IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేడు (మార్చి 29) ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై గత సీజన్‌లో నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరగా, కేకేఆర్ మాత్రం ఎనిమిదో స్థానంతో తీవ్ర నిరాశపరిచింది. ఈసారి ఎలాగైనా శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. ముంబై తమ కోర్ టీమ్‌ను అలాగే ఉంచుకుంటూనే, మినీ వేలంలో క్వింటన్ డి కాక్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ వంటి ఆటగాళ్లను జట్టులోకి చేర్చుకుంది. మరోవైపు, కేకేఆర్ కూడా ఈ వేలంలో దూకుడుగా వ్యవహరించింది. భారీ ధరకు కెమెరాన్ గ్రీన్, మతీషా పతిరానాను దక్కించుకోవడంతో పాటు ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర లాంటి స్టార్లతో తుది జట్టులో చేర్చుకుని బలోపేతం చేసింది.
హెడ్-టు-హెడ్ రికార్డులు:
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల రికార్డులను పరిశీలిస్తే ముంబై ఇండియన్స్‌దే పైచేయి కనిపిస్తుంది. కేకేఆర్, ముంబై జట్ల మధ్య ఇప్పటి వరకు 35 మ్యాచ్‌లు జరగగా.. అందులో 24 మ్యాచులలో ముంబై ఇండియన్స్ విజయం సాధించగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం 11 మ్యాచులలో మాత్రమే గెలిచింది. కాగా ఈ రెండు జట్ల మధ్య గత 5 మ్యాచ్‌లను పరిశీలిస్తే.. MI: ఓటమి, విజయం, ఓటమి, విజయం, ఓటమితో నమోదు చేయగా.. KKR: ఓటమి, ఓటమి, విజయం, విజయం, ఓటమితో సమానంగా కనిపిస్తున్నాయి.
కీలక రికార్డులు:
అత్యధిక టీమ్ స్కోరు: 2019లో ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్, ముంబైపై 232/2 పరుగులు చేసింది.
అత్యల్ప టీమ్ స్కోరు: 2008లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ ధాటికి కేకేఆర్ కేవలం 67 పరుగులకే ఆలౌట్ అయింది.
అత్యధిక వ్యక్తిగత స్కోరు: రోహిత్ శర్మ 2012లో కోల్‌కతాపై అజేయంగా 109* పరుగులు చేశాడు.
అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు: జస్ప్రీత్ బుమ్రా 2022 సీజన్‌లో కేవలం 10 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
అత్యధిక పరుగులు: ఈ పోరులో రోహిత్ శర్మ 29 ఇన్నింగ్స్‌ల్లో 967 పరుగులతో తొలిస్థానంలో ఉన్నాడు.
అత్యధిక వికెట్లు: కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ ముంబై ఇండియన్స్ పై ఇప్పటివరకు 26 వికెట్లు తీసుకున్నాడు.
గత చరిత్రను బట్టి చూస్తే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, కొత్తగా చేరిన స్టార్ ఆటగాళ్లతో కేకేఆర్ ఈసారి గట్టి పోటీ ఇచ్చే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది. వాంఖడే స్టేడియంలో అభిమానులకు అసలైన టీ20 మజా ఈరోజు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది.
►ALSO READ | IPL 2026: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సూపర్ రికార్డ్.. ఎవరికి అందనంత ఎత్తులో..
