ఇవాళ్టి(సెప్టెంబర్2) నుంచి..ఇందిరమ్మ టవర్స్‌‌‌‌‌‌‌‌ లబ్ధిదారుల సర్వే

ఇవాళ్టి(సెప్టెంబర్2) నుంచి..ఇందిరమ్మ టవర్స్‌‌‌‌‌‌‌‌ లబ్ధిదారుల సర్వే
  • డ్రాలో ఒక్కో నియోజకవర్గానికి 600 మంది ఎంపిక
  • ఒక్కో ఏఈకి 50  మంది లబ్ధిదారుల బాధ్యతలు
  • యాప్‌‌‌‌‌‌‌‌లో వివరాల నమోదు.. వారంలో సర్వే పూర్తి చేయాలని హౌసింగ్‌‌‌‌‌‌‌‌ బోర్డు ఆదేశం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: క్యూర్‌‌‌‌‌‌‌‌ పరిధిలో ఇందిరమ్మ టవర్స్‌‌‌‌‌‌‌‌ ఫ్లాట్లు దక్కిన లబ్ధిదారుల సర్వేను హౌసింగ్‌‌‌‌‌‌‌‌ బోర్డు బుధవారం నుంచి చేపట్టనుంది. వారం రోజుల్లో సర్వే పూర్తి చేసి.. లబ్ధిదారులు ఇచ్చిన వివరాలను మరోసారి క్రాస్‌‌‌‌‌‌‌‌ చెక్‌‌‌‌‌‌‌‌ చేయనున్నారు. హౌసింగ్‌‌‌‌‌‌‌‌ బోర్డు, హౌసింగ్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, రాజీవ్‌‌‌‌‌‌‌‌ స్వగృహ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్న ఏఈలు ఈ సర్వే నిర్వహించనున్నారు. సర్వే కోసం ప్రత్యేకంగా యాప్‌‌‌‌‌‌‌‌ రూపొందించారు. లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరించి యాప్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయనున్నారు. ఒక్కో ఏఈ రోజుకు 50 మంది లబ్ధిదారుల వివరాలు సేకరించాలని హౌసింగ్‌‌‌‌‌‌‌‌ బోర్డు వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ వీపీ గౌతమ్‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. ఇందుకోసం సుమారు 20 మంది ఏఈలకు మంగళవారం నాంపల్లిలోని హౌసింగ్‌‌‌‌‌‌‌‌ బోర్డు కార్యాలయంలో అధికారులు శిక్షణ ఇచ్చారు.

ఒక్కో నియోజకవర్గంలో 600 మంది..

క్యూర్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో 480 ఫ్లాట్ల చొప్పున ఇందిరమ్మ టవర్స్‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తున్నారు. ఇటీవల నాలుగు రోజులుగా డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 480 మంది కాకుండా అదనంగా మరో 120 మందిని కలిపి 600 మందిని ఎంపిక చేశారు. 480 మంది లబ్ధిదారుల్లో ఎవరైనా తప్పుడు వివరాలు ఇచ్చినట్లు తేలి అనర్హులైతే.. అదనంగా ఎంపిక చేసిన 120 మందిలో అర్హులకు అవకాశం కల్పించనున్నారు. ఈ లెక్కన మొత్తం 9,600 మంది లబ్ధిదారుల వివరాలను ఏఈలు పరిశీలించనున్నారు. వారం రోజుల్లో సర్వే పూర్తి చేసి అర్హులైన వారికి ఫ్లాట్ల మంజూరు పత్రాలు అందజేయనున్నారు.