అన్నీ సమయాల్లో నదుల ప్రక్షాళనపై దృష్టి పెడదాం

అన్నీ సమయాల్లో నదుల ప్రక్షాళనపై దృష్టి పెడదాం

కేవలం పుష్కరాల టైంలోనే నదులు గుర్తుకురావొద్దని, అన్ని సమయాల్లో నదుల ప్రక్షాళనపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ స్పెషల్‌‌‌‌ చీఫ్‌‌‌‌ సెక్రటరీ రాజేశ్వర్‌‌‌‌ తివారీ అన్నారు. ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ బయోడైవర్సిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌‌‌లోని ఓ హోటల్‌‌‌‌లో బుధవారం నిర్వహించిన కృష్ణా, గోదావరి నదుల పునరుజ్జీవం వర్క్‌‌‌‌షాప్‌‌‌‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మహా కుంభమేళాకు కొన్ని నెలల ముందే గంగానది పరీవాహకంలోని పరిశ్రమలను మూసేస్తారని, మిగతా సమయాల్లో గంగా కాలుష్య వ్యర్థాలతో నిండి ప్రవహిస్తుందన్నారు. అక్కడ ఇప్పుడిప్పుడే మార్పు కన్పిస్తోందన్నారు. తెలంగాణ జీవధారగా ఉన్న కృష్ణా, గోదావరి నదుల పునరుజ్జీవం సులభం కాదని, పరీవాహక ప్రాంతంలోని ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ దీనిని బాధ్యతగా తీసుకోవాలన్నారు. నదుల పునరుజ్జీవం డీపీఆర్‌‌‌‌ తయారీలో అందరూ భాగం పంచుకొని యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర తాగు, సాగునీటి అవసరాలు తీర్చే ఈ రెండు నదులు నిరంతరం స్వచ్ఛంగా ప్రవహించాల్సిన అవసరముందన్నారు. గోదావరి, కృష్ణా నదుల ప్రక్షాళన, పునరుజ్జీవానికి అటవీశాఖ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని పీసీసీఎఫ్‌‌‌‌ ఆర్‌‌‌‌.శోభ తెలిపారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌‌‌‌ తయారీకి ఫారెస్ట్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ నుంచి అడిషనల్‌‌‌‌ పీసీసీఎఫ్‌‌‌‌ లోకేశ్‌‌‌‌ జైస్వాల్‌‌‌‌ను నోడల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌గా నియమిస్తున్నామన్నారు. గంగాతోపాటు దేశంలోని 13 నదులను ప్రక్షాళన చేయాలని కేంద్రం నిర్ణయించిందని ఐఎఫ్‌‌‌‌బీ డైరెక్టర్‌‌‌‌ మదన్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌సింగ్‌‌‌‌ అన్నారు. బియాస్‌‌‌‌, చినాబ్‌‌‌‌, జీలం, రావి, సట్లేజ్‌‌‌‌, యమున, బ్రహ్మపుత్ర, మహానది, నర్మద, కృష్ణా, గోదావరి, కావేరి, లూని నదుల పునరుజ్జీవానికి కేంద్రం డీపీఆర్‌‌‌‌లు సిద్ధం చేస్తోందన్నారు. వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లో పీసీసీఎఫ్‌‌‌‌ (అడ్మిన్‌‌‌‌) మునీంద్ర, అడిషనల్‌‌‌‌ పీసీసీఎఫ్‌‌‌‌ స్వర్గం శ్రీనివాస్‌‌‌‌, ఈటీపీఆర్‌‌‌‌ఐ డైరెక్టర్‌‌‌‌ కళ్యాణ్‌‌‌‌ చక్రవర్తి, సీడబ్ల్యూసీ, గోదావరి రివర్‌‌‌‌ బోర్డ్‌‌‌‌, ఐఎఫ్‌‌‌‌బీ, ఫారెస్ట్‌‌‌‌, అగ్రికల్చర్‌‌‌‌, హార్టికల్చర్‌‌‌‌, మున్సిపల్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.