టోక్యో: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ టోర్నీ 2026 విజేతగా నిలిచింది. ఆదివారం (జులై 19) జరిగిన ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ పోరులో ప్రపంచ ఛాంపియన్ అకానె యమగుచిపై 21-17, 21-17 తేడాతో సింధు చారిత్రాత్మక విజయం సాధించింది. తద్వారా తన ఏడేళ్ల మేజర్ టైటిల్ నిరీక్షణకు తెరదించడంతో పాటు జపాన్ ఓపెన్ టోర్నీ టైటిల్ గెల్చుకున్న తొలి భారత మహిళా షట్లర్‌గా తెలుగు తేజం సింధు నయా చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ టోర్నీగా విజేతగా నిలిచిన పీవీ సింధుకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వరుస సెట్లలో మట్టికరిపించిన సింధు:
ఆదివారం (జులై 19) జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో మెరుపుల్లాంటి స్మాష్‌లు, వ్యూహాత్మక డ్రాప్ షాట్‌లతో మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన యమగూచిపై సింధు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ఆట మొదటి నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కొంచెం కూడా ఒత్తిడికి గురికాకుండా సింధు చాలా దూకుడుగా ఆట కొనసాగించింది.
సొంత గడ్డపై యమగుచిని కేవలం 50 నిమిషాల్లోనే భారత షట్లర్ మట్టికరిపించింది. యమగూచి ప్రతిఘటించే ప్రయత్నం చేసిన సింధు ఆ అవకాశం ఇవ్వలేదు. 21-17, 21-17 తేడాతో వరుస సెట్లలో భారత షట్లర్ విజయం సాధించింది. తద్వారా తొలిసారి జపాన్ ఓపెన్ టైటిల్‌ను సింధు కైవసం చేసుకుంది.
అంతేకాకుండా ఈ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్ గా సింధు రికార్డ్ క్రియేట్ చేసింది. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత ఆమె గెలుచుకున్న మేజర్ టైటిల్ ఇదే. దీంతో మేజర్ టైటిల్ కోసం సింధు ఏడేళ్ల నిరీక్షణ ముగిసింది. ఈ విజయంతో యమగుచిపై తన హెడ్-టు-హెడ్ రికార్డ్‌ను సింధు 16-14కు పెంచుకుంది.
