దంచిన ధవన్..36 రన్స్ తేడాతో ఇండియా విన్

దంచిన ధవన్..36 రన్స్ తేడాతో ఇండియా విన్

లండన్‌‌: బ్యాటింగ్‌‌లో దుమ్మురేపిన ఇండియా.. వరల్డ్‌‌కప్‌‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌ (109 బంతుల్లో 16 ఫోర్లతో 117) సెంచరీతో దంచికొట్టగా.. ఆదివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో టీమిండియా 36 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. ధవన్‌‌కు తోడుగా..  కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ (77 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 82), రోహిత్‌‌ శర్మ (70 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 57), హార్దిక్‌‌ పాండ్యా (27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48) సమయోచితంగా చెలరేగడంతో.. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌ చేసిన ఇండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 352 పరుగులు చేసింది. తర్వాత ఆసీస్‌‌ 50 ఓవర్లలో  316 పరుగులకు ఆలౌటైంది. స్మిత్‌‌ (70 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 69), వార్నర్‌‌ (84 బంతుల్లో 5 ఫోర్లతో 56), కారీ (35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 55 నాటౌట్‌‌) రాణించినా ప్రయోజనం లేకపోయింది.  ధవన్‌‌కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ లభించింది.

ఆరంభం అదుర్స్‌‌

ఫ్లాట్‌‌ వికెట్‌‌పై టీమిండియా టాప్‌‌ ఆర్డర్‌‌ సునామీలా విరుచుకుపడింది. స్వింగ్‌‌, బౌన్స్‌‌, షార్ట్‌‌ పిచ్‌‌లతో కళ్లెం వేయాలని చూసిన ఆసీస్‌‌ పేస్‌‌ త్రయాన్ని ఉతికి ఆరేస్తూ పరుగుల వరద పారించింది.  2 రన్స్‌‌ వద్ద షార్ట్‌‌ మిడ్‌‌వికెట్‌‌లో కూల్టర్‌‌నైల్‌‌ క్యాచ్‌‌ వదిలేయడంతో ఊపిరి పీల్చుకున్న రోహిత్‌‌ మెల్లగా ఆడినా.. రెండోఎండ్‌‌లో ధవన్‌‌ మాత్రం దంచికొట్టాడు. 8వ ఓవర్‌‌లో మూడు ఫోర్లు కొట్టి జోరు పెంచాడు. డేంజర్‌‌ షార్ట్‌‌ పిచ్‌‌లు శరీరానికి తాకినా ఫిజియో సాయంతో ముందుకెళ్లాడు. తొలి పవర్‌‌ప్లేలో 41 పరుగులు చేసిన ఈ జోడీ.. స్పిన్నర్ల రాకతో రూట్‌‌ మార్చింది. జంపా, మ్యాక్స్‌‌వెల్‌‌ను టార్గెట్‌‌ చేస్తూ బాల్‌‌ను బౌండరీ వైపు పరుగులు పెట్టించారు. ఫర్‌‌ఫెక్ట్‌‌ షాట్స్‌‌తో ఫీల్డర్ల మధ్యలో నుంచి వరుసగా ఫోర్లు బాదారు. ఈ క్రమంలో ధవన్‌‌ 53 బంతుల్లో హాఫ్‌‌ సెంచరీ చేశాడు. కూల్టర్‌‌నైల్‌‌ బౌలింగ్‌‌లో తొలి సిక్స్‌‌ బాదిన రోహిత్‌‌ కూడా 61 బాల్స్‌‌లో ఫిఫ్టీ మార్క్‌‌ను అందుకున్నాడు. ఈ ఇద్దరి జోరుకు తర్వాతి 10 ఓవర్లలో 70 పరుగులు వచ్చాయి. సెంచరీ స్టాండ్‌‌తో కుదురుకున్న ఈ జంటకు 23 ఓవర్లలో బ్రేక్‌‌ పడింది. కూల్టర్‌‌నైల్‌‌ వేసిన ఫుల్‌‌లెంగ్త్‌‌ బంతిని ఆడబోయి రోహిత్‌‌ కీపర్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌‌కు 127 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

