ఉపవాసం మనదేశంలో చాలా కామన్. దేవుడి కోసమో, హెల్త్ కోసమో ఉపవాసం అదే ఒక్కపొద్దు ఉంటే మంచిదని అనుకుంటుంటారు.అయితే ఇప్పుడు ఇదే ఉపవాసం ట్రెండ్ వరల్డ్ వైడ్‌గా పాపులర్ అవుతోంది. బరువు తగ్గడం కోసం ఉపవాసమే కరెక్ట్ సొల్యూషన్ అంటున్నారు డైట్ నిపుణులు. దీన్నే ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’ అంటారు.
ఇంటర్మిటెంట్ అంటే అడపాదడపా అని అర్థం. అంటే.. అప్పుడప్పుడు ఉపవాసాలు చేస్తూ ఆరోగ్యంగా ఉండడమే ఈ డైట్ ఫార్ములా అన్న మాట. ఈ మధ్య ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీ.. ‘రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేస్తాన’ని చెప్పారు. దాంతో ‘ఆయన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫాలో అవుతున్నాడా’ అని చాలామందికి డౌట్ వచ్చింది. సోషల్ మీడియాలో కూడా దీని గురించి పెద్ద చర్చే జరిగింది. అంతేకాకుండా గతేడాదిలో ఈ డైట్ చాలా పాపులర్ డైట్ అని ‘ఇంటర్నేషనల్ ఫుడ్ ఇన్ఫర్మేషన్ కౌన్సిల్ ఫౌండేషన్(ఐఎఫ్ఐసి)’ సర్వే కూడా చెప్తోంది.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే..?
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే.. రోజులో చాలా గంటలపాటు తిండి తినకుండా ఉండి, కేవలం కొన్ని గంటల్లోనే రోజుకు సరిపడినంత ఫుడ్ తీసుకోవడం. దీని వల్ల శరీరం ఇన్సులిన్‌ను బాగా ఉపయోగించుకుంటుంది. తద్వారా రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉండి, టైప్ 2 డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. ఈ డైట్‌లో ఏం తింటున్నాం అనేదానికన్నా.. ఏ సమయంలో తింటున్నాం అన్నది ముఖ్యం. ఈ డైట్‌తో శరీరం బ్యాలెన్స్‌గా ఉండడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు. ఇలా ఈ డైట్ వల్ల చాలానే ఉపయోగాలున్నాయి.
అయితే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో మూడు పద్దతులు ఉంటాయి. అందులో ఒకటి 5:2 పద్ధతి.
- వారంలో రెండు రోజులు, సాధారణంగా తీసుకునే కేలరీల్లో కేవలం 25% మాత్రమే తీసుకోవాలి. మిగిలిన ఐదు రోజుల్లో ఎలాంటి రూల్స్ ఉండవు. అయితే, తక్కువ కేలరీలు తీసుకునే ఆ రెండు రోజులు కూడా వరుసగా ఉండకూడదు. ఇది 5:2 పద్ధతి.
- ఇక రెండోది 16:8. ఈ పద్దతిలో ఒక రోజులో తీసుకోవాలనుకున్న ఆహారం 8 గంటల్లో ముగించి, మిగిలిన 16 గంటలు ఉపవాసం ఉండాలి.
- ఇక మూడో పద్దతిలో వారానికి లేదా నెలకు ఒకరోజు అంటే 24 గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఇలా ప్రతీ డైట్‌లో భోజనానికి, భోజనానికి మధ్య పర్టిక్యులర్ గ్యాప్ ఇచ్చి, ఆహారాన్ని మితంగా తీసుకోవాలి.
ఎప్పటి నుంచో ఉంది
ఉపవాసం మనిషి శరీరానికి కొత్త విషయమేమీ కాదు ఇది ఎప్పటినుంచో మనిషి లైఫ్ స్టైల్‌లో భాగమైపోయింది. అన్ని విషయాలతో పాటే తినడంలోనూ క్రమశిక్షణ అవసరం. దానికోసమే పూర్వీకులు ఉపవాసాన్ని కనిపెట్టి ఉంటారని నిపుణులు అంటున్నారు. ఇది శరీరాన్ని ఒక క్రమపద్ధతిలో పని చేసేలా చేసి దాని ద్వారా మంచి ఫలితాలనిస్తుంది.
అన్నింటిలా కాదు
ఈ ఫాస్టింగ్ ఇతర డైటింగ్ విధానాల్లాగా కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ తినకూడదని చెప్పదు. ఈ డైట్‌లో చేయాల్సిందల్లా కేవలం.. సమయాన్ని పాటించడమే. అలాగని ఒకరోజు విందుభోజనం, మరొకరోజు ఆకలితో అలమటించడం కూడా కాదు. అలా చేసినా ఫలితం ఉండదు. టైంని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతూ ఆహారం తీసుకోవాలి. అదికూడా, పోషక విలువలు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకుంటే బెటర్. ఈ డైట్ తీసుకునేవాళ్లు చేప నూనె, గింజలు, విత్తనాలు, ధాన్యాలు, కొవ్వుశాతం తక్కువగా ఉన్న ప్రొటీన్స్, ఫైబర్ ఎక్కువగా లభించే పళ్లు, కూరగాయలు, విటమిన్స్, మినరల్స్ తీసుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
డయాబెటిస్‌కు మందు
ప్రపంచ వ్యాప్తంగా చాలామంది టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోకపోతే టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఎక్కువ బరువు, థైరాయిడ్, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడం, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, వేళకు భోజనం చేయకపోవడం, నిద్ర సరిగ్గా పోకపోవడం, వ్యాయామం చేయకపోవడం.. వంటి కారణాల వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. అయితే జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ నుంచి కొంత వరకు తప్పించుకోవచ్చు. అందుకే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల లైఫ్ స్టైల్‌లో మార్పులు చేసుకుని, దానిద్వారా డయాబెటిస్‌ను అదుపు చేయొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.
