బెంగళూరు: ఈరోజుల్లో కొందరు అందినకాడికి అప్పులు చేసి తలకు మించిన భారాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఆ అప్పులు తీర్చలేక కుటుంబాలకు కుటుంబాలు సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలను చూస్తూనే ఉన్నాం. బెంగళూరు రూరల్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.
బెంగళూరులోని అనేకల్ తాలూకాలో ఈ ఘటన జరిగింది. అప్పులిచ్చిన వాళ్ల నుంచి బెదిరింపులు పెరిగిపోయాయని, అందుకే తామే చనిపోతున్నామని ఒక వీడియో రికార్డ్ చేసిన మోహన్ గౌడ అనే 27 ఏళ్ల యువకుడు తల్లిని, అక్కను, అక్క కొడుకు మయాంక్ గొంతు కోసేశాడు. ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
ఈ ఘటనలో మోహన్ గౌడ తల్లి, అక్క ఇద్దరూ చనిపోయారు. మోహన్ గౌడ, అతని అక్క కొడుకైన 11 ఏళ్ల మయాంక్ పరిస్థితి విషమంగా ఉంది. మోహన్ గౌడ.. పండుగలకు స్కీంల పేరుతో సీజనల్ చిట్టీల వ్యాపారం చేసేవాడు. ఉగాదికి మాంసం స్కీం, దీపావళికి ఫైర్ క్రాకర్స్ స్కీం పేరుతో సీజనల్ చిట్టీల వ్యాపారం చేసిన మోహన్ గౌడ 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ వ్యాపారంలో అప్పు చేసి మరీ పెట్టుబడులు పెట్టాడు.
►ALSO READ | బ్యాంకు పొరపాటుతో అకౌంట్లోకి 10 కోట్లు.. నావి కాదంటూ.. రైతు భార్య నిజాయితీకి నెటిజన్లు ఫిదా!
ఈ వ్యాపారం చేసినంత కాలం మోహన్ గౌడ విలాసవంతమైన జీవితం గడిపాడు. ఈ లగ్జరీ లైఫ్ స్టైల్ కారణంగా మోహన్ గౌడకు మరిన్ని అప్పులు మీదొచ్చి పడ్డాయి. తీసుకున్న అప్పులు తిరిగి కట్టలేక కొన్ని నెలల నుంచి మోహన్ గౌడ సతమతమవుతున్నాడు. దీనికి తోడు వ్యాపారంలో కూడా తీవ్ర నష్టాలొచ్చాయి. ఒకవైపు అప్పులిచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి రోజురోజుకూ పెరిగిపోయింది.
బెదిరింపులు కూడా మొదలవ్వడంతో ఏం చేయాలో పాలుపోని మోహన్ గౌడ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ముందు వాళ్లను చంపేసి ఆ తర్వాత అతను కూడా చనిపోవాలని ప్లాన్ చేశాడు. చివరకు అనుకున్నదే చేశాడు. మోహన్ గౌడ తల్లి ఆశా(55), అక్క వర్షిత (34) ప్రాణాలు కోల్పోయారు. మోహన్ గౌడ, మయాంక్ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
