మహిళా ప్రజాప్రతినిధులకు అవమానాలు

మహిళా ప్రజాప్రతినిధులకు అవమానాలు
  • మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మర్యాద ఇస్తలె
  • ప్రొటోకాల్ పాటిస్తలే.. ప్రభుత్వ కార్యక్రమాలకు పిలుస్తలె
  • అధికార పార్టీ లేడీ లీడర్లకూ ఇదే దుస్థితి
  • మహిళా జడ్పీ చైర్​పర్సన్లను సొంత మండలాలు దాటనివ్వని ఎమ్మెల్యేలు

ఆగస్ట్ 7న గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‍గా రిజ్వానా షమీమ్‍ బాధ్యతలు చేపట్టారు. మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‍, చల్లా ధర్మారెడ్డి, వినయ్‌ భాస్కర్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ బల్దియా ప్రథమ పౌరురాలు మేయర్ గుండు సుధారాణి లేకుండా ప్రోగ్రామ్ నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఆహ్వానం లేదు కాబట్టే రాలేదని సుధారాణి అంటుండగా.. తాము ఫోన్‌ ట్రై చేశామని, మేయర్‍ కాల్ లిఫ్ట్ చేయలేదని డిప్యూటీ మేయర్ అంటున్నారు. మేజర్ ప్రోగ్రాంలకు సుధారిణికి ఇన్విటేషన్ అందడం లేదు. దీంతో కేవలం బల్దియా ఆఫీసర్లతో రివ్యూలకు పరిమితమయ్యారు.

వెలుగు, నెట్​వర్క్: రాష్ట్రంలో మహిళా లీడర్లకు అవమానాలు ఎదురవుతున్నాయి. జడ్పీ, మున్సిపల్ చైర్​పర్సన్లుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా ఉన్న మహిళా ప్రజాప్రతినిధుల విషయంలో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ ఎమ్మెల్యేలు.. మహిళా జడ్పీ చైర్​పర్సన్లను సొంత మండలాలు దాటి బయట అడుగుపెట్టనీయడం లేదు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదు. ఒకవేళ ఆహ్వానం అందినా.. ప్రభుత్వ మీటింగ్స్‌‌లో మాట్లాడే చాన్స్ ఇవ్వడం లేదు. ఆఫీసర్లు కూడా ఎమ్మెల్యేలను, మంత్రులను తప్ప తమను ఖాతరు చేస్తలేరని, కనీసం ప్రొటోకాల్ పాటిస్తలేరని మహిళా నేతలు వాపోతున్నారు. రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేల్లో మహిళల సంఖ్య ఆరు. 40  మంది ఎమ్మెల్సీల్లో ఉన్నది ముగ్గురు.. 16  మంది మంత్రుల్లో ఇద్దరు.. 17 మంది ఎంపీల్లో ఒక్కరు ఉన్నారు. చట్ట సభల్లో మహిళల స్థానం ఇది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పుణ్యమా అని 20 మంది జడ్పీ చైర్​పర్సన్లతో పాటు 141 మున్సిపాలిటీల్లో 50% వరకు మున్సిపల్ చైర్​పర్సన్లు, 539 మండలాల్లో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలుగా సగానికి పైగా మహిళలే కొనసాగుతున్నారు. రూలింగ్ పార్టీకే చెందిన వీళ్లను సొంత పార్టీ నుంచే అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జడ్పీ, మున్సిపల్ ​చైర్​పర్సన్లుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా పురుషులు ఉన్నచోట ప్రొటోకాల్​ ప్రకారం గౌరవ మర్యాదలు దక్కుతున్నా.. మహిళా ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇటీవల జరిగిన పలు ఘటనలు ఇందుకు ఊతమిస్తున్నాయి. కొందరు మహిళా ప్రతినిధులు తమకు జరుగుతున్న అవమానాలపై బహిరంగంగా చెప్పుకుని బాధపడుతుంటే.. ఇంకొందరు లోలోపలే కుమిలిపోతున్నారు.

