ఢిల్లీ పోలీసులకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఢిల్లీ పోలీసులకు హైకోర్టులో ఎదురుదెబ్బ

హైదరాబాద్, వెలుగు:  అమిత్‌‌‌‌షా ఫేక్‌‌‌‌ వీడియో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసిన కేసులో పీసీసీకి చెందిన మన్నె సతీశ్ ఇతరులు పొందిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలంటూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన అత్యవసర లంచ్‌‌‌‌మోషన్‌‌‌‌ పిటిషన్‌‌‌‌లో ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను కోర్టు గురువారం విచారించింది. 

రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్‌‌‌‌ షా చెప్పినట్లుగా ఫేక్‌‌‌‌ వీడియో దేశంలోని పలు రాష్ట్రాలకు వ్యాప్తి అయ్యిందని, నాగాలాండ్, జార్ఖండ్, యూపీ, ఎంపీ, రాజస్థాన్‌‌‌‌ రాష్ట్రాలకు చెందినోళ్లకు నోటీసులు వెళ్లాయని ఢిల్లీ పోలీసుల తరఫు లాయర్ వివరించారు. తెలంగాణలో కేసునూ ఢిల్లీకి బదిలీ చేయాలని కోరారు. ఢిల్లీ పాటియాల కోర్టు ద్వారా మన్నె సతీశ్, నవీన్, కోయ గీతలపై నాన్‌‌‌‌బెయిలబుల్‌‌‌‌ వారెంట్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ పొందినట్లు వివరించారు.

ఈ వివరాలు చెప్పకుండా పిటిషనర్లు మధ్యంతర ఆదేశాలు పొందారన్నారు. ఢిల్లీ పోలీసులు అరుణ్‌‌‌‌రెడ్డిని అరెస్టు చేశాక కీలక విషయాలు తెలిశాయని, ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తే దర్యాప్తు స్పీడప్ అవుతుందన్నారు.  మధ్యంతర ఉత్తర్వులను సవరించేందుకు కోర్టు నిరాకరించింది.