గిడ్డంగుల గిరాకీ పెరిగింది

గిడ్డంగుల గిరాకీ పెరిగింది

న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్​ మధ్యలో ఇండస్ట్రియల్​అండ్​ వేర్​హౌసింగ్​ స్పేస్​ లీజింగ్​ 9 శాతం పెరిగింది. ఇది దేశంలోని అయిదు సిటీలలో  కలిపి 17.5 మిలియన్​ చదరపు అడుగులకు చేరినట్లు కొలియర్స్​ ఇండియా రిపోర్టు వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఆ నగరాలలో 16 మిలియన్​ చదరపు అడుగుల లీజింగ్​ రికార్డయింది. ఇండస్ట్రియల్​ అండ్​ వేర్​హౌసింగ్​ స్పేస్​ లీజ్​  బెంగళూరులో 2 శాతం పెరిగి 2.3 మిలియన్​ చదరపు అడుగులకు చేరిందని పేర్కొంది. మరోవైపు చెన్నైలో మాత్రం ఇది 31 శాతం తగ్గి 2.2 మిలియన్​ చదరపు అడుగులకు పరిమితమైనట్లు తెలిపింది. ఢిల్లీ–ఎన్​సీఆర్​లో ఇండస్ట్రియల్​ అండ్​ వేర్​హౌసింగ్​ స్పేస్​ లీజింగ్​ ఏకంగా 42 శాతం అధికమై 6.8 మిలియన్​ చదరపు అడుగులయిందని కొలియర్స్​ ఈ రిపోర్టులో వెల్లడించింది.

అంతకు ముందు ఏడాది సెప్టెంబర్​ చివరిదాకా ఈ లీజింగ్ 4.8 మిలియన్​ చదరపు అడుగులే. పుణెలో ఇండస్ట్రియల్​ అండ్​ వేర్​హౌసింగ్​ లీజింగ్​ డిమాండ్​ 11 శాతం తగ్గి 3.6 మిలియన్​ చదరపు అడుగులకు చేరిందని రిపోర్టు తెలిపింది. వేర్​హౌసింగ్​ స్పేస్​ను లీజుకు తీసుకుంటున్న వారిలో థర్డ్​ పార్టీ లాజిస్టిక్స్​ ప్లేయర్లే ఎక్కువగా ఉంటున్నారని పేర్కొంది. సగం డిమాండ్​ వీరి నుంచే వస్తున్నట్లు వివరించింది. రిటెయిల్​ మార్కెట్​ సెంటిమెంట్​ మెరుగవడంతోపాటు, పండగ సీజన్​తో ఆన్​లైన్ సేల్స్​ పెరగడమూ వేర్​హౌసింగ్​ డిమాండ్​ పెరగడానికి కారణాలని రిపోర్టు విశ్లేషించింది. ఈ సెగ్మెంట్​ మళ్లీ జోరందుకుంటోందని, లార్జ్​ సైజ్​ మెగా డిస్ట్రిబ్యూషన్​సెంటర్ల కోసం చురుగ్గా డిస్కషన్స్​ జరుగుతున్నాయని కొలియర్స్​ ఇండియా మేనేజింగ్​ డైరెక్టర్​ శ్యామ్​ ఆర్ముగం చెప్పారు. లాంగ్​ టర్మ్​లో ఇది మరింత ఊపందుకోవడానికి కొత్తగా తెచ్చిన నేషనల్​ లాజిస్టిక్స్​ పాలసీ సాయపడుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.