పేటీఎం, నైకా, జొమాటో, పాలసీ బజార్‌‌ ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు!

పేటీఎం, నైకా, జొమాటో, పాలసీ బజార్‌‌ ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు!
  • గత 3 నెలల్లోనే రూ. 1.7 లక్షల కోట్లు తగ్గిన ఈ కంపెనీల ఇన్వెస్టర్ల సంపద
  • కొత్త తరం టెక్‌ కంపెనీల షేర్లను అమ్మేస్తున్న ఇన్వెస్టర్లు
  • ఈ దెబ్బకు ఐపీఓకి  రావడాన్ని ఆలస్యం చేస్తున్న ఓయో, డెల్హివరీ

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: ఐపీఓ లిస్టింగ్‌‌‌‌ టైమ్‌‌‌‌లో అదరగొట్టిన  కొత్త తరం టెక్ కంపెనీలు, ప్రస్తుతం చతికలపడుతున్నాయి. ఈ  కంపెనీల బ్రాండ్‌‌‌‌ను చూసో లేదా బిజినెస్‌‌‌‌ మోడల్‌‌‌‌ను చూసో వెంట పడిన ఇన్వెస్టర్లు, తాజాగా ఈ షేర్లను వదిలించుకోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. పేటీఎం, నైకా,  జొమాటో, పాలసీ బజార్ వంటి కొత్త తరం టెక్ కంపెనీలు, యూనికార్న్‌‌‌‌లు లిస్టింగ్ తర్వాత నుంచి ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. కంపెనీ షేర్లు భారీగా నష్టపోతుండడంతో ఇన్వెస్టర్ల సంపద రూ. లక్ష కోట్లు కంటే ఎక్కువ తగ్గింది.  లిస్టింగ్ రోజు వన్‌‌‌‌ 97 కమ్యూనికేషన్ (పేటీఎం), నైకా, జొమాటో, పీబీ ఫిన్‌‌‌‌టెక్‌‌‌‌ (పాలసీ బజార్‌‌‌‌‌‌‌‌) కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ. 3.58 లక్షల కోట్లకు చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌‌‌‌ క్యాప్‌‌‌‌ రూ. 1.30 లక్షల కోట్లు తగ్గడాన్ని గమనించొచ్చు. ఈ కంపెనీల షేర్లు కూడా తమ ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ హైల నుంచి సుమారు సగం నష్టపోయాయి. రూ. 169 వరకు పెరిగిన  జొమాటో షేరు ప్రస్తుతం రూ. 89 కి పడిపోయింది. నైకా షేరు రూ. 2,574 వద్ద ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ హైని టచ్ చేయగా,  ప్రస్తుతం రూ. 1,446 వద్ద ట్రేడవుతోంది. రూ. 2,150 వద్ద ఐపీఓకి వచ్చిన పేటీఎం షేర్లు, సగం కంటే ఎక్కువ పతