జోడీ కుదిరింది.. పేస్ అదిరింది

జోడీ కుదిరింది.. పేస్ అదిరింది

వెలుగు క్రీడావిభాగం:

టెస్టుల్లో ఇండియా హోమ్‌‌ సీజన్‌‌  సక్సెస్‌‌ఫుల్‌‌గా ముగిసింది. ఓవరాల్​గా రెండు నెలల్లో ఐదు మ్యాచ్‌‌ (సౌతాఫ్రికాతోమూడు, బంగ్లాదేశ్​తో రెండు)లే ఆడినా.. సరికొత్త ఆలోచనలతో కొత్త ఫార్మాట్‌‌ పలకరించినా.. కోహ్లీసేన అద్వితీయమైన ఆటతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇండియా పేస్​ అటాక్​ గతంలో ఎప్పుడూ లేనంత బలంగా మారింది. ఇండియాలో టెస్టులు అనగానే స్పిన్​ వికెట్లు.. స్పిన్నర్ల జోరు అనే కాన్సెప్ట్​ను  కేవలం రెండు సిరీస్​ల​తోనే పూర్తిగా మార్చేసింది. వరల్డ్‌‌ క్లాస్‌‌ పేసర్లు జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా, భువనేశ్వర్‌‌‌‌ కుమార్  గాయాలతో దూరమైనా.. ఇషాంత్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌‌లతో కూడిన పేస్‌‌ త్రయం అద్భుతం సృష్టించడమే కాకుండా మ్యాచ్‌‌ ఫలితాన్నే శాసించింది.  సొంతగడ్డపై ఆడిన 5 టెస్టుల్లో స్పిన్నర్లు 37 వికెట్లు తీస్తే పేసర్లు 59 వికెట్లు పడగొట్టారు. ఇక 2019 మొత్తం పరిశీలిస్తే పేసర్లకు 95 వికెట్లు దక్కాయి. ఈ లెక్కలే ఇండియా పేసర్ల బౌలింగ్‌‌ పదునేంటో చూపిస్తున్నాయి. ఇక హిస్టారికల్‌‌ డే నైట్ మ్యాచ్‌‌లో బంగ్లాదేశ్‌‌ కోల్పోయిన 19 వికెట్లు పేసర్లకే దక్కడం విశేషం. బంతి నుంచి లభించిన సహకారాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న ఈ త్రయం ఇండియా స్పిన్నర్లకు ఏ మాత్రం అవకాశమే లేకుండా చెలరేగింది.

టచ్‌‌లోకి రహానె, పుజారా..

వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలతో వైస్ కెప్టెన్‌‌ అజింక్యా రహానె.. గత ఐదు ఇన్నింగ్స్‌‌లో నాలుగు హాఫ్ సెంచరీలతో చతేశ్వర్ పుజారా టచ్‌‌లోకి రావడం కోహ్లీసేన బ్యాటింగ్‌‌ లైనప్‌‌కు అదనపు బలం. ఈ క్లాసిక్ ప్లేయర్స్‌‌ నిలకడగా రాణించడంతో ఇండియా మిడిలార్డర్‌‌‌‌ మరింత పటిష్టంగా మారింది. ముఖ్యంగా బంగ్లా సిరీస్‌‌లో వారి ఫియర్‌‌‌‌లెస్‌‌ గేమ్‌‌ ఆకట్టుకుంది. వారి కెరీర్‌‌‌‌లోనే ఓ సిరీస్‌‌లో మూడు అత్యుత్తమ స్ట్రయిక్‌‌ రేట్‌‌లలో ఈ సిరీస్‌‌ (రహానె 56.86), (పుజారా 61.58) ఒకటి.

సూపర్‌‌ సాహా ..

గాయాలతో జట్టుకు దూరమైన వికెట్‌‌కీపర్ వృద్ధిమాన్ సాహా.. ఈ సీజన్‌‌లో రీ ఎంట్రీ ఇస్తూ తనదైన పెర్ఫామెన్స్‌‌ కనబర్చాడు. అతని గైర్హాజరీలో  కీపర్‌‌‌‌గా వ్యవహరించిన రిషబ్‌‌ పంత్‌‌ ఆకట్టుకోకపోవడంతో సాహాకు మళ్లీ పిలుపు అందింది. ఈ అవకాశాన్ని సాహా రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. బ్యాట్‌‌తో మెరువకపోయినా.. తన కీపింగ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. కళ్లు చెదిరే క్యాచ్‌‌లతో.. ఔరా అనే తన కీపింగ్ విన్యాసాలతో అదరగొట్టాడు. ఎంతలా అంటే ప్రపంచంలోనే సాహా బెస్ట్‌‌ కీపర్‌‌‌‌ అని కెప్టెన్‌‌ కోహ్లీ నోట వచ్చేలా. అయితే బ్యాట్‌‌తో ఇబ్బంది పడుతున్న సాహా.. 2020లో కూడా జట్టుతో కొనసాగుతాడా? అనేదే మిలియన్‌‌ డాలర్ల ప్రశ్న. పైగా వచ్చే ఏడాది కోహ్లీసేన ఎక్కువగా విదేశాల్లోనే  టెస్టులు ఆడనుంది. అక్కడ సాహాకు ఒక్క కీపింగ్ నైపుణ్యమే సరిపోదు. బ్యాట్‌‌తోను రాణించాల్సిందే.