ధవన్‌‌ సెంచరీ

127/1 వద్ద వచ్చిన కోహ్లీ.. ధవన్‌‌కు మంచి సమన్వయం ఇచ్చాడు. పేస్‌‌-స్పిన్‌‌ కాంబినేషన్‌‌ను దీటుగా ఎదుర్కొన్న ఈ ఇద్దరు సింగిల్స్‌‌తో స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేశారు. 33వ ఓవర్‌‌లో ధవన్‌‌, కోహ్లీ మధ్య సమన్వయ లోపం నెలకొన్నా.. స్టోయినిస్‌‌ బంతికి సింగిల్‌‌ తీసి గబ్బర్‌‌ సెంచరీ (95 బాల్స్‌‌లో) పూర్తి చేశాడు. తర్వాత మ్యాక్స్‌‌వెల్ ఓవర్‌‌లో రెండు ఫోర్లు కొట్టినా.. 37వ ఓవర్‌‌లో స్టార్క్‌‌ యార్కర్‌‌ను గాల్లోకి లేపిన ధవన్‌‌ డీప్‌‌ మిడ్‌‌ వికెట్‌‌లో లైయన్‌‌ చేతికి చిక్కాడు. రెండో వికెట్‌‌కు ధవన్‌‌–కోహ్లీ 93 పరుగులు జత చేయడంతో భారీ స్కోరుకు బాటలు పడ్డాయి. రాహుల్‌‌ను కాదని నాలుగో స్థానంలో వచ్చిన హార్దిక్‌‌ హిట్టింగ్‌‌కే ప్రాధాన్యమిచ్చాడు. దీంతో 40 ఓవర్లలో టీమ్‌‌ స్కోరు 236/2కు చేరింది. మ్యాక్స్‌‌వెల్‌‌, జంపా, కమిన్స్‌‌ బౌలింగ్‌‌లో భారీ సిక్సర్లతో రెచ్చిపోయిన పాండ్యాకు..  55 బంతుల్లో హాఫ్‌‌ సెంచరీ చేసిన కోహ్లీ కూడా తోడవడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. ఈ ఇద్దరి జోరుతో మూడో వికెట్‌‌కు కేవలం 53 బంతుల్లో 81 పరుగులు జతయ్యాయి. సెంచరీకి 20 పరుగుల వద్ద నిలిచిన కోహ్లీకి అవకాశం ఇవ్వకుండా ధోనీ (14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 27) సిక్స్‌‌లు, ఫోర్లతో రెచ్చిపోయాడు.

స్మిత్‌‌ పోరాడినా..

టార్గెట్‌‌ ఛేజింగ్​లో ఆసీస్‌‌కు మెరుగైన ఆరంభమే దక్కింది. ఇండియా పేసర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఓపెనర్లు ఫించ్‌‌ (36), వార్నర్‌‌ స్వేచ్ఛగా ఆడారు.  పాండ్యా వేసిన 10వ ఓవర్‌‌లో 4, 6, 4, 4తో 19 పరుగులు రాబట్టారు. దీంతో పవర్‌‌ప్లేలో స్కోరు 48కు చేరింది. పాండ్యాతో కలిసి బౌలింగ్‌‌ చేసిన కుల్దీప్‌‌ కూడా వికెట్ల వేటలో వెనుకబడ్డాడు. అయితే 14వ ఓవర్‌‌లో ఫించ్‌‌ అనూహ్యంగా రనౌట్‌‌కావడంతో తొలి వికెట్‌‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన స్మిత్‌‌ కూడా నిలకడగా ఆడాడు. చహల్‌‌ వేసిన 18వ ఓవర్‌‌లో వార్నర్‌‌ క్యాచ్‌‌ను ధోనీ మిస్‌‌ చేశాడు. కాసేపు కుల్దీప్‌‌, చహల్‌‌ను కొనసాగించిన కోహ్లీ.. మధ్యలో కేదార్‌‌కు బంతి ఇచ్చి ఒత్తిడి పెంచాడు. సింగిల్స్‌‌, డబుల్స్‌‌, అవసరమైనప్పుడు ఫోర్లు బాదినా.. 25వ ఓవర్‌‌లో చహల్‌‌ మ్యాజిక్‌‌ చేశాడు. వార్నర్‌‌ను ఔట్‌‌ చేసి రెండో వికెట్‌‌కు 72 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. స్మిత్‌‌తో జతకలిసిన ఖవాజ (42) ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆడాడు. స్పిన్నర్లలో బౌలింగ్‌‌లో బౌండరీలు బాదుతూ.. రన్‌‌రేట్‌‌ను కాపాడాడు. ఈ క్రమంలో స్మిత్‌‌ 60 బంతుల్లో హాఫ్‌‌ సెంచరీ చేశాడు. దాదాపు 10 ఓవర్ల పాటు ఇండియా బౌలర్లను విసిగించిన ఖవాజ– స్మిత్‌‌ జోడీ మూడో వికెట్‌‌కు 69 పరుగులు జత చేసి ఇన్నింగ్స్‌‌ను పటిష్టం చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను 37వ ఓవర్‌‌లో బుమ్రా విడగొట్టాడు. కండ్లు చెదిరే మిడిల్​ స్టంప్​ బాల్​తో అడ్డుకోబోయి ఖవాజ క్లీన్‌‌బౌల్డ్‌‌ అయ్యాడు. మ్యాక్స్‌‌వెల్‌‌ (28) వచ్చి రావడంతోనే రెండు ఫోర్లు బాది జోష్‌‌ పెంచాడు. దీంతో ఆసీస్‌‌ 39 ఓవర్లలో 235/3 స్కోరుతో దీటుగా పోరాటం
మొదలుపెట్టింది.

