V6 News

వారెవ్వా.. కుర్రాళ్లు కుమ్మేశారు.. బంగ్లాపై భారత్ అద్భుత విజయం

వారెవ్వా.. కుర్రాళ్లు కుమ్మేశారు.. బంగ్లాపై భారత్ అద్భుత విజయం

వారెవ్వా.. కుర్రాళ్లు కుమ్మేశారు..! చాన్స్‌‌ వస్తే చాలనుకునే స్థాయి నుంచి టీమ్​లో ప్లేస్​ సుస్థిరం చేసే పెర్ఫామెన్స్‌‌తో అదరగొట్టారు..! రోహిత్‌‌ విఫలమైనా.. తాము ఉన్నామంటూ శ్రేయస్‌‌, రాహుల్‌‌.. బ్యాటింగ్‌‌లో దుమ్మురేపితే, బౌలింగ్‌‌లో వరల్డ్‌‌ బెస్ట్‌‌ టీ20 స్టాట్స్​తో దీపక్‌‌ చహర్‌‌ (6/7), దూబే దడదడలాడించారు..! మంచు ప్రతికూలంగా మారినా.. బంతిపై పట్టు కోల్పోకుండా తన నైపుణ్యాన్ని చూపెట్టిన దీపక్‌‌.. హ్యాట్రిక్‌‌ వికెట్లతో సరికొత్త రికార్డును సాధించాడు..! ఫలితంగా తొలి టీ20 విజయంతో సిరీస్‌‌ను రసవత్తరంగా మార్చేసిన బంగ్లా పులులకు షాకిస్తూ.. టీమిండియా భవిష్యత్‌‌ మాదేనంటూ పొట్టి సిరీస్‌‌ను సిరీస్‌‌ను అద్భుతంగా ఒడిసిపట్టుకున్నారు..!!

అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్న టీమిండియా కుర్రాళ్లు.. బంగ్లాదేశ్‌‌కు షాకిచ్చారు. చేజారిపోతుందేమోనన్న మ్యాచ్‌‌ను సూపర్‌‌ బౌలింగ్‌‌తో మలుపు తిప్పిన దీపక్‌‌ చహర్‌‌ (6/7).. ఇండియాకు సిరీస్‌‌ను అందించాడు. బ్యాటింగ్‌‌లో  శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 62), రాహుల్‌‌ (35 బంతుల్లో 7 ఫోర్లతో 52) మెరుపులు మెరిపించడంతో.. ఆదివారం జరిగిన ఆఖరిదైన మూడో టీ20లో ఇండియా 30 పరుగుల తేడాతో బంగ్లాపై గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను రోహిత్‌‌సేన 2–1తో కైవసం చేసుకుంది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌ చేసిన ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 174 రన్స్‌‌ చేసింది. తర్వాత బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకే  కుప్పకూలింది.  మహ్మద్‌‌ నయీమ్‌‌(48 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 81) ఒంటరి పోరాటం చేసినా.. దీపక్‌‌ హ్యాట్రిక్‌‌కు, శివమ్‌‌ దూబే (3/30) దెబ్బకు ప్రత్యర్థి బ్యాట్స్‌‌మెన్‌‌ కుదేలయ్యారు.

