కోతలైతున్నయ్​.. కొనుడేది?

కోతలైతున్నయ్​.. కొనుడేది?
  • 22 జిల్లాల్లో మొదలుకాని వడ్ల సేకరణ
  • 6,545 కేంద్రాల్లో 742 మాత్రమే ప్రారంభించిన సర్కారు
  • నల్గొండలో ఒక్క సెంటరే ఓపెన్‌ 
  • 5 జిల్లాల్లో కేంద్రాలు తెరిచినా.. ఒక్క గింజ కూడా కొనలే
  • దీపావళి తర్వాత షురూ చేస్తామని చెబుతున్న నిర్వాహకులు
  • కొనుగోళ్ల టార్గెట్ కోటి టన్నులకు పైనే.. 
  • ఇప్పటిదాకా సేకరించింది 34 వేల టన్నులే
  • సర్కారు జాప్యంతో రైతుల్లో ఆందోళన

హైదరాబాద్‌, వెలుగు: వడ్లు కొంటామని సర్కారు ప్రకటించి 10 రోజులు దాటినా.. ఇంకా కొనుగోలు కేంద్రాలు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. రాష్ట్రంలో ఇంకా 22 జిల్లాల్లో ఒక్క సెంటర్ కూడా ఓపెన్ కాలేదు. 10 జిల్లాల్లో 742 సెంటర్లు షురూ చేసినా.. అందులో 5 జిల్లాల్లో ఒక్క గింజ కూడా కొనలేదు. దీంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ నెల ప్రారంభం నుంచే షురువైన వరి కోతలు.. దసరా తర్వాత మరింత పెరిగాయి. రానున్న రోజుల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తనుంది. ఈ క్రమంలో  కొనుగోళ్లలో జాప్యంతో ఆందోళనకు గురవుతున్న రైతులు.. సెంటర్లను వెంటనే తెరిచి ధాన్యం కొనాలని కోరుతున్నారు.
ఈ నెల 25 నుంచే తెరవాల్సి ఉన్నా..
నిజానికి ఈ నెల 25 నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పటిదాకా కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో మాత్రమే కొన్ని సెంటర్లు షురూ అయ్యాయి. ఇంకా చాలా ప్రాంతాల్లో సెంటర్లు షురూ కాక.. రైతులు కల్లాలు, రోడ్ల మీద వడ్లు ఆరబోసుకుని ఎదురు చూస్తున్నారు. మరోవైపు స్థానిక పరిస్థితులను బట్టి ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు కొనుగోళ్లు చేపట్టనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం చాలా సెంటర్లలో కొనుగోళ్లు అనుకున్నంతగా జరగడం లేదు. నవంబరు మొదటి వారానికల్లా అన్ని జిల్లాల్లో ధాన్యం సేకరణ ప్రారంభిస్తామని సివిల్‌ సప్లయ్స్ అధికారులు చెబుతున్నారు.


రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 6,545 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుపుతామని సర్కారు చెప్పింది. ఇప్పటిదాకా 742 సెంటర్లు మాత్రమే ఓపెన్ అయ్యాయి. నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో 360 సెంటర్లు, కరీంనగర్‌‌‌‌ జిల్లాలో 206, కామారెడ్డి జిల్లాలో 58,  మెదక్‌‌‌‌ జిల్లాలో 15, సంగారెడ్డి జిల్లాలో 11, నిర్మల్‌‌‌‌ జిల్లాలో 5, నల్గొండలో ఒక్క సెంటర్‌‌‌‌ మాత్రమే ఓపెన్‌‌‌‌ చేశారు. కొన్ని సెంటర్లు ఓపెన్‌‌‌‌ చేసినా కొనుగోళ్లు చేపట్టలేదు. ఐదు జిల్లాల్లో కేవలం పేరుకే కొనుగోలు కేంద్రాలు తెరిచారు. అక్కడ  ఒక్క గింజ కూడా కొనలేదు. ఇదేమని అడిగితే ‘దీపావళి వరకు ఆగాల్సిందే’నని సొసైటీ నిర్వహకులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు.
4 రోజుల్లో 34 వేల టన్నులే
రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సీజన్‌‌‌‌లో 1.02 కోట్ల టన్నుల వడ్లను కొనుగోలు చేయాలని సేకరించాలని సర్కారు టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. నాలుగు రోజులుగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. కానీ ఇప్పటిదాకా 34,102 టన్నులు మాత్రమే కొన్నారు. నిజామాబాద్‌‌‌‌ లో 15,364 టన్నులు, కరీంనగర్‌‌‌‌లో 18,186 టన్నులు, వరంగల్‌‌‌‌ అర్బన్‌‌‌‌లో 192 టన్నులు, కామారెడ్డిలో 340 టన్నులే సేకరించారు. నిజామాబాద్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌, నల్గొండ, కామారెడ్డి, మెదక్‌‌‌‌ జిల్లాల్లో వడ్లు 15 రోజుల నుంచే వస్తున్నాయి. నల్గొండ, సూర్యాపేట నిజామబాద్‌‌‌‌, కామారెడ్డి, వరంగల్‌‌‌‌ తదితర జిల్లాల్లో భారీగా ధాన్యం దిగుబడి రానుంది. నిజామాబాద్‌‌‌‌లో 9 లక్షల టన్నులు, కామారెడ్డిలో 5.8 లక్షల టన్నులు, మెదక్‌‌‌‌ జిల్లాలో 4.9 లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తుందనే అంచనాలు ఉన్నాయి.
కోతలు ఆపాలని ఆదేశాలు!
ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు సెంటర్లకు వస్తుందనే కారణంతో.. కోతలను ఆపాలని కొన్ని జిల్లాల్లో ఆదేశాలిస్తున్నట్టు తెలుస్తోంది. నల్లొండ, సూర్యాపేట జిల్లాల్లో వరి కోత కోసే హార్వెస్టర్ల యజమానులకు పోలీసుల హుకుం జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నట్లుగా సమాచారం. ఈ రెండు జిల్లాల్లో ఎక్కువగా వరి సాగైందని, కోతలు పెరిగితే ధాన్యం పోటెత్తుతుందని, అందుకే విడతల వారీగా కోతలు చేపట్టాలని అధికారులు ఆదేశిస్తున్నట్లు తెలుస్తోంది.