ఇండియా: రోహిత్‌‌ (సి) కారీ (బి) కూల్టర్‌‌నైల్‌‌ 57, ధవన్‌‌ (సి) (సబ్‌‌) లైయన్‌‌ (బి) స్టార్క్‌‌ 117, కోహ్లీ (సి) కమిన్స్‌‌ (బి) స్టోయినిస్‌‌ 82, హార్దిక్‌‌ (సి) ఫించ్‌‌ (బి) కమిన్స్‌‌ 48, ధోనీ (సి అండ్‌‌ బి) స్టోయినిస్‌‌ 27, రాహుల్‌‌ (నాటౌట్‌‌) 11, జాదవ్‌‌ (నాటౌట్‌‌) 0, ఎక్స్‌‌ట్రాలు: 10, మొత్తం: 50 ఓవర్లలో 352/5. వికెట్లపతనం:  1–127, 2–220, 3–301, 4–338, 5–348.బౌలింగ్‌‌: కమిన్స్‌‌ 10–0–55–1, స్టార్క్‌‌ 10–0–74–1, కూల్టర్‌‌నైల్‌‌ 10–1–63–1, మ్యాక్స్‌‌వెల్‌‌ 7–0–45–0, జంపా 6–0–50–0, స్టోయినిస్‌‌ 7–0–62–2.

ఆస్ట్రేలియా: వార్నర్‌‌ (సి) భువనేశ్వర్‌‌ (బి) చహల్‌‌ 56, ఫించ్‌‌ రనౌట్‌‌ 36, స్మిత్‌‌ ఎల్బీ (బి) భువనేశ్వర్‌‌ 69, ఖవాజ (బి) బుమ్రా 42, మ్యాక్స్‌‌వెల్‌‌ (సి) (సబ్‌‌) జడేజా (బి) చహల్‌‌ 28, స్టోయినిస్‌‌ (బి) భువనేశ్వర్‌‌ 0, కారీ …, కూల్టర్‌‌నైల్‌‌ (సి) కోహ్లీ (బి) బుమ్రా 4, కమిన్స్‌‌ (సి) ధోనీ (బి) బుమ్రా 8, స్టార్క్‌‌ రనౌట్‌‌ 3, జంపా (సి) (సబ్‌‌) జడేజా (బి) భువనేశ్వర్‌‌ 1, ఎక్స్‌‌ట్రాలు: 14, మొత్తం: 50 ఓవర్లలో 316 ఆలౌట్‌‌. వికెట్లపతనం: 1–61, 2–133, 3–202, 4–238, 5–238, 6–244, 7–283, 8–300, 9–313, 10–316.

బౌలింగ్‌‌: భువనేశ్వర్‌‌ 10–0–50–3, బుమ్రా10–1–61–3, హార్దిక్‌‌ 10–0–68–0, కుల్దీప్‌‌ 9–0–55–0, చహల్‌‌ 10–0–62–2, జాదవ్‌‌ 1–0–14–0.