ఐదేళ్లు పూర్తి చేసుకున్నమామ్

ఐదేళ్లు పూర్తి చేసుకున్నమామ్

సరిగ్గా ఐదేళ్ల క్రితం.. అంటే 2014 సెప్టెంబర్​ 24.. ఇస్రో కీర్తి కిరీటంలో ‘ఎర్ర’ గులాబీ చేరిన రోజు ఇది. మంగళ్​యాన్​ అలియాస్​ మామ్​ ప్రయోగం గురించే మాట్లాడేది. 2013 నవంబర్​ 5న పంపిన మామ్​.. అంగారకుడి కక్ష్యలోకి చేరిన రోజు. మంచంద్రయాన్​ 2 ప్రయోగం సక్సెస్​ అయినా విక్రమ్​ ఫెయిలవడంపై యావత్​ భారతావని చాలా బాధపడింది. ఆ బాధను మరిచేలా ఇస్రో చేపట్టిన మామ్​ అంగారకుడి చుట్టూ తిరుగుతోంది. నిజానికి మామ్​ను ఆరు నెలలే పనిచేసేలా డిజైన్​ చేసినా ఐదేళ్లవుతున్నా మార్స్​ చుట్టూ తిరుగుతూనే ఉంది. అమెరికా, రష్యా, యూరోపియన్​ స్పేస్​ ఏజెన్సీల తర్వాత మార్స్​ ప్రయోగం చేసిన నాలుగో దేశంగా ఇండియా నిలిచింది. ఒక్కసారి మంగళ్​యాన్​ను గుర్తు చేసుకుందాం.

పీఎస్​ఎల్​వీ ఎక్స్​ఎల్​తో ప్రయోగం

నిజానికి 2008 నవంబర్​ 23నే మామ్​ ప్రయోగంపై ఇస్రో ప్రకటన చేసింది. జీఎస్​ఎల్వీ రాకెట్​తో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపాలని భావించింది. కానీ, ప్రయోగానికి ముందు 2010లో జీఎస్​ఎల్​వీ రాకెట్​ రెండు సార్లు ఫెయిలవడంతో దానిని పక్కనపెట్టింది. పీఎస్​ఎల్​వీతో పంపిద్దామంటే, ప్రయోగానికి సంబంధించి దాని శక్తి సరిపోదాయె. అందుకే పీఎస్​ఎల్​వీలోనే కొంచెం శక్తిమంతమైన పీఎస్​ఎల్​వీ ఎక్స్​ఎల్​ సీ25 రాకెట్​తో ప్రయోగం చేశారు. అనుకున్న టైంకు భూ కక్ష్యను దాటి మామ్​ను కక్ష్యలోకి చేర్చింది రాకెట్​. దాదాపు 20 రోజుల పాటు (నవంబర్​ 25) వరకు భూ కక్ష్యలోనే మామ్​ గడిపింది. ఆ టైంలో ఏడు సార్లు దాని కక్ష్యను మార్చారు. 25వ తేదీన ట్రాన్స్​ మార్స్​ ఆర్బిట్​లోకి మామ్​ను చేర్చారు. అక్కడి నుంచి 298 రోజులు దాన్లోని ఇంజన్లతో ప్రయాణించిన మామ్​, 2014 సెప్టెంబర్​ 24న మార్స్​ కక్ష్యలోకి చేరింది. ఈ ప్రయోగానికి ఇస్రోకు అయిన ఖర్చు కేవలం ₹450 కోట్లు. హాలీవుడ్​ సినిమా గ్రావిటీకి అయిన ఖర్చులో సగానికి సగం. ఆ టైంలో ఇస్రోకు కె. రాధాకృష్ణన్​ చైర్మన్​గా ఉన్నారు.