స్పిన్నర్ల పరిస్థితి..?

పేసర్ల జోరు కొనసాగుతున్న వేళ స్పిన్నర్ల ఫ్యూచర్‌‌ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వెస్టిండీస్‌‌ టూర్‌‌లో బెంచ్‌‌కే పరిమితమైన అశ్విన్‌‌.. హోమ్‌‌సీజన్‌‌లో 20 వికెట్లు తీశాడు. అయితే, 2021 వరకు మళ్లీ  ఇండియాలో టెస్టులు లేకపోవడం జట్టులో అతని చోటు ప్రశ్నార్థకమే. జడేజా  హోమ్‌‌ సీజన్‌‌లో 13 వికెట్లే పడగొట్టినప్పటికీ ఆరో స్థానంలో బ్యాట్‌‌తో మెరుస్తున్నాడు. దాంతో, ఆల్‌‌రౌండర్‌‌‌‌గా అతని స్థానానికి ఢోకాలేకపోవచ్చు. అయితే, వచ్చేఏడాది విదేశీ సిరీస్‌‌లే కావడం.. స్పిన్నర్ల అవసరం పెద్దగా   ఉండకపోవచ్చనే అనిపిస్తోంది. ఫారిన్‌‌లో రిస్ట్ స్పిన్నర్ల ప్రభావమే ఎక్కువ కాబట్టి అశ్విన్​ కంటే కుల్దీప్‌‌ యాదవ్​కే అవకాశాలున్నాయి.

ఓపెనర్లు దొరికారు..

హోమ్‌‌సీజన్‌‌లో టీమిండియాకు లాభం చేకూర్చిన మరో అంశం ఓపెనింగ్ జోడీ. కొంత కాలంగా సరైన ఓపెనింగ్ జోడీ లేక ఇంటా బయట ఇబ్బంది పడ్డ కోహ్లీసేనకు ఈ సీజన్‌‌లో పరిష్కారం లభించింది. యంగ్ క్రికెటర్‌‌‌‌ మయాంక్ అగర్వాల్‌‌ ఒక స్థానాన్ని భర్తీ చేసినా.. మరో ఎండ్‌‌లో శిఖర్ ధవన్ ఫిట్‌‌నెస్‌‌ కోల్పోవడం.. అతని స్థానంలోకి వచ్చిన పృథ్వీషా గాయం, బీసీసీఐ బ్యాన్‌‌తో దూరమవ్వడం.. కేఎల్ రాహుల్ విఫలమవడం మేనేజ్‌‌మెంట్‌‌కు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో  లిమిటెడ్‌‌ ఫార్మాట్‌‌లో ఓపెనర్‌‌‌‌గా సూపర్‌‌‌‌ హిట్టైన హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌ శర్మను మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఫార్ములాతో టెస్ట్​ ఫార్మాట్‌‌లో చేసిన ప్రయోగం గ్రాండ్ సక్సెస్‌‌ అయింది. ఆడిన తొలి మ్యాచ్‌‌లోనే హిట్‌‌మ్యాన్‌‌ డబుల్‌‌ సెంచరీతో మెరవడం.. ఆ తర్వాత కూడా మరో ఓపెనర్ మయాంక్‌‌తో సమన్వయంగా రాణించడంతో ఓ పెద్ద సమస్యకు ఫుల్‌‌స్టాప్‌‌ పడింది. ఈ సీజన్‌‌ ఐదు మ్యాచ్‌‌ల్లో  జట్టు విజయాల్లో  ఈ జోడీకి డిస్టింక్షన్​ ఇవ్వొచ్చు.

ఫీల్డింగ్‌‌ ఒక్కటే..

ఈ సీజన్‌‌లో టీమిండియా నిరాశ పరిచిన డిపార్ట్​మెంట్​ ఫీల్డింగ్. ముఖ్యంగా స్లిప్‌‌ క్యాచింగ్‌‌పై  జట్టు మరిన్ని కసరత్తులు చేయాలి. ఈ సీజన్‌‌లో ఇండియా ప్లేయర్లు మొత్తం 14 క్యాచ్‌‌లు వదిలేశారు. ఇందులో 7 ఈజీ క్యాచ్‌‌లు కాగా మరో ఏడు టఫ్​.  బంగ్లాదేశ్‌‌తో ఫస్ట్​ టెస్ట్‌‌లోనైతే  ఫీల్డర్లు తేలిపోయారు.  ఏకంగా 5 క్యాచ్‌‌లు డ్రాప్​ అయ్యాయి.  ఇందులో రహానె ఒక్కడే మూడు క్యాచ్‌‌లు వదిలేయగా.. రోహిత్, కోహ్లీ చెరోటి డ్రాప్‌‌ చేశారు. పేసర్లు చెలరేగుతున్న వేళ ఇండియా స్లిప్‌‌ ఫీల్డింగ్ మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. ‌‌