లాభాలివి
- ఈ తరహా ఉపవాసం వల్ల వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావట. ఎందుకంటే ఉపవాసంలో ఉన్నప్పుడు మన శరీరం కొత్త కణాలను నిర్మించుకోవడంతోపాటు, పాత కణాలకు మరమ్మత్తులు చేసుకుంటుంది. ఇది యాంటీ ఏజింగ్ ప్రభావాన్ని కలిగిస్తుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు.
- ఉపవాసం వల్ల మెదడు పనితీరు బాగా పెరుగుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే ఎల్లప్పుడూ యాక్టివ్‌గా కూడా ఉంటారు.
- ఉపవాసం చేస్తే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు లాంటి చిన్నచిన్న సమస్యలు నయమవుతాయి.
- అప్పుడప్పుడు ఉపవాసం చేస్తే క్యాన్సర్ కూడా నయమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఉపవాసం వల్ల క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.
- కనీసం వారానికి లేదా నెలకు ఒకసారి.. ఉపవాసం ఉండటం వల్ల.. శరీరానికి చాలా మంచిదని, ఇతర మందులు వాడటం కంటే.. ఒకసారి ఉపవాసం ఉండటం వల్ల చాలా ప్రయోజనకరమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్యాన్ని బట్టి.. ఎన్ని రోజులకు ఒకసారి ఉపవాసం మంచిది అనేది డిసైడ్ అయి ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
- వారానికి ఒకరోజు ఉపవాసం ఉండటం వల్ల.. బరువు తగ్గడంలో శరీరం పాజిటివ్‌గా స్పందిస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో పేరుకున్న ఫ్యాట్‌ని శరీరం ఉపయోగించుకుని.. ఎనర్జీ ఇస్తుంది. దీనివల్ల బరువు తగ్గుతారు.
- ఫాస్టింగ్ వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ గా ఉంటాయి. మెదడు పనితీరుకి ఉపవాసం సరైన ఔషధం. దీనివల్ల మెదడు కణాలు మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.
- ఉపవాసం న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ అనే ప్రొటీన్స్‌ని ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇవి బ్రెయిన్ సెల్స్ ఆరోగ్యానికి సహాయపడతాయి.
- వారానికి లేదా నెలకు ఒకసారి ఉపవాసం ఉండటం వల్ల ఇమ్యునిటీ పెరుగుతుంది. అలాగే సెల్ డ్యామేజ్ అవకుండా అడ్డుకుంటుంది.
- చర్మ సమస్యలకు.. శరీరంలో పేరుకున్న మలినాలే కారణం. వీటివల్ల మొటిమలు ఎక్కువగా వస్తాయి. ఉపవాసం శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. అందుకే ఉపవాసం వల్ల క్లియర్ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ వస్తుంది. చర్మం యంగ్‌గా కనిపించేలా చేస్తుంది.
సైడ్ ఎఫెక్ట్స్
ఈ డైట్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోలేదు. మొదట్లో శరీరం ఈ తరహా ఆహార విధానాన్ని అలవాటు చేసుకోడానికి అడ్జస్ట్ కాకపోవచ్చు. అందుకే చాలామంది ఈ డైట్‌ను మధ్యలోనే ఆపేస్తారు. అలా కాకుండా డైట్‌ను ఫాలో అయ్యే ముందు డాక్టర్‌ని సంప్రదించి డెసిషన్ తీసుకుంటే మంచిది.
ఈ డైట్ పాటిస్తూ ఎక్సర్ సైజ్ చేస్తే మొదట్లో ఇబ్బంది పెట్టినా, అడ్జస్ట్ మెంట్ పీరియడ్ తర్వాత అంతా సర్దుకుంటుంది. అందుకే డైట్ ఫాలో అయ్యే వాళ్లు ముందు ఇబ్బందిగా ఉన్న రెగ్యులర్ వర్కవుట్స్‌ని విడిచిపెట్టకూడదు.
అందరికీ కాదు
ఇకపోతే ఈ డైట్ అందరికీ అంత మంచిది కాదు. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు. గర్భిణీలు, డయాబెటిస్, లో బీపీ సమస్య ఉన్న వాళ్లు, ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నవాళ్లు, తక్కువ బరువు ఉన్నవాళ్లు డైట్ ఫాలో అయ్యే ముందు డాక్టర్‌ను సంప్రదిస్తేనే మంచిది. కడుపులో అల్సర్ ఉన్నవారు ఉపవాసమే చేయకూడదు.
