U19 వరల్డ్ కప్ ఫైనల్‌కి భారత్: పాక్‌ని చిత్తుగా ఓడించిన టీమిండియా

U19 వరల్డ్ కప్ ఫైనల్‌కి భారత్: పాక్‌ని చిత్తుగా ఓడించిన టీమిండియా

అండర్‌ –19 వరల్డ్‌‌కప్‌ సెమీస్‌లో టీమిండియా రెచ్చిపోయింది. అండర్ 19 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ని చిత్తుగా ఓడించింది. వన్ సైడ్ విక్టరీని తన ఖాతాలో వేసుకుంది మన యంగ్ టీమ్. దాయాది దేశాన్ని చిత్తు చేసి ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్‌ టీమ్‌ను మన కుర్రోళ్లు బౌలింగ్‌తో బాగా కట్టడి చేశారు. కేవలం 172 పరుగులకే 43.1 ఓవర్లలో పాకిస్థాన్‌ను అలౌట్ చేశారు. 173 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ 113 బంతుల్లో 105 పరుగులు కొట్టగా, దివ్యాన్ష్ సక్సేనా 99 బంతుల్లో 59 రన్స్ చేసి 35.2 ఓవర్లలో మ్యాచ్‌ని ముగించారు. జైశ్వాల్ 8 ఫోర్లు, నాలుగు సిక్సులు బాదేశాడు. సక్సేనా 6 ఫోర్లు కొట్టాడు. ఇద్దరు ఓపెనర్లు పాక్‌ని చిత్తు చేయడంతో 10 వికెట్ల తేడాతో భారీ విజయం టీమిండియా సొంతమైంది.

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ టీమ్‌ 172 పరుగులకే చతికిపడింది. మ్యాచ్ స్టార్టింగ్ నుంచే మన బౌలర్లు లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో పాక్ బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేశారు. మనోళ్ల ఫోర్స్ తట్టుకోలేకపోయిన పాకిస్థాన్ ఆటగాళ్లు కేవలం ముగ్గురు తప్ప మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. పాకిస్థాన్ ఓపెనర్‌ హైదర్‌ అలీ, కెప్టెన్‌ రోహైల్‌ నాజిర్‌ ఇద్దరూ హాఫ్ సెంచురీలతో రాణించారు. ఈ ఇద్దరు తప్ప మిగతా వాళ్లంతా పేలవంగా ఆడారు. టీమిండియా బౌలర్లలో సుషాంత్‌ మిశ్రా 3 వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్‌, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు, అంకోల్కెర్‌, యశస్వి జైస్వాల్‌లు ఒక్కో వికెట్‌ తీశారు.