ఐఐటీల్లో టీనేజర్ల పాగా…

ఐఐటీల్లో టీనేజర్ల పాగా…

చతుర్భుజ్​ సింగ్​ కిరాల్.. వయసు 14 ఏండ్ల 11 నెలలు. జ్యోతి ప్రియదర్శి.. 15 ఏండ్లు. యోగేంద్రనాథ్​ సింగ్.. 16 ఏండ్లు. వీళ్లంతా ఏం చదువుతున్నారో తెలుసా? ఐఐటీలో ఇంజనీరింగ్‌.  మామూలుగా ఈ వయసు పిల్లలు పదోతరగతి చదవాలి. కానీ.. వీళ్లు మాత్రం యమా స్పీడుగా చదివేస్తూ చిన్న వయసులోనే  టెన్త్, ఇంటర్, ఐఐటీ ఎంట్రన్స్​ దాటుకుని.. ఐఐటీలోకి అడుగుపెట్టేశారు! ఈ ఏడాది ఒక్క ఐఐటీ ధన్​బాద్, ఇండియన్ ​స్కూల్ ​ఆఫ్​ మైన్స్​లోనే వీరితో సహా మొత్తం 9 మంది 16 ఏండ్లలోపు వారు సీట్లు కొట్టారు. ఐఐటీల్లో చేరే స్టూడెంట్ల సగటు  వయసు 18 ఏండ్లు ఉంటుంది. యూపీలోని రాయిబరేలీకి చెందిన ఒక మామూలు స్కూలు టీచర్​కూతురు అయిన జ్యోతి రెండేండ్లకే స్కూల్లో చేరిపోయి పలకా బలపం పట్టింది. ట్యూటర్లు, కోచింగ్​సెంటర్ల వంటివి లేకుండానే చకచకా చదివేసింది. 13 ఏళ్లకే టెన్త్​క్లాస్​లో 89.5 శాతంతో పాస్ ​అయింది. ఈ ఏడాది ఇంటర్ (​సీబీఎస్ఈ) 84.4% మార్కులు తెచ్చుకుంది.  ఐఐటీ–జేఈఈలోనూ సత్తా చాటి ఐఐటీలో అడుగుపెట్టింది.  చతుర్భుజ్ ​తండ్రి రాజస్థాన్​లోని అల్వార్​కు చెందిన తుక్కు సామాన్ల వ్యాపారి.  ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.

ఒకే స్కూలు నుంచి ముగ్గురు

ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ​ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంలోని ప్రభుత్వ  రెసిడెన్షియల్​ స్కూలు ప్రయాస్​బాయ్స్ ​విద్యాలయ స్టూడెంట్లూ చదువుల్లో మేటిగా నిలుస్తున్నారు. ఈ ఏడాది ఈ ఒక్క స్కూలు నుంచే, యోగేంద్రనాథ్​ సింగ్, వివేక్ ​కుమార్, అమర్​నాథ్ ​పైక్రా అనే ముగ్గురు స్టూడెంట్లు ఐఐటీ ధన్​బాద్​లో సీటు సంపాదించారు. ఈ ముగ్గురూ 16 ఏండ్లలోపు వారే.  దేశంలో ఇప్పటివరకూ ఐఐటీలో చేరిన అతిచిన్న వయసు స్టూడెంట్​సత్యం కుమార్. బీహార్​లోని భోజ్​పూర్ ​జిల్లాకు చెందిన సత్యం 2012లో 12 ఏండ్ల వయసులోనే 679 ర్యాంకుతో ఐఐటీ సీటు కొట్టాడు. కాగా, ఐఐటీలో చేరేందుకు ఉండాల్సిన గరిష్ట వయసు  వయసు పరిమితి​25 ఏండ్లు. కానీ, కనీస వయసు గురించి నిబంధనల్లో ఎక్కడా లేదని జేఈఈ అడ్మిషన్​కమిటీ చైర్మన్ ​ఆకే దాస్ ​వెల్లడించారు.