రెడీమేడ్ దోశ పిండి బయట కొంటున్నారా..? పాపం అలా కొనుక్కున్న పిండితో దోశలు తిని చావుబతుకుల మధ్య ఫ్యామిలీ !

రెడీమేడ్ దోశ పిండి బయట కొంటున్నారా..? పాపం అలా కొనుక్కున్న పిండితో దోశలు తిని చావుబతుకుల మధ్య ఫ్యామిలీ !

దోశ పిండి బయట కొనుక్కుని.. ఇంట్లో పెనం మీద పోసుకుని తినే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిదేమో. ఎందుకంటే.. ఇలా రెడీమేడ్ దోశ పిండి కొనుక్కుని ఇంటికి తెచ్చుకుని దోశలు పోసుకుని తిన్న ఒక కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్త, ఇద్దరు చిన్నారులు ఉన్న ఆ కుటుంబంలో ఈ దోశలు తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు ఇద్దరూ చనిపోయారు. భార్యాభర్త పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ ఘటన అహ్మదాబాద్లోని చంద్ఖేడాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. భావన ప్రజాపతి, విమల్ ప్రజాపతి భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కూతురు మిస్రీ, మూడు నెలల పాప రాహా ఉన్నారు. ఈ కుటుంబం చంద్ఖేడాలో నివాసం ఉంటుంది.

ఈ ఫ్యామిలీ పని మీద బయటకెళ్లి వస్తూవస్తూ.. అహ్మదాబాద్ ఐఓసీ రోడ్డులో ఉన్న ఘన్ శ్యామ్ డైరీ నుంచి దోశ పిండి తెచ్చుకున్నారు. అదే పిండితో దోశలు చేసుకుని తిన్నారు. మరుసటి రోజు ఉదయం నుంచి భార్యాభర్త, నాలుగేళ్ల చిన్నారి వాంతులతో ఇబ్బంది పడ్డారు. తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు. తల్లి పాలు తాగిన మూడు నెలల చిన్నారి కూడా అస్వస్థతకు లోనైంది. ఇలా ఫుడ్ పాయిజన్ కారణంగా కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలైంది. చికిత్స పొందుతూ నాలుగు సంవత్సరాల పాప, మూడు నెలల చిన్నారి చనిపోయారు. కేడీ హాస్పిటల్లో భావన, విమల్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

అహ్మదాబాద్ చంద్ఖేడా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుటుంబం తిన్న దోశ పిండి శాంపిల్స్ను సేకరించారు. పిల్లలకు పోస్ట్ మార్టం చేశారు. ఈ మరణాలకు అసలు కారణాలను తేల్చేందుకు పోలీసులు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ సాయం కూడా తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే.. ఈ మరణాలపై ఘనశ్యామ్ డైరీ యజమాని కేతన్ పటేల్ స్పందించారు. ఆ రోజు సాయంత్రం ఆ మహిళ, ఆమె భర్త దోశ పిండి కొనుక్కుని వెళ్లారని, తాము ప్రతిరోజూ సుమారు 100 నుంచి 125 కిలోల దోశ పిండిని అమ్ముతామని ఆయన చెప్పారు. 

ఆరోజు ఆ దోశ పిండితో చేసిన దోశలను తమ బంధువులు, అదే రోజు కొనుక్కుని వెళ్లిన వినియోగదారులు కూడా తిన్నారని ఆయన చెప్పారు. మరెవరూ ఇలా ఇబ్బంది పడ్డామని తమకు ఫిర్యాదు చేయలేదని కేతన్ పటేల్ తెలిపారు. అహ్మదాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఘనశ్యామ్ డైరీలో అమ్ముతున్న ఫుడ్ ప్రొడక్ట్స్ను పరిశీలించాలని నిర్ణయించారు.