అయ్యర్‌‌.. అదరహో

రెండో టీ20లో శివాలెత్తిన రోహిత్‌‌ (2) రెండో ఓవర్‌‌లోనే పెవిలియన్‌‌కు చేరాడు. ఇస్లామ్‌‌ వేసిన అద్భుతమైన ఇన్‌‌స్వింగర్‌‌కు ఈ ముంబైకర్‌‌ బ్యాట్‌‌ ఇన్‌‌సైడ్‌‌ ఎడ్జ్‌‌తో ఔటయ్యాడు. కుదురుగా ఆడుతున్న ధవన్‌‌ (19)ను కూడా షఫియుల్‌‌ ఔట్‌‌ చేయడంతో ఇండియా 35 రన్స్‌‌కే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్‌‌ప్లేలో 41/2 స్కోరుతో ఉన్న ఇండియాను రాహుల్‌‌, శ్రేయస్‌‌ ఆదుకున్నారు. ముఖ్యంగా పరుగులు చేయకుండానే క్యాచ్‌‌ ఔట్‌‌ నుంచి బయటపడ్డ  శ్రేయస్‌‌ భారీ షాట్లు కొడుతూ.. బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మూడో వికెట్‌‌కు 59 రన్స్‌‌ జోడించి గట్టెక్కించారు. హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసిన రాహుల్‌‌.. 13వ ఓవర్‌‌లో అమిన్‌‌కు వికెట్‌‌కు ఇచ్చుకున్నాడు. ఫలితంగా 94 పరుగుల వద్ద నాలుగో వికెట్‌‌ పడింది. ఈ దశలో వచ్చిన పంత్‌‌ (6) రాణించలేకపోయాడు. అఫిఫ్‌‌ వేసిన15వ ఓవర్‌‌లో హ్యాట్రిక్‌‌ సిక్సర్లు కొట్టిన శ్రేయస్‌‌.. ఆ వెంటనే మరో సింగిల్‌‌ తీసి హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఒకే ఓవర్‌‌లో పంత్‌‌, అయ్యర్‌‌ను పెవిలియన్‌‌కు చేర్చిన సౌమ్య.. ఇండియా జోరుకు బ్రేక్‌‌లేశాడు. కానీ డెత్‌‌ ఓవర్లలో మనీశ్‌‌పాండే (22 నాటౌట్‌‌) ధాటిగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అమినల్‌‌ మరో క్యాచ్‌‌ వదిలేయడంతో బతికిపోయిన శివమ్‌‌ దూబే (9 నాటౌట్‌‌) చివరిదాకా క్రీజులో ఉన్నా సత్తా చాటలేకపోయాడు.

దీపక్‌‌ ధమాకా..

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో బంగ్లాకు సరైన ఆరంభం లభించలేదు. దీపక్‌‌ వరుస బంతుల్లో  లిటన్‌‌ దాస్‌‌ (9), సౌమ్య సర్కార్‌‌ (0) ఔట్‌‌కావడంతో బంగ్లా 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలుపెట్టింది. అయితే సహచరులు ఔటైనా.. యంగ్‌‌  ఓపెనర్‌‌ నయీమ్‌‌ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో కీలక భాగస్వామ్యాలను నిర్మించాడు. ఈ క్రమంలో 34 బంతుల్లోనే హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. రెండో ఎండ్‌‌లో మహ్మద్‌‌ మిథున్‌‌ (27) కూడా ఫర్వాలేదనిపించడంతో మూడో వికెట్‌‌కు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. అయితే 13వ ఓవర్‌‌లో దీపక్‌‌ ఈ జంటను విడదీయడంతో ఇండియా ఊపిరి పీల్చుకున్నది. ఈ ఓవర్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కు మిథున్‌‌ ఔట్‌‌ చేశాడు. తర్వాతి ఓవర్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌కే దూబే.. ముష్ఫికర్‌‌ (0)ను డకౌట్‌‌ చేయడంతో బంగ్లాపై ఒత్తిడి నెలకొంది. వికెట్లు పడుతున్నా… నయీమ్‌‌ జోరు కొనసాగించడంతో 15 ఓవర్లలో బంగ్లా 125/4తో గెలుపు దిశగా సాగింది. కానీ 16వ ఓవర్‌‌లో నయీమ్‌‌తో పాటు అఫిఫ్‌‌ వికెట్లు తీసిన దూబే మ్యాచ్‌‌ను మలుపు తిప్పాడు. సెంచరీకి చేరువైన నయీమ్‌‌ను అదిరిపోయే యార్కర్‌‌తో బౌల్డ్‌‌ చేసిన దూబే, ఆ తర్వాత సింపుల్‌‌ రిటర్న్‌‌ క్యాచ్‌‌తో అఫిఫ్‌‌ వికెట్‌‌ ఖాతాలో వేసుకున్నాడు.  తర్వాతి ఓవర్‌‌లో మహ్మదుల్లా (8)ను చహల్‌‌ బౌల్డ్‌‌ చేశాడు. 18వ ఓవర్‌‌ లాస్ట్​ బాల్​కు​ షఫీయుల్‌‌ (4)ను ఔట్‌‌ చేసిన దీపక్‌‌.. 20వ ఓవర్‌‌ తొలి రెండు బాల్స్​కు ముస్తాఫిజుర్‌‌ (1), అమినుల్‌‌ (9)ను ఔట్‌‌ చేసి హ్యాట్రిక్‌‌ సాధించాడు.