ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన భారత వెయిట్ లిఫ్టర్లు

ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన భారత వెయిట్ లిఫ్టర్లు

వరల్డ్ ర్యాంకింగ్స్ ద్వారా అర్హత సాధించిన అథ్లెట్లు
వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ప్రకారం టాప్ 8లో ఉన్నవారికే అర్హత
జెరెమీ లాల్రినుంగా 2వ స్థానంలో, మీరాబాయి చాను 8వ స్థానంలో

కరోనా వార్తలతో విసిగిపోయిన భారత ప్రజలకు భారతీయ వెయిట్ లిఫ్టింగ్‌ శుభవార్త తెలిపింది. వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేసిన టోక్యో 2020 ఒలంపిక్స్ కోసం మీరాబాయి చాను మరియు జెరెమీ లాల్రినుంగా సెలక్ట్ అయినట్లు భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య అధ్యక్షుడు సహదేవ్ యాదవ్ తెలిపారు. వెయిట్ లిఫ్టింగ్ లో టాప్ 8లో ఉన్న వెయిట్ లిఫ్టర్లు మాత్రమే టోక్యో ఒలింపిక్స్ కు అర్హత పొందుతారు. మీరాబాయి ప్రస్తుతం 8వ స్థానంలో మరియు జెరేమీ అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ర్యాంకింగ్ జాబితాలో 2వ స్థానంలో ఉండటంతో వారిరువురు ఒలంపిక్స్ కు అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు.

అథ్లెట్లు ఒలంపిక్స్ కు ఎంపికయిన సందర్భంగా సహదేవ్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఇద్దరు లిఫ్టర్లపై ఎటువంటి సందేహం లేదు. ప్రపంచ ర్యాంకింగ్స్ ప్రకారం వారు అర్హత సాధించారు. జెరెమీ ఆసియాలోనే టాప్ లిఫ్టర్. అతను ఒలంపిక్స్ లో ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నాడు’ అని యాదవ్ అన్నారు.

‘భారత వెయిట్ లిఫ్టింగ్ క్యాంప్ ఎన్ఐఎస్ పాటియాలా వద్ద ఉంది. ప్రస్తుత కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. అథ్లెట్లు మరియు వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ క్యాంప్ అంతా చాలా సురక్షితంగా ఉంది. ఒక్కో గదికి ఒక్కో అథ్లెట్‌ మాత్రమే ఉంటారు. లిఫ్టర్లు వారి సోంత రాష్ట్రాలకు వెళ్లినట్లయితే కరోనా బారిన పడే అవకాశముంది. అందుకే వారు ఇక్కడ ఉండటమే మంచిది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో చర్చించినట్లుగానే కోచ్‌లు అథ్లెట్లకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం లిఫ్టర్లకు 25 కిలోల బరువు మాత్రమే ఇచ్చి ప్రాక్టిస్ చేయిస్తున్నాం. ఇప్పుడే వారికి పూర్తి బరువులు ఇచ్చి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీరిద్దరే కాకుండా మరికొంతమంది భారత అథ్లెట్లు కూడా ఒలంపిక్స్ కు అర్హత సాధించగలరని నేను ఆశిస్తున్నాను. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో బాగా రాణించిన రాఖీ హాల్డర్ మీద మాకు చాలా ఆశలు ఉన్నాయి. మరో అథ్లెట్ అజయ్ సింగ్ మీద కూడా నాకు నమ్మకం ఉంది. తదుపరి అర్హత పోటీలలో వీరిద్దరూ అర్హత సాధించడానికి అవకాశాలున్నాయి’ అని సహదేవ్ యాదవ్ అన్నారు.

లాక్డౌన్ వల్ల చాలా మంది అథ్లెట్లు బోర్ గా ఫీలయి విసుగు చెందుతున్నారని వస్తున్న వార్తలను సహదేవ్ యాదవ్ ఖండించారు. ‘వెన్నునొప్పి కారణంగా మీరాబాయి చాను చాలా కాలం వెయిట్ లిఫ్టింగ్ కు దూరం అయింది. కరోనా వల్ల టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. దాంతో మీరాబాయి తన ఆటను మెరుగుపరచుకోవడానికి మంచి సమయం దొరికింది’ అని యాదవ్ అన్నారు.

For More News..

8 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్.. తల్లికి మాత్రం నెగెటివ్.. అలా ఎలా?

లాక్డౌన్ వల్ల ఒక్క ఊరులోనే 1600 పెళ్లిళ్లు వాయిదా

ఏప్రిల్ 20 తర్వాత కూడా లాక్డౌన్ సడలించం