మనుషులతో కలిసిపోయి.. తెలివిగా పనులు చేయగలిగే జంతువులు ఏవి అంటే ఎవరైనా వెంటనే డాగ్స్ అని చెప్పేస్తారు. కానీ, కుక్కలు, పిల్లులకంటే ఇంటెలిజెంట్ యానిమల్ ఉందంటున్నారు సైంటిస్టులు. పందులు మనం ఊహించేదానికంటే ఎంతో ఇంటెలిజెంట్‌గా బిహేవ్ చేయగలవని ఆధారాలతో నిరూపిస్తున్నారు. వీడియో గేమ్స్‌ను జాయ్ స్టిక్ సాయంతో పందులు ఆడేస్తున్నాయి. డిజిటల్ స్క్రీన్‌ను చూస్తూ కర్సర్‌ను మూవ్ చేయడంలో కూడా పందులు ఆరితేరిపోతున్నాయి.
కెనడాకు చెందిన రీసెర్చర్ల టీమ్ నాలుగు పందులపై స్టడీ చేసింది. వాటికి మూతితో జాయ్‌స్టిక్‌ను కదపడం నేర్పించారు. అలాగే స్క్రీన్‌పై కర్సర్‌ను కదపడంపై కూడా ట్రైనింగ్ ఇచ్చారు. నాలుగు పందులు కూడా ఆ కాన్సెప్ట్‌ను అర్థం చేసుకోవడమే కాకుండా గేమ్‌కు, జాయ్ స్టిక్కు, కర్సర్‌కు ఉన్న సంబంధాన్ని కూడా తెలుసుకున్నాయి. ఇప్పుడు ఈజీగా వీడియో గేమ్స్‌ను ఆడేస్తున్నాయి. వేళ్లు, పాదాలు లేకపోవడం వల్ల పందులు ఈ పనులన్నీ చేస్తాయని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయరు. కానీ, అవి తమ నోటితోనే ఈ పనులన్నీ చేసేస్తున్నాయి. ఇది అద్భుతమని యానిమల్ బిహేవియర్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గతంలో జరిపిన స్టడీల్లో కమ్, సిట్ వంటి చిన్నచిన్న కమాండ్స్‌ను పందులు నేర్చుకుంటాయని తేలింది. కానీ, అవి వీడియో గేమ్స్ కూడా ఆడగలవని ఇప్పుడే తెలిసింది.
ట్రీట్స్ ఇచ్చి నేర్పించిన్రు
ప్రొఫెసర్ క్రోనే, ఆయన టీమ్ రెండు యార్క్షేర్ పిగ్స్(హామ్లెట్, ఆమ్లెట్) రెండు పానెపింటో మైక్రో పిగ్స్(ఎబోనీ, ఐవరీ)పై స్టడీ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్ పార్ట్‌గా జాయ్ స్టిక్‌ను ఎలా వాడాలో నేర్పేందుకు కొన్ని ట్రీట్స్‌తో వాటిని మానిప్యులేట్ చేశారు. అలా వాటికి జాయ్ స్టిక్‌ను అలవాటు చేశారు. ఆ తర్వాత వాటికి డిజిటల్ స్క్రీన్‌పై వీడియో గేమ్‌ను ఎలా ఆడాలో నేర్పించారు. నాలుగు టార్గెట్లను చేరేలా కర్సర్‌ను మూవ్ చేయాల్సి ఉంటుంది. వీటిని కూడా పందులు బాగానే నేర్చుకున్నాయి. ప్రతి పిగ్ కూడా తమకు ఇచ్చిన ఎక్స్పెరిమెంటల్ టాస్క్‌లను సక్సెస్‌ఫుల్‌గానే కంప్లీట్ చేశాయి. కొన్ని ఎక్కువ చాన్స్‌లు తీసుకుంటే.. కొన్ని తక్కువ చాన్స్లకే పూర్తి చేశాయి. ఈ టైంలోనే జాయ్స్టిక్కు, కర్సర్‌కు మానిటర్‌కు మధ్య ఉండే కనెక్షన్‌ను కూడా అర్థం చేసుకున్నాయి. అంతేకాదు పక్క నుంచి ఇన్స్ట్రక్టర్లు చెప్పే మాటలను కూడా అవి విని గేమ్‌ను పక్కాగా ఆడుతున్నాయి.
ఫుడ్డును దాచినా పట్టేస్తున్నయ్
మరో స్టడీలో తాము ఉన్న చోట ఆహారాన్ని ఎక్కడ దాచారో తెలుసుకునేందుకు పందులు అద్దాలను వాడగలవని కూడా రీసెర్చర్లు గుర్తించారు. కొన్ని టూల్స్‌ను కూడా పందులు యూజ్ చేయగలవని తేల్చారు. ఇది అంత చిన్న విషయం కాదని, కాన్సెప్ట్‌ను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మారడం కష్టమని, కానీ ఈ పనిని పందులు ఈజీగా చేసేస్తున్నాయని యానిమల్ బిహేవియర్ ఎక్స్పర్ట్ కాండేస్ క్రోనే చెప్పారు. ఈ ఎక్స్‌పెరిమెంట్‌ను లీడ్ చేస్తున్నది ఆయనే. ‘‘ఈ స్టడీ మనకు కొంత మాత్రమే తెలిసేలా చేసింది. పందులు ఇంకా ఏమేం చేయగలవో మనం ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. ఇలా నేర్చుకున్నది వాటిపై ఎంత ఇంపాక్ట్ చూపుతుందనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది’’ అని క్రోనే తెలిపారు. కుక్కలకంటే కొన్ని ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేయడంలో పందులే చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. పందులకు లాంగ్ టర్మ్ మెమరీ చాలా ఎక్కువ. అందువల్ల టాస్క్‌లను ఈజీగా పూర్తి చేస్తాయంటున్నారు. కొన్ని ట్రిక్స్‌ను కూడా పందులు ఈజీగా నేర్చుకోగలుగుతున్నాయని, కేజ్ డోర్లను తెరవడం ఎలాగో, చిన్న ఖాళీ నుంచి జంప్ చేయడం ఎలాగో నేర్చుకుంటున్నాయని తెలిపారు. పందులకు క్యూరియాసిటీ ఎక్కువని, ఇతర జంతువులతోనూ ఎమోషన్‌ను షేర్ చేసుకోగలవని వివరిస్తున్నారు.