16,900 దిగువన నిఫ్టీ

16,900 దిగువన నిఫ్టీ
  • భారీగా తగ్గిన అదానీ గ్రూప్ స్టాక్స్ 

 

ముంబై: అమెరికాలో ఇన్​ఫ్లేషన్ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటం,  వృద్ధిపై ఆందోళనలు కొనసాగుతున్నందున సోమవారం ఇండియా ఈక్విటీ మార్కెట్లు నష్టపోయాయి. మెటల్, ఐటీ కంపెనీల షేర్లు బాగా పడ్డాయి. దీంతో  సెన్సెక్స్ 638 పాయింట్లు (1.11 శాతం) తగ్గి 56,789 వద్ద స్థిరపడింది. నిఫ్టీ  కూడా 207 పాయింట్లు  (1.21 శాతం) తగ్గి 16,887 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇండెక్స్ గరిష్టస్థాయి 17,114.65లను, కనిష్ట స్థాయి 16,921.25లను తాకింది. అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ 9 శాతం తగ్గడం  నిఫ్టీలో టాప్​ లూజర్​గా మిగిలింది.  దీని తర్వాత ఐషర్ మోటార్స్, మారుతీ సుజుకి, అదానీ పోర్ట్స్, హిందాల్కో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్‌‌‌‌యుఎల్, కోటక్ బ్యాంక్, ఐటిసి, హెచ్‌‌‌‌డిఎఫ్‌‌‌‌సి లైఫ్, బ్రిటానియా, ఎస్‌‌‌‌బిఐ,  టాటా మోటార్స్‌‌‌‌ రెండు శాతం నుంచి 6 శాతం మధ్య నష్టపోయాయి. ఒఎన్‌‌‌‌జిసి, సిప్లా, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బిపిసిఎల్, దివీస్ ల్యాబ్స్,  భారతీ ఎయిర్‌‌‌‌టెల్ లాభాలను సాధించాయి. బిఎస్‌‌‌‌ఇ మిడ్‌‌‌‌క్యాప్ 1.24 శాతం, స్మాల్‌‌‌‌క్యాప్ 0.5 శాతం తగ్గడంతో బ్రాడ్ మార్కెట్‌‌‌‌లు నష్టపోయాయి.  బీఎస్​ఈలో దాదాపు 1,400 స్టాక్‌‌‌‌లు లాభపడగా, 2,100 కంటే ఎక్కువ స్టాక్‌‌‌‌లు రెడ్‌‌‌‌లో ఉన్నాయి.  

రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్  ఒక శాతం లాభపడింది. మిగిలిన అన్ని సూచీల్లో ప్రాఫిట్ బుకింగ్‌‌‌‌ కనిపించింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 3 శాతం తగ్గగా, నిఫ్టీ పిఎస్‌‌‌‌యు బ్యాంక్ ఇండెక్స్ (2.7 శాతం),  నిఫ్టీ ఎఫ్‌‌‌‌ఎంసిజి,  ఆటో ఇండెక్స్‌‌‌‌లు  ఒక్కొక్కటి 2 శాతం చొప్పున నష్టపోయాయి.  గ్లోబల్ మార్కెట్లను పరిశీలిస్తే టోక్యో స్టాక్‌‌‌‌లు సోమవారం నెగటివ్​గా ప్రారంభమయ్యాయి, వాల్ స్ట్రీట్‌‌‌‌లో నష్టాలు కొనసాగాయి. ఎర్లీ ట్రేడ్‌‌‌‌లో బెంచ్‌‌‌‌మార్క్ నిక్కీ 225 ఇండెక్స్ 231.30 పాయింట్లు తగ్గి 25,705.91 వద్ద ఉంది. టాపిక్స్ ఇండెక్స్ 13.48 పాయింట్లు పడిపోయి 1,822.46 వద్దకు చేరుకుంది.  

ఇదిలా ఉంటే, దేశీయ ఈక్విటీలలో భారీ అమ్మకాల ఒత్తిడి,  ముడి చమురు ధరల పెరుగుదల  కారణంగా రూపాయి  డాలర్‌‌‌‌తో పోలిస్తే 49 పైసలు పడిపోయి 81.89 (తాత్కాలిక) వద్ద ముగిసింది.   ఇంటర్‌‌‌‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌‌‌‌లో రూపాయి 81.65 వద్ద బలహీనంగా ప్రారంభమై డాలర్​కు వ్యతిరేకంగా 81.98కి పడిపోయింది. చివరకు గత ముగింపుతో పోలిస్తే 49 పైసలు తగ్గి 81.89 వద్ద ముగిసింది. మునుపటి సెషన్‌‌‌‌లో డాలర్​ పోలిస్తే రూపాయి 81.40 వద్ద సెటిల్​అయింది.