హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఇన్‌స్పైర్ అవార్డ్స్–మనక్’ ఆన్‌లైన్ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలను సెప్టెంబర్ 15లోగా ఆన్‌లైన్‌లో సమర్పించాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. సమాజంలోని సమస్యలకు శాస్త్రీయ, పర్యావరణహిత పరిష్కారాలు చూపే వినూత్న ఆలోచనలను ఆహ్వానిస్తున్నారు.
ఒక్కో పాఠశాల నుంచి గరిష్ఠంగా ఐదు ఉత్తమ ఐడియాలను హెడ్‌మాస్టర్లు ఎంపిక చేసి ఈ–మియాస్ పోర్టల్ లేదా మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఎంపికైన ప్రతి విద్యార్థికి ప్రాజెక్టు నమూనా తయారీ కోసం కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ రూ.10 వేల ప్రోత్సాహకాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఆ నిధులతో నమూనాలు రూపొందించి జిల్లా స్థాయి ప్రదర్శనలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని డీఈవోలు, డీవైఈవోలకు అధికారులు ఆదేశించారు
