చైనా నుంచి రెండు విమానాల్లో ఇండియాకు…

చైనా నుంచి రెండు విమానాల్లో ఇండియాకు…

హమ్మయ్య.. వచ్చినం

చైనా నుంచి రెండు విమానాల్లో ఇండియాకు చేరిన 654 మంది

మనోళ్లు కరోనా నరక కూపం నుంచి బయటపడ్డారు. సొంత దేశానికి తిరిగొచ్చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్​తో వారంతా ఇండియాకు చేరుకున్నారు. వుహాన్​లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం ఈ ఆపరేషన్​ చేపట్టింది. రెండు విమానాల్లో ఏడుగురు మాల్దీవ్స్​కు చెందిన వారు సహా 654 మందిని ఎయిరిండియా జంబో బీ747 ఫ్లైట్లలో ఢిల్లీకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. వాళ్లందరినీ ఢిల్లీలో ఏర్పాటు చేసిన క్వారెంటైన్​ (ఐసోలేటెడ్​ వార్డులు)లకు తీసుకెళ్లారు. రెండు వారాల పాటు అబ్జర్వేషన్​లో పెడతారు. వైరస్​ సోకలేదని తేలితేనే ఇంటికి పంపుతారు. తొలి రౌండ్​లో భాగంగా శనివారం తెల్లవారు జామున 324 మందిని ఇండియాకు తీసుకొచ్చారు. అందులో ఏపీకి చెందినోళ్లు 56 మంది ఉన్నారు. రెండో ఫ్లైట్​లో భాగంగా 323 మంది ఇండియన్లు, ఏడుగురు మాల్దీవ్స్​ జనాలను తీసుకొచ్చారు. రెండు విమానాల్లోనూ ఢిల్లీ రామ్​ మనోహర్​ లోహియా (ఆర్​ఎంఎల్​) ఆస్పత్రికి చెందిన ఐదుగురు స్పెషలిస్ట్​ డాక్టర్లు ఉన్నారు.

ఆరుగురిని అనుమతించలేదు

మరో వంద మంది దాకా హ్యూబీ ప్రావిన్స్​ (హువాన్​ సిటీ ఉండే రీజియన్​)లో ఉండి ఉండొచ్చని చైనాలో ఇండియన్​ అంబాసిడర్​ విక్రమ్​ మిస్రి చెప్పారు. జ్వరం ఎక్కువగా ఉండడంతో మొదటి ఫ్లైట్​కు ఆరుగురిని, రెండో ఫ్లైట్​కు నలుగురిని అనుమతించలేదన్నారు. మరో 25 మంది స్వచ్ఛందంగా అక్కడే ఉండేందుకు డిసైడ్​ అయ్యారని వివరించారు. ఇప్పటిదాకా చేపట్టిన కష్టమైన ఆపరేషన్లలో ఇదీ ఒకటని ఆయన అన్నారు. వైరస్​కు మూలమైన వుహాన్​ సిటీలో చేయడమే అందుకు కారణమన్నారు.  సిటీలో ఇండియన్లు గుర్తించడం, వాళ్ల అడ్రస్​లను వెతికి తీసుకురావడం తలకు మించిన పనే అయిందన్నారు. మన ఎంబసీ అధికారులు చైనా అధికారుల సహకారంతో ప్రత్యేక బస్సుల ద్వారా వాళ్లందరినీ ఎయిర్​పోర్టుకు తీసుకొచ్చారన్నారు. కాగా, చైనా వాళ్లకు, చైనాలోని విదేశీయులకు ఈ–వీసా సిస్టమ్​ను ఇండియా రద్దు చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు బీజింగ్​లోని ఇండియన్​ ఎంబసీ ప్రకటించింది. ఇండియాకు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉన్న వాళ్లు మాత్రం బీజింగ్​లోని ఇండియన్​ ఎంబసీ, షాంఘై లేదా గ్వాంగ్జూల్లోని కాన్సులేట్​ ఆఫీస్​, ఆయా సిటీల్లోని ఇండియన్​ వీసా అప్లికేషన్​ సెంటర్లకు నేరుగా వచ్చి వీసాకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

రెండో కేసు నమోదు

కాగా, మన దేశంలో కరోనా రెండో కేసు నమోదైంది. కేరళకు చెందిన మరో వ్యక్తికీ ఈ వైరస్​ సోకింది. ఇంతకుముందు చైనాకు వెళ్లి వచ్చిన ఆ వ్యక్తికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్​ వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో అతడిని ఐసోలేటెడ్​ వార్డులో పెట్టి ట్రీట్​మెంట్​ ఇస్తున్నామని చెప్పారు. అతడి కండిషన్​ మామూలుగానే ఉందని, అన్ని దగ్గరుండి చూసుకుంటున్నామని చెప్పారు. కాగా, కరోనా వైరస్​ వల్ల చనిపోయిన వారి సంఖ్య 305కు చేరింది. చైనా అవతల తొలి మరణం ఫిలిప్పీన్స్​లో నమోదైంది.  అక్కడ చనిపోయిందీ చైనా దేశీయుడే. అతడు జనవరి 21న వుహాన్​ నుంచి ఫిలిప్పీన్స్​కు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 14,562కు చేరింది.

ప్లీజ్​.. నా బిడ్డను పంపించండి

ఆమె పేరు హూ పింగ్​. వయసు 26 ఏళ్లు. ఉండేది హ్యూబీ ప్రావిన్స్​. బ్లడ్​ కేన్సర్​ (లుకేమియా)తో బాధపడుతోంది. ఆమెకు ట్రీట్​మెంట్​ తప్పనిసరి. కానీ, సిటీలు బంద్​పెట్టే.. వేరే సిటీల్లోకి అక్కడి నుంచి రానియ్యట్లేదాయే. అయితే, ఎలాగో కష్టపడి యాంగ్జీ నది బ్రిడ్జి దాకా హూ పింగ్​ను తీసుకెళ్లగలిగింది ఆమె 50 ఏళ్ల అమ్మ లూ యుజిన్​. ‘‘నా బిడ్డను పంపించండి. ఆమెకు కేన్సర్​.  జియుజియాంగ్​లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ట్రీట్​మెంట్​ చేయించాలి’’ అని అధికారుల కాళ్లావేళ్లా పడింది. కానీ, అక్కడ గస్తీ కాస్తున్న అధికారులు మాత్రం కరగలేదు. తనను పోనివ్వకపోయినా తన కూతుర్నైనా పోనివ్వండంటూ వేడుకుంది. గంట పాటు వేడుకున్నా అధికారులు పంపలేదు. చివరకు అక్కడే ఉన్న రాయిటర్స్​ రిపోర్టర్​తో మాట్లాడడంతో పోలీసులు ముందుకు కదిలారు. పై అధికారులకు ఫోన్​ చేసి అంబులెన్సును రప్పించారు. అన్ని టెస్టులూ చేసి లూతో పాటు హూనూ హాస్పిటల్​కు పంపించారు.

ఆ మందు కోసం క్యూలు

ఓ వైపు కరోనా వ్యాక్సిన్​ తయారీకి సైంటిస్టులు కసరత్తులు చేస్తుంటే చైనాలో హెర్బల్​ మందులపై డిబేట్​ ఊపందుకుంది. తేనెపట్టు, పూల మొక్కలతో కరోనా పని పట్టొచ్చని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. వాటితో తయారు చేసిన షువాంగువాంగ్లియాన్​ అనే హెర్బల్​ మందు కరోనా వైరస్​కు బాగా పనిచేస్తుందని చైనీస్​ అకాడమీ ఆఫ్​ సైన్సెస్​ ప్రకటించడం, ఆ వార్తను చైనా అధికారిక మీడియా షిన్హువా ప్రసారం చేయడంతో ఆ మందును వెతుక్కుంటూ మందుల షాపుల ముందు జనం క్యూ కడుతున్నారు. ఇటు ఆన్​లైన్​లోనూ ఆ మందు కోసం ఆర్డర్లు ఎక్కువయ్యాయి. క్షణాల్లో స్టాకులు అమ్ముడైపోతున్నాయి. దీంతో కొన్ని చోట్ల ఆ మందుకు కొరత కూడా ఏర్పడింది. అయితే, ఆ మందును వాడిన వాళ్లు మాత్రం, దానితో ఏం లాభం లేదని తేల్చి చెబుతున్నారు. చైనా సోషల్​ మీడియా సైట్​ వీబీలో వీడియోలు పోస్ట్​ చేస్తున్నారు.

చైనాలో సొంతంగా అంత్యక్రియలు బంద్

కరోనా వైరస్​తో చనిపోయిన వారికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేయకుండా చైనా సర్కార్​ నిషేధించింది. శవాలతో ఊరేగింపులు, నివాళులర్పించడం వంటి వాటిని నిషేధించింది. ఈ మేరకు చైనా నేషనల్​ హెల్త్​ కమిషన్​ కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. చనిపోయిన వ్యక్తి బాడీని ముందుగా డిసిన్​ఫెక్టెంట్​తో శుభ్రం చేసి పూర్తిగా ప్యాక్​ చేయాలని, ఆ తర్వాతే ఫ్యామిలీలకు అప్పగించాలని హాస్పిటళ్లకు సూచించింది. మళ్లీ ఆ సీల్​ను తెరవకూడదని పేర్కొంది. తర్వాత మెడికల్​ ఆఫీసర్లు డెత్​ సర్టిఫికెట్​ ఇస్తారని, అప్పుడు వాళ్లు తమ ఇంటికి దగ్గర్లోని స్మశానాలకు ఫోన్​ చేసి చెప్పాలని సూచించింది. చివరగా స్మశానానికి సంబంధించిన వ్యక్తులు వచ్చి శవాన్ని తీసుకెళ్లి ఖననం చేస్తారని, దాంతో పాటు క్రిమేషన్​ సర్టిఫికెట్​ కూడా ఇస్తారని వెల్లడించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ తమ సొంతంగా అంత్యక్రియలను చేయకూడదని తేల్చి చెప్పింది. క్రిమేషన్​ టైంలో ఆ వ్యక్తి సంబంధీకులెవరికీ అనుమతి ఉండదని స్పష్టం చేసింది.

పాక్ తీస్కపోతలే

పాకిస్తాన్​ స్టూడెంట్లు వుహాన్​లో నరకం చూస్తున్నారు. ఇండియన్లను తరలించడం చూసి వాళ్లు హెల్ప్​ కోసం గగ్గోలు పెడుతున్నారు. ఇండియాలాగే తమనూ ఇంటికి తీసుకెళ్లాలని పాకిస్తాన్​ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కానీ, పాక్​ మాత్రం మేం తీసుకుపోలేం అని విద్యార్థులకు తేల్చి చెప్పేసింది. దీంతో స్టూడెంట్లు మండిపడుతున్నారు. ఇండియన్లను బస్సుల్లో తరలించే వీడియోను షేర్​ చేసి, పక్క దేశం తమ వారిని ఎంతో శ్రద్ధపెట్టి తీసుకెళ్తున్నా, పాక్​ ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టైనా లేదని మండిపడుతున్నారు. అక్కడే చావండన్న చందాన తమను వదిలేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. అయితే, వుహాన్​లోని స్టూడెంట్లను తీసుకొచ్చి ట్రీట్​మెంట్​ చేసేంత వైద్య సదుపాయాలు, ప్రమాణాలూ లేవని చైనాలో పాకిస్తాన్​ అంబాసిడర్​ నఘ్మానా హష్మి చెప్పారు. కాగా, అక్కడ 800 మంది స్టూడెంట్లున్నట్టు తెలుస్తోంది.