క‌రోనా ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు ఇండిగో గిఫ్ట్.. ఏడాది చివ‌రి వ‌ర‌కు 25% డిస్కౌంట్

క‌రోనా ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు ఇండిగో గిఫ్ట్.. ఏడాది చివ‌రి వ‌ర‌కు 25% డిస్కౌంట్

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న నేప‌థ్యంలో త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా ప్ర‌జ‌ల కోసం ముందుండి పోరాడుతున్న క‌రోనా ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఓ కానుక‌ను అందించాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు విమాన ప్ర‌యాణాలు చేసే డాక్ట‌ర్లు, న‌ర్సుల‌కు 25 శాతం డిస్కౌంట్‌తో ఫ్లైట్ టికెట్ల‌ను ఆఫ‌ర్ చేస్తోంది. జూలై 1 నుంచి డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఇండిగో వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునే స‌మ‌యంలో ఈ ఆఫ‌ర్‌ను వాడుకోవాల‌ని సూచించింది. అయితే దీన్ని వినియోగించుకునే వారు త‌మ హాస్పిట‌ల్ ఐడీ కార్డును చెకిన్ స‌మ‌యంలో త‌ప్ప‌నిస‌రిగా ప్రొవైడ్ చేయాల‌ని ఇండిగో ఒక ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపింది.

ఇప్ప‌టికీ స‌గ‌టున‌ స‌గం సీట్లే ఫుల్

మ‌రోవైపు క‌రోనా లాక్‌డౌన్ త‌ర్వాత దాదాపు విమాన స‌ర్వీసులు తిరిగి స్టార్ట్ అయ్యి నెల‌పైగా గ‌డిచిన‌ప్ప‌టికీ ఎయిర్‌లైన్స్ సంస్థ‌లు అర‌కొర సీటింగ్ కెపాసిటీతోనే ఫ్లైట్స్ న‌డుపుతున్నాయి. ఎక్కువ రోజుల్లో దాదాపు స‌గం సీట్లు ఖాళీగానే ఉంటున్నాయ‌ని ఆ సంస్థ‌లు చెబుతున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో లాక్‌డౌన్ స‌మ‌యంలో దాదాపు రెండు నెల‌ల‌కు పైగా దేశంలో అన్ని విమాన స‌ర్వీసుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం నిలిపేసిన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ మే 25న డొమెస్టిక్ విమాన స‌ర్వీసుల‌ను తిరిగి ప్రారంభించిన‌ప్ప‌టికీ గ‌తంలో ఉన్నంత‌గా ఆక్యుపెన్సీ లేదు. విమానాల్లో ప్ర‌యాణించే వారి సంఖ్య భారీగా త‌గ్గిపోయింది. అయితే క్ర‌మంగా ఫ్లైట్స్‌లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. జూలై 1న మొత్తం 785 విమానాల్లో 71,471 మంది ప్ర‌యాణం చేశార‌ని పౌర విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర‌దీప్ సింగ్ పూరీ ఇవాళ ఉద‌యం ట్వీట్ చేశారు. అంటే బుధ‌వారం నాడు సుమారుగా ఒక్కో విమానంలో 91 మంది ట్రావెల్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే భార‌త్‌లో ఎక్కువ‌గా ఉన్న డొమెస్టిక్ ఫ్లైట్స్ A320 విమానాలు.. వీటి సీటింగ్ కెపాసిటీ 180 మందికి ఉంటుంది. అంటే ప్ర‌స్తుతం స‌గ‌టున 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో విమానాలు న‌డుస్తున్నాయి.