గ్లోబల్‌‌ ఇంటర్నెట్‌‌ ట్రాఫిక్‌లో 21 శాతానికి చేరుకున్న ఇండియా వాటా

గ్లోబల్‌‌ ఇంటర్నెట్‌‌ ట్రాఫిక్‌లో 21 శాతానికి చేరుకున్న ఇండియా వాటా

న్యూఢిల్లీ:  దేశంలో ఇంటర్నెట్ వాడకం గత పదేళ్లలో పదిరెట్లకు పైగా పెరిగింది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా మొబైల్ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో సగం వాటా ఇండియా, చైనా నుంచే ఉంది. జెరోధా ఫౌండర్  నిఖిల్ కామత్‌‌‌‌ ఇదే విషయాన్ని ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో పంచుకున్నారు. ‘గ్లోబల్‌‌‌‌గా మొబైల్‌‌‌‌ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో ఇండియా వాటా 2012 లో 2 శాతం  ఉండేది. 2022 లో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌ 21 శాతానికి పెరిగింది’ అని పేర్కొన్నారు. ఇండియా ఎదుగుతోందనడానికి ఇదే అతిపెద్ద సాక్ష్యమని అన్నారు.  ఆయన పంచుకున్న ఓ గ్రాఫ్ ప్రకారం, 2012 లో  గ్లోబల్‌‌‌‌గా మొబైల్‌‌‌‌ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో చైనా వాటా10 శాతంగా, నార్త్ అమెరికా, యూరోపియన్ యూనియన్‌‌‌‌, జపాన్‌‌‌‌, సౌత్‌‌‌‌ కొరియా వాటా 73 శాతంగా, ఇండియా వాటా 2 శాతంగా ఉండేది. 15 శాతం వాటా మిగిలిన దేశాలది ఉండేది. 2022 నాటికి  చైనా వాటా 27 శాతానికి,  ఇండియా వాటా 21 శాతానికి పెరిగింది. నార్త్‌‌‌‌ అమెరికా, ఈయూ, జపాన్‌‌‌‌, సౌత్ కొరియా వాటా 25 శాతానికి పడిపోయింది. మిగిలిన దేశాల వాటా 27 శాతానికి పెరిగింది. జియో కారణంగా ఇండియాలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగింది. ఈ టెలికం కంపెనీ 2016 లో  స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఇంటర్నెట్ వాడకంలో ఇండియా వెనక్కి  తిరిగి చూడలేదు. 

ఇంటర్నెట్ వాడుతున్న వారు 70 కోట్లకు..

దేశంలో యాక్టివ్‌‌గా ఇంటర్నెట్ వాడుతున్న వారు 2022 లో 70 కోట్లకు చేరుకున్నారని  ‘ఇండియా ఇంటర్నెట్ రిపోర్ట్–2023’ లో నెల్సన్‌‌ పేర్కొంది.  అంతేకాకుండా  12 ఏళ్ల కంటే  ఎక్కువ వయసు ఉన్నవారు యాక్టివ్‌‌గా ఇంటర్నెట్ వాడడం ఏడాది ప్రాతిపదికన 20 శాతం పెరిగిందని వెల్లడించింది. 2021 డిసెంబర్ నాటికి దేశంలో యాక్టివ్‌‌గా ఇంటర్నెట్ వాడుతున్నవారు 59.5 కోట్లుగా ఉన్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం, 70 కోట్ల మందిలో 45 కోట్ల మంది వీడియో కంటెంట్‌‌ కోసం ఇంటర్నెట్ వాడుతున్నారు. వీరిలో ఆన్‌‌లైన్ వీడియోలు చూస్తున్నవారితో పాటు వీడియో కాల్స్ మాట్లాడేవారు కూడా ఉన్నారు. ఆన్‌‌లైన్ బ్యాంకింగ్‌‌, డిజిటల్ పేమెంట్స్  కోసం ఇంటర్నెట్ వాడడం 2022 లో ఏడాది ప్రాతిపదికన 43 శాతం పెరిగిందని నెల్సన్ సర్వే పేర్కొంది. ఆన్‌‌లైన్‌‌లో వార్తలు చదవడం 20 శాతం ఎగిసిందని వెల్లడించింది. ఈ సెగ్మెంట్లు మరింత విస్తరిస్తాయని అంచనావేసింది. ఇంటర్నెట్ వాడుతున్న వారిలో గ్రామాల నుంచి 42.5 కోట్ల మంది ఉన్నారని,  అర్బన్ ప్రాంతాల నుంచి 29.5 కోట్ల మంది ఉన్నారని ఈ రిపోర్ట్ పేర్కొంది.  ఇంటర్నెట్ వాడుతున్న మహిళలు  2022 లో ఏడాది ప్రాతిపదికన 27 శాతం పెరగగా, మగవారు 18 శాతం పెరిగారు.