్‌‌ల వరకు శ్రేయస్‌‌ స్థానానికి డోకా లేనట్లే. అయితే కేవలం రెండు మ్యాచ్‌‌లతోనే అయ్యర్‌‌ ప్రతిభను  అంచనా వేయడం కరెక్ట్‌‌ కాదనే అభిప్రాయం కూడా వినిపిస్తున్నది. ఐపీఎల్‌‌లో ఇప్పటికే ఆకట్టుకున్న అయ్యర్‌‌కు.. విరాట్‌‌, రోహిత్‌‌ అండగా నిలిస్తే అద్భుతాలు చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియా–ఎ టీమ్‌‌తో కరీబియన్‌‌లో పర్యటించడం కూడా అయ్యర్‌‌కు కలిసొచ్చే అంశం. టాప్‌‌లో రోహిత్‌‌, ధవన్‌‌, కోహ్లీని పక్కనబెడితే మిడిలార్డర్‌‌లో కేదార్‌‌కు ఈ సిరీస్‌‌ పెద్ద పరీక్ష. దినేశ్‌‌ కార్తీక్‌‌ను కాదని ఎన్ని అవకాశాలు ఇచ్చినా జాదవ్‌‌ వినియోగించుకోవడం లేదు. కాబట్టి ఇక్కడ విఫలమైతే అతని కెరీర్‌‌కు ఫుల్‌‌స్టాప్‌‌ పడ్డట్లే. శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ ఈ స్థానం కోసం వెయిటింగ్‌‌ లిస్ట్‌‌లో ఉన్నాడు. ఇండియా–ఎ తరఫున అతను డబుల్‌‌ సెంచరీ చేసి ఫుల్‌‌ ఫామ్‌‌లో ఉన్నాడు. బౌలింగ్‌‌లోనూ మార్పుల్లేకపోయినా.. వర్క్‌‌లోడ్‌‌ కారణంగా భువనేశ్వర్‌‌కు విశ్రాంతి ఇవ్వనున్నారు. ఇదే జరిగితే నవ్‌‌దీప్‌‌ సైనీకి అరంగేట్రం చేయొచ్చు. షమీతో కలిసి అతను కొత్త బంతిని పంచుకుంటాడు. కుల్దీప్‌‌, జడేజా స్థానాల్లో మార్పులు చేయకపోవచ్చు. ముగ్గురు స్పిన్నర్ల వ్యూహం అయితే చహల్‌‌ తుది జట్టులో ఉంటాడు. అప్పుడు పేసర్‌‌ ఖలీల్‌‌పై వేటు పడుతుంది.

జట్లు (అంచనా)

ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, ధవన్‌,  శ్రేయస్‌, కేదార్‌, పంత్‌, జడేజా, భువనేశ్వర్‌, కుల్దీప్‌, షమీ, ఖలీల్‌.

వెస్టిండీస్‌: హోల్డర్‌ (కెప్టెన్‌), గేల్‌, లూయిస్‌, హోప్‌, హెట్‌మయర్‌, పూరన్‌, ఛేజ్‌, అలెన్‌, బ్రాత్‌వైట్‌, రోచ్. కొట్రెల్‌.