ఓటమికి బ్రాండ్ అంబాసిడర్ ఈయన.. 254వ నామినేషన్ వేసిన పద్మరాజన్.. ఏంటి ఈయన గొప్ప..?

ఓటమికి బ్రాండ్ అంబాసిడర్ ఈయన.. 254వ నామినేషన్ వేసిన పద్మరాజన్.. ఏంటి ఈయన గొప్ప..?

గెలవాలనే తపన ఎన్ని ఓటములనైనా సహిస్తుంది అనటానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈయన అంటే అతిశయోక్తి కాదేమో. డబ్బు, పలుకుబడి, పార్టీల అండదండలు, వ్యాపారుల సహాయసహకరాలు ఉంటేనే సాధ్యమయ్యే భారత రాజకీయాల్లో.. ఎలాంటి సహాయం లేకుండా ఒక కామన్ మ్యాన్.. నిర్విరామంగా ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. 253 సార్లు పోటీ చేసినా.. ఒక్కసారి కూడా గెలవక పోయినా.. మళ్లీ 254వ సారి నామినేషన్ వేసి చరిత్ర సృష్టించారు. అతనే ఎలక్షన్ కింగ్ అని పిలుచుకునే కె.పద్మరాజన్. అలుపులేకుండా పోటీచేస్తున్న ఈయన ఆలోచనేంటో తెలుసుకుందాం. 

కేరళలోని పయ్యన్నూర్ కున్హిమంగళం ప్రాంతానికి చెందిన పద్మరాజన్ (66) ప్రస్తతం తమిళనాడులోని సాలెం, మెట్టూర్ లో నివసిస్తున్నారు. టైర్ల వ్యాపారం చేసే ఈయనను.. ఓటమికే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడం సబబేమో అనిపిస్తుంది. ఎందుకంటే 1988 నుంచి ఇప్పటి వరకు పోటీ చేస్తూ.. ఓడిపోతూనే ఉన్నారు. అయినప్పటికీ తగ్గేదేలే అంటూ మరోసారి బరిలోకి దిగుతున్నారు. 

1988లో మొదటిసారి తన స్వగ్రామం నుంచి ఎన్నికల్లో పోటీ చేశాడు. అతను బరిలో నిల్చినప్పుడు అందరూ నవ్వారు. కానీ, ఒక సాధారణ వ్యక్తి కూడా ఎన్నికల్లో పోటీ చేయగలడని ప్రూవ్‌‌ చేయాలనుకున్నాడు. చేశాడు.

Also Read :  స్పీకర్ కారుపై బొకే పెట్టి ఇంకు చల్లారు..!

  • టీవీకే విజయ్కు పోటీగా:

పద్మరాజన్ ఉద్దేశం.. సామాన్యుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయగలడని నిరూపించడమేనట. ధనబలం, అధికార అండ లేకున్నా.. రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో.. ఎవరైనా పోటీచేయొచ్చునని నిరూపిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడమే తన విజయమని, ఓడిపోయినా సంతోషంగానే ఉంటానన్నారు. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మెట్టూర్ నియోజకవర్గం నుంచి 253వ నామినేషన్ వేసిన ఆయన.. టీవీకే విజయ్ పోటీ చేస్తున్న పెరంబుదూర్ నుంచి 254వ నామినేషన్ వేశారు. 

హేమాహేమీలపై పోటీ:

 స్థానికులు ‘ఎలక్షన్‌‌ కింగ్‌‌’ అని పిలిచే పద్మరాజన్‌‌.. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు అనేక ఎలక్షన్స్‌‌లో పోటీ చేశారు. ప్రధాని మోదీ, మాజీ ప్రధానులు వాజ్‌‌పేయి, మన్మోహన్‌‌ సింగ్‌,‌ ఎంపీ రాహుల్‌‌ గాంధీ చేతిలో ఓడిపోయారు. 

గెలుపు ముఖ్యం కాదు..

నా దృష్టిలో ఎన్నికల్లో గెలుపు సెకండరీ. నా ప్రత్యర్థి ఎవరు అనేది పట్టించుకోను. ఎప్పటికైనా ప్రజలు నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. సాధారణ ప్రజలు ఎన్నికల్లో పోటీకి వెనుకాడుతారు. నేను వారికి రోల్‌‌ మోడల్‌‌గా ఉండాలనుకుంటున్నాను. అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని పద్మరాజన్‌‌ పేర్కొన్నారు. 

ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతై.. ఇప్పటికే ఆయన రూ.లక్షల్లో నష్టపోయారు. మరోవైపు, ఎన్నికల్లో ఎక్కువ సార్లు ఓడిపోయిన అభ్యర్థిగా లిమ్కా బుక్‌‌ ఆఫ్‌‌ రికార్డ్స్‌‌లో స్థానం సంపాదించుకున్నారు. ఇదే కాకుండా ఆసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఢిల్లీ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించారు.

టైర్ గుర్తుతో పోటీ చేసే పద్మనాభన్.. గెలిచినా ఓడినా తన చివరి శ్వాస వరకు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే షాక్‌‌ అవుతానని, ఆ ఆనందంలో గుండెపోటు కూడా వస్తుందేమోనని చమత్కరిస్తున్నారు.