గురి అదిరింది: 2019లో దుమ్ముదులిపిన షూటర్లు

గురి అదిరింది: 2019లో దుమ్ముదులిపిన షూటర్లు

షూటింగ్‌ లో టాప్‌‌ లెవె ల్‌ లో ఇండియా
ఫేవరెట్స్‌ గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి

ఇండియా షూటింగ్‌‌ చరిత్రలోనే ఈ ఏడాది ఓ మైలురాయిలా నిలిచిపోతుంది. వరుస విజయాలు, మెడల్స్‌‌తో షూటింగ్‌‌లో ఇండియా దశ, దిశను మార్చింది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు, అంచనాలు పెంచింది. షూటర్లంతా గురి తప్పకుండా టార్గెట్‌‌ను కొట్టడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. ముఖ్యంగా యువ షూటర్లు టోర్నమెంట్‌‌, వేదిక, ప్రత్యర్థి, కేటగిరీ లాంటి విషయాలతో సంబంధం లేకుండా మెడల్స్‌‌ కొల్లగొట్టారు. కొన్ని ఇంటర్నేషనల్‌‌ ఈవెంట్ల మెడల్‌‌ ట్యాలీలను చూస్తే.. ఇది డొమెస్టిక్‌‌ టోర్నమెంట్‌‌ ఏమో అని సందేహం కలిగేలా చేశారు. మనోళ్లు సాధించిన ఒలింపిక్‌‌ బెర్త్‌‌ల సంఖ్య చూస్తే  చాలు.. షూటింగ్‌‌ రేంజ్‌‌లో ప్రస్తుతం ఇండియా లెవెల్‌‌ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది.

యువ రక్తం

యువ రక్తం వల్లే ఇండియా ఈ ఏడాది షూటింగ్‌‌ రేంజ్‌‌లో అద్భుతాలు చేసింది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, షూటింగ్‌‌ రేంజ్‌‌లో మెడల్‌‌ గెలిచిన వెంటనే ఎగ్జామ్‌‌ హాల్‌‌కు పరుగెత్తినోళ్లు.. ఇలాంటి యువత ఎంతో మంది షూటింగ్‌‌ రేంజ్‌‌లో జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. ఈ ఏడాది జరిగిన రైఫిల్‌‌– పిస్టల్‌‌ వరల్డ్‌‌కప్‌‌లు, ఫైనల్స్‌‌ అన్నింటిలోనూ ఇండియన్‌‌ షూటర్లే ఆధిపత్యం చూపెట్టారు. ఓవరాల్‌‌గా ఆయా మెగా ఈవెంట్‌‌ల్లో 21 గోల్డ్‌‌, 6 సిల్వర్‌‌, 3 బ్రాంజ్‌‌ మెడల్స్‌‌ ఇండియాకు వచ్చాయి. వీటితోపాటు రికార్డు స్థాయిలో 15 ఒలింపిక్‌‌ కోటాలు దక్కాయి. 2012 లండన్‌‌ ఒలింపిక్స్‌‌లో దక్కిన రెండు మెడల్స్‌‌.. షూటింగ్‌‌లో ఇండియాకు ఒలింపిక్‌‌ బెస్ట్‌‌. కానీ ఇప్పుడున్న యువ షూటర్ల దూకుడు చూస్తుంటే టోక్యోలో ఈ రికార్డు కనుమరుగవ్వడం ఖాయమనిపిస్తోంది.

అసోసియేషన్‌‌దే కీ రోల్‌‌

షూటింగ్‌‌ రేంజ్‌‌లో చిన్నాపెద్దా తేడా లేకుండా షూటర్లు అందరూ సత్తా చాటడం వెనుక నేషనల్‌‌ రైఫిల్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఎన్‌‌ఆర్‌‌ఏఐ) పాత్ర కీలకం. రియో ఒలింపిక్స్‌‌లో ఎదురైన పరాభవం తర్వాత బోర్డు ఆలోచనా విధానం మారింది. అదే ఇండియా షూటింగ్‌‌ ముఖచిత్రాన్ని  మార్చింది. అభినవ్‌‌ బింద్రా నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన సూచనల మేరకు ఎన్నో మార్పులు చేపట్టింది. షూటర్ల ట్రైనింగ్‌‌, ప్రాక్టీస్‌‌ నుంచి బోర్డు పాలసీ దాకా ఎన్నో మార్పులు చేసుకుంది.  కాసుల వర్షం కురిపించే కమర్షియల్‌‌ కాంట్రాక్టులకు షూటర్లను దూరంగా ఉంచడం.. షూటర్ల కెరీర్‌‌ విషయంలో తల్లిదండ్రుల జోక్యం లేకుండా ఒప్పందాలు చేసుకోవడం లాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇలాంటి చర్యలతో తొలుత విమర్శలు ఎదుర్కొన్నా..  ఆ తర్వాత  మిగిలిన స్పోర్ట్స్‌‌ బాడీలకు ఓ రోల్‌‌ మోడల్‌‌గా మారింది.

టాలెంట్‌‌ హంట్‌‌లో సక్సెస్‌‌

యంగ్‌‌ టాలెంట్‌‌ను కనిపెట్టడం కోసం ఎన్‌‌ఆర్‌‌ఏఐ చాలా కృషి చేసింది. జస్పాల్‌‌ రాణా, సమరేశ్‌‌ జంగ్‌‌ లాంటి వ్యక్తుల సహకారంతో ఓ జూనియర్‌‌ ప్రోగ్రామ్‌‌ను నిర్వహించి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసింది. మను భాకర్‌‌, సౌరభ్‌‌ చౌదరి, దివ్యాన్ష్‌‌ సింగ్‌‌ పన్వార్‌‌, ఎలవెనిల్‌‌ వెలారివన్‌‌ లాంటోళ్లు ఇలా వచ్చినోళ్లే. ఈ యువతతోపాటు సంజీవ్‌‌ రాజ్‌‌పుత్‌‌, తేజస్విని సావంత్‌‌ లాంటి సీనియర్లు కూడా సత్తా చాటడంతో ఈ ఏడాది జరిగిన అన్ని వరల్డ్‌‌కప్‌‌ల్లోనూ ఇండియా టాప్‌‌ ప్లేస్‌‌ సాధించింది. అయితే టోక్యో ఒలింపిక్స్‌‌లో కూడా ఇదే ఆధిపత్యాన్ని అసోసియేషన్ కోరుకుంటోంది.

బెంచ్‌‌ కూడా బలంగా

ఎన్‌‌ఆర్‌‌ఏఐ చర్యలతో ఇండియా రిజర్వ్‌‌ బెంచ్‌‌ కూడా బలంగా ఉంది. ఇందుకు జీనా ఖిట్టా, ఆయూషి పొద్దెర్‌‌ లాంటి వాళ్లే నిదర్శనం. హిమాచల్‌‌ ప్రదేశ్‌‌కు చెందిన 18 ఏళ్ల జీనా ఖిట్టా ఎయిర్‌‌ రైఫిల్‌‌ ఈవెంట్‌‌లో సంచలనమే సృష్టించింది. మెహులీ ఘోష్‌‌, అపూర్వి చండీలాకు షాకిస్తూ నేషనల్స్‌‌లో గోల్డ్‌‌ మెడల్‌‌ సాధించింది. అదేవిధంగా దోహాలో జరిగిన ఏషియన్‌‌ షూటింగ్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌లో  50 మీటర్ల రైఫిల్‌‌ 3 పొజిషన్స్‌‌ టీమ్‌‌ ఈవెంట్‌‌లో ఆయూషి పొద్దెర్‌‌ సిల్వర్‌‌ మెడల్‌‌ గెలిచింది.

అదొక్కటే బాధ

ఏడాది ఆసాంతం మెడల్స్‌‌ వర్షంతో జోష్‌‌లో ఉన్న ఇండియా షూటింగ్‌‌పై కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌ ఫెడరేషన్‌‌ (సీజీఎఫ్‌‌) పిడుగు వేసింది. ఇండియాకు ఎక్కువ మెడల్స్‌‌ అందించే షూటింగ్‌‌ను 2022లో బర్మింగ్‌‌హమ్‌‌ వేదికగా జరిగే కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌ నుంచి తొలగించింది. . ఎన్‌‌ఆర్‌‌ఏఐతోపాటు  ఇంటర్నేషనల్‌‌ షూటింగ్‌‌ స్పోర్ట్‌‌ ఫెడరేషన్‌‌ ఎంత ఒత్తిడి తెచ్చినా సీజీఎఫ్‌‌ వెనక్కి తగ్గడం లేదు.

ఒకరిని మించి ఇంకొకరు

షూటింగ్‌‌లోని అన్ని కేటగిరీల్లో ఈ ఏడాది ఇండియా షూటర్ల హవా కొనసాగింది. మెడల్స్‌‌ వేటలో ఒకరితో ఒకరు పోటీపడ్డారు. ముఖ్యంగా 10 మీటర్ల ఫీల్డ్‌‌ ఈవెంట్‌‌లో ఇండియా ఆధిపత్యానికి ఎదురేలేకుండాపోయింది. అపూర్వి చండీలా, అంజుమ్​ మౌద్గిల్‌‌, ఎలవెనిల్‌‌ ఈ కేటగిరీ వరల్డ్‌‌ ర్యాంకింగ్స్‌‌లో వరుసగా టాప్‌‌–3లో ఉన్నారు. ఇక, కెరీర్‌‌పరంగా 2019లో సంజీవ్‌‌ రాజ్‌‌పుత్‌‌ స్పీడ్‌‌ చూస్తే ముక్కు మీద వేలువేసుకోక తప్పదు. రియో వరల్డ్‌‌కప్‌‌ మెన్స్‌‌ 50 మీటర్ల రైఫిల్‌‌ 3 పొజిషన్‌‌ ఈవెంట్‌‌లో సిల్వర్‌‌ మెడల్‌‌ గెలిచిన సంజీవ్‌‌ ఒలింపిక్‌‌ కోటా కూడా దక్కించుకున్నాడు. అంతేనా వరల్డ్‌‌ ర్యాంకింగ్‌‌లో 75 నుంచి ఏకంగా ఎనిమిదో ప్లేస్‌‌కు చేరాడు.