యుద్ధం వద్దు.. యోగా చేద్దాం.. అయుర్వేదం వాడదాం : ప్రధాని మోదీ పిలుపు

యుద్ధం వద్దు.. యోగా చేద్దాం.. అయుర్వేదం వాడదాం : ప్రధాని మోదీ పిలుపు

యుద్దాలపై ప్రధాని మోదీ మరోసారి గళం విప్పారు. యుద్దాన్ని పక్కనబెట్టి యోగా చేద్దాం.. ఆయుర్వేదం వాడదాం అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఫ్రాన్స్ రెండు రోజుల పర్యటలో ఉన్న ప్రధాని.. యోగా అనేది ఇప్పుడు మన దైనందిన జీవితంలో భాగమైందని చెప్పారు.  సంప్రదాయ ఆయుర్వేదాన్ని ప్రపంచమంతా ఆమోదిస్తోందని తెలిపారు. మా నిపుణులు ఎప్పుడూ యుద్ధం, అణచివేతకు గురి కాలేదని, కానీ యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, సైన్స్, గణితం, ఖగోళ శాస్త్రం వంటి ప్రయోజన కారకాలపైనే దృష్టి సారించారన్నారు.

అత్యధిక జనాభాతో పాటు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విలసిల్లుతోన్న భారత్.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండిలో శాశ్వత సభ్యదేశం కానపుడు ఆ మండలి ప్రపంచం కోసం ఎలా మాట్లాడగలదని ప్రధాని మోదీ ప్రశ్నించారు. భద్రతా మండలిలో జరగాల్సిన మార్పులు, పోషించాల్సిన పాత్రపై భారత్ తో పాటు చాలా దేశాలు స్పష్టమైన వైఖరిని కలిగి ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై..

రష్యా- ఉక్రెయిన్ యుద్దంపైన స్పందించిన ప్రధాని మోదీ.. ఈ పరిణామాలకు స్వస్తి పలికేందుకు భారత్ సుముఖంగా ఉందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇరువురి దేశాల నేతలకు కూడా చెప్పానని, ఇది యుద్దాల యుద్దం కాదని ఆయన మరోసారి పునరుద్ఘాటించి చెప్పారు. ఈ యుద్దం వల్ల ఇతర దేశాలు.. ముఖ్యంగా పేద దేశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయన్నారు. ఇప్పటికే కొవిడ్ తో తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొన్నాయని.. అందుకే ఈ యుద్దాన్ని ఆపేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.