ఇదీ స్పేస్​క్రాఫ్ట్​

మార్స్​ ఉపరితలాన్ని స్టడీ చేసేందుకు, దాని వాతావరణంలోని మీథేన్​, కార్బన్​ డయాక్సైడ్​లను విశ్లేషించేందుకు, సౌర గాలుల తీవ్రతను తెలుసుకునేందుకు మామ్​ ప్రయోగాన్ని చేసింది ఇస్రో. అందుకుగానూ ఐ–1కే మోడల్​లో స్పేస్​క్రాఫ్ట్​ను తయారు చేసింది. అది పనిచేసేందుకు సోలార్​ పానెళ్లను అమర్చింది. అంటే మార్స్​ కక్ష్యలో సూర్యుడి నుంచి కరెంట్​ తయారు చేసుకునేందుకు వీలుగా వాటిని ఏర్పాటు చేసింది. తయారైన కరెంట్​ను నిల్వ ఉంచుకునేలా 36 లిథియం అయాన్​ బ్యాటరీలను దాంట్లో పెట్టింది. దాంతో పాటు కక్ష్య పెంపు కోసం ఒక ద్రవ ఇంధన ఇంజన్​నూ పెట్టారు. దాని శక్తి 440 న్యూటన్లు. కక్ష్యలో నియంత్రణ కోసం 8 చిన్న చిన్న ఇంజన్లనూ ఏర్పాటు చేశారు. 852 కిలోల ఇంధనాన్ని అందులో నింపారు. ఎత్తు, కక్ష్య నియంత్రణ కోసం మార్​31750 ప్రాసెసర్​, రెండు స్టార్​ సెన్సర్లు, సోలార్​ పానెల్​ సన్​ సెన్సర్​, కోర్స్​ అనలాగ్​ సన్​ సెన్సర్​ వంటివి అమర్చారు.

పేలోడ్లు

ల్యాప్​(ఎల్​ఏపీ): లైమన్​ ఆల్ఫా ఫొటోమీటర్​– బరువు 1.97 కిలోలు. మార్స్​ వాతావరణంలోని డ్యుటీరియం, హైడ్రోజన్​ వంటి వాటిని కొలుస్తుంది. ఆ రెండింటి నిష్పత్తి తెలిస్తే, మార్స్​ మీదున్న నీళ్లు ఎంత వరకు పోయాయో తెలుసుకోవచ్చు. ఒక్కసారి కక్ష్యలో తిరిగితే 60 నిమిషాల పాటు వాతావరణాన్ని అది అంచనా వేయగలదు.

మీథేన్​ సెన్సర్​ ఫర్​ మార్స్​ (ఎంఎస్​ఎం): మార్స్​ వాతావరణంలోని మీథేన్​ను కొలిచేందుకు ఉపయోగపడుతుంది.

మార్స్​ ఎక్సోస్ఫెరిక్​ న్యూట్రల్​ కంపోజిషన్​ అనలైజర్​ (ఎంఈఎన్​సీఏ): మార్స్​పై ఉండే న్యూట్రల్​ పార్టికల్స్​ను అంచనా వేస్తుంది.

థర్మల్​ ఇన్​ఫ్రారెడ్​ ఇమేజింగ్​ స్పెక్ట్రోమీటర్​ (టీఐఎస్​): అంగారకుడిపై విడుదలయ్యే వేడిని లెక్కిస్తుంది. రాత్రి, మధ్యాహ్నం పనిచేస్తుంది. వాతావరణంలోని కార్బన్​ డయాక్సైడ్​, గాలుల తీవ్రతను అంచనా వేస్తుంది. మార్స్​ నేలలోని ఖనిజాలను అన్వేషిస్తుంది.

మార్స్​ కలర్​ కెమెరా (ఎంసీసీ): మార్స్​ను వివిధ కోణాల్లో ఫొటోలు తీసేందుకు ఉపయోగపడే మూడు రంగుల కెమెరా ఇది. గాలులు, దుమ్ము తుఫాన్ల వంటి వాటిని తెలుసుకోవచ్చు.