రెండు రోజుల్లో 500 కాల్స్..క్యూర్  పరిధిలో ఇందిరమ్మ ఫ్లాట్లకు అనూహ్య స్పందన

రెండు రోజుల్లో 500 కాల్స్..క్యూర్  పరిధిలో ఇందిరమ్మ ఫ్లాట్లకు అనూహ్య స్పందన

హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలో ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఇందిరమ్మ ఎల్ఐజీ టవర్స్ స్కీమ్‌‌కు ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. స్కీమ్ స్టార్ట్ చేసిన రెండు రోజుల్లోనే హౌసింగ్ బోర్డు, హౌసింగ్ కార్పొరేషన్‌‌లోని రెండు కాల్ సెంటర్లకు 500 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎల్ఐజీ స్కీమ్ లాంచింగ్ రోజున ప్రభుత్వం 040-–24603572, 8031335905 ల్యాండ్, సెల్ నంబర్లతో కాల్ సెంటర్‌‌ను ఏర్పాటు చేసింది. భారీగా కాల్స్ వస్తుండడంతో, మరో రెండు రోజుల్లో 10 మంది సిబ్బందితో కాల్ సెంటర్‌‌ను ప్రారంభించేందుకు హౌసింగ్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మేం అర్హులమా.. అప్లై చేసుకోవచ్చా..

గత కొన్నేళ్లుగా క్యూర్ పరిధిలో నివాసం ఉంటున్నామని, తాము ఇంటికి అప్లై చేసుకునేందుకు అర్హులమా? అని ఇతర జిల్లాలకు చెందిన వారు కాల్ సెంటర్‌‌కు ఫోన్ చేసి అడుగుతున్నారు. మహిళ పేరుతోనే ఇల్లు అప్లై చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో సింగిల్ ఉమెన్, అన్‌‌మ్యారీడ్ వాళ్లు ఎలా అప్లై చేయాలని ఎంక్వైరీ చేస్తున్నారు. తల్లి, తండ్రి ఆధార్ నంబర్ అప్లికేషన్‌‌లో ఎంటర్ చేయాలని చెప్పగా, వాళ్లిద్దరూ చనిపోతే ఎలాగని క్లారిటీ ఇవ్వకపోవడంతో ఫోన్లు చేస్తున్నారు. మీసేవలో అప్లికేషన్‌‌కు రూ.100, ఈఎండీ, టోకెన్ అమౌంట్‌‌గా ప్రభుత్వం రూ.10 వేలు చెల్లించాలని చెప్పింది. ఇల్లు రాకపోతే అమౌంట్ ఎలా రిటర్న్ ఇస్తారని అడుగుతున్నారు.

అయితే క్యాష్ తీసుకోకుండా కేవలం యూపీఐ పేమెంట్స్‌‌ను మాత్రమే అధికారులు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక క్యూర్ పరిధిలో ప్రభుత్వం ఫస్ట్ ఫేజ్‌‌లో 16 నియోజకవర్గాల్లో స్థలాలను గుర్తించి పైలట్ ప్రాజెక్టు కింద ఇండ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అయితే మిగిలిన నియోజకవర్గాల ప్రజలు ఫోన్లు చేసి తాము ఎలా అప్లై చేయాలని అడుగుతున్నారు. మిగతా చోట్ల ల్యాండ్ ఫైనల్ కాలేదని అధికారులు సమాధానం ఇస్తున్నారు. ఇదిలాఉంటే కాల్ సెంటర్‌‌కు వచ్చే కాల్స్‌‌లో ఏ ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయనే విషయంపై ఫోకస్ పెట్టిన ఆఫీసర్లు, అందుకు అనుగుణంగా సమాధానాలను రెడీ చేస్తున్నారు.

మీసేవ ఆపరేటర్లకు తోడుగా టెక్నికల్ స్టాఫ్

ఎల్ఐజీ టవర్స్‌‌లో ఇండ్లకు అప్లై చేసుకునేందుకు మీసేవతో పాటు వాట్సాప్ నంబర్, వెబ్‌‌సైట్ ద్వారా సర్కారు అవకాశం కల్పించింది. మంగళవారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభించగా, తొలి రోజు మీసేవలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో అప్లికేషన్ల ప్రాసెసింగ్‌‌కు కొంత బ్రేక్ వచ్చింది.

మంగళ, బుధవారాల్లో కలిపి మొత్తం 1,500 అప్లికేషన్లు వచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. దరఖాస్తు స్వీకరణలో ఎదురవుతున్న టెక్నికల్ ఇబ్బందులను మీసేవ నిర్వాహకులు హౌసింగ్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హౌసింగ్ బోర్డులో ఉన్న టెక్నికల్ స్టాఫ్‌‌ను మీసేవ స్టాఫ్‌‌తో కో-ఆర్డినేట్ చేస్తున్నారు.