- ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- రెండో దశలో నేతల సలహాలు తీసుకుంటాం
- జాయింట్ సర్వేతో భూసరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇరవై వేల వరకు ప్రభుత్వం నుంచి సహాయం పొందిన వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధుల సూచనలకు అనుగుణంగా వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత కార్యక్రమంలో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తామన్నారు. రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా శుక్రవారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన ఇన్ చార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్టు, హౌసింగ్ డిపార్ట్ మెంట్ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. పొంగులేటి మాట్లాడుతూ మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరును విజయవంతంగా పూర్తిచేశామన్నారు. 3 లక్షలకుపైగా ఇండ్లను మంజూరు చేయగా దాదాపు 2.90 లక్షల వరకు గ్రౌండింగ్ చేశామని తెలిపారు. అందులో ఇప్పటికే సుమారు 50 వేల గృహ ప్రవేశాలు కూడా జరిగాయన్నారు. అలాగే మరో రెండు లక్షలకు పైగా ఇండ్ల నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వచ్చే నెల రెండో తేదీన ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు.
బిల్లులు క్లియర్ చేయాలి
ఇందిరమ్మ పైలట్ గ్రామాల్లో 600 పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇండ్లను నిర్మించిన వారి బిల్లులను క్లియర్ చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. పేదవాడు తాను నివసిస్తున్న పూరిగుడిసె స్థానంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే, తమ ల్యాండ్ అంటూ ఫారెస్ట్ అధికారులు గానీ, సింగరేణి యాజమాన్యం గానీ అడ్డుపడొద్దన్నారు. ఈ నెలాఖరుకల్లా వివిధ నిర్మాణ దశల్లో ఉన్న 2 బీహెచ్ కే ఇండ్లన్నిటికీ లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఇసుకను వీలైనంత వరకు సమీప ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో అటవీ భూములున్నాయని, రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయని మంత్రి అన్నారు. రెండు విభాగాలు జాయింట్ సర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.