ఎమ్మెల్సీనీ పిలుస్తలేరు
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్ ​గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైన వాణీదేవిని మహబూబ్​నగర్​జిల్లాలో జరిగే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించట్లేదనే విమర్శలున్నాయి. ఎమ్మెల్సీగా ఎన్నికై 5 నెలలు గడుస్తున్నా ఆమెను జడ్పీ, మండల మీటింగ్స్‌‌‌‌లకు తప్ప.. ఇతర ప్రోగ్రామ్స్‌ కు పిలవట్లేదని ఆమె అనుచరులు చెబుతున్నారు. నారాయణపేట జిల్లాలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హజరయ్యారు. వాణీదేవికి మాట్లాడే చాన్స్‌‌ ఇవ్వలే. 

ఎన్నెన్నో ఘటనలు

  • మెదక్ జిల్లా పరిషత్ చైర్‌‌‌‌పర్సన్ హేమలత.. కేవలం జడ్పీ మీటింగులు, రాష్ట్ర అవతరణ, పంద్రాగస్టు, గణతంత్ర వేడుకలకు మాత్రమే హాజరవుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం జిల్లాలోని 21 మండలాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రారంభోత్సవాలకు ఆమెను ముఖ్యఅతిథిగా ఆహ్వానించాల్సి ఉన్నా ఎమ్మెల్యేలు పట్టించుకోట్లేదు.
  • కామారెడ్డి జడ్పీ చైర్‌‌‌‌పర్సన్​దఫేదర్ శోభ.. తన సొంత నియోజకవర్గం జుక్కల్‌‌లో జరిగే కార్యక్రమాల్లో తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. ఆయా సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు ఆమెను ఆహ్వానించడం లేదు. ఇదే జిల్లాలో ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద రెండు బ్రిడ్జి పనులకు 6 నెలల కిందట ఆర్​అండ్​బీ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ శిలాఫలకంలో మున్సిపల్​ప్రజాప్రతినిధుల పేర్లు పైన రాసి, ఎల్లారెడ్డి ఎంపీపీ మాధవి పేరు కింద రాశారు. ఈ అంశాన్ని జడ్పీ మీటింగ్​లో ప్రస్తావించిన ఎంపీపీ మాధవి.. ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
  • మహబూబ్​నగర్ జిల్లా జడ్పీ చైర్​పర్సన్ స్వర్ణమ్మను కనీసం జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాలకూ ఆహ్వానించడం లేదు. జడ్పీ మీటింగులకు కూడా పిలుపు ఉండట్లేదు. జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేపట్టే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకూ పిలవకపోవడంతో ఆమె అసంతృప్తితో ఉన్నారు.
  • జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ సరితకు.. గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు కనీస విలువ ఇవ్వట్లేదనే విమర్శలున్నాయి. ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యే చాలా మీటింగులకు ఆమెను పిలవడం లేదు. గద్వాలలో ఇటీవల జరిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి పిలిచినా సరితకు ప్రాధాన్యం ఇవ్వలేదు.
  • నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితకు గతేడాది జూన్​2న పోలీసుల నుంచి అవమానం ఎదురైంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌‌లోకి ఆమె వాహనాన్ని అనుమతించలేదు. దీంతో ఆమె నడుచుకుంటూ వెళ్లి మంత్రికి ఫిర్యాదు చేశారు. 
  • జులై 26న భూపాలపల్లిలో నిర్వహించిన కొత్త రేషన్​కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఇద్దరు మంత్రులు హాజరయ్యారు. కానీ ఈ కార్యక్రమ ఇన్విటేషన్​లో భూపాలపల్లి జడ్పీ చైర్‌‌‌‌ పర్సన్ జక్కు శ్రీ హర్షిణి పేరు లేదు. దళిత కుటుంబానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధి కావడం వల్లే మంత్రులు, ఆఫీసర్లు ఆమె పేరు లేకుండా ఆహ్వాన పత్రిక ముద్రించారనే విమర్శలు వచ్చాయి. 

మాకు ప్రోటోకాల్ లేదా?
నేనంటూ ఒక జడ్పీటీసీని ఉన్నాననే విషయమే ఆఫీసర్లు మరిచిపోయారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు పిలుస్తలేరు. దోమ తెరల పంపిణీకి కూడా నేను పనికిరానా? మండల ప్రజలంతా ఓట్లేస్తే గెలిచిన మాకు కనీస విలువ ఇవ్వట్లేదు. అసలు మాకు ప్రోటోకాల్ అంటూ ఉందా? లేదా? ఆఫీసర్లు చెప్పాలె.
- కోవ అరుణ, జడ్పీటీసీ, సిర్పూర్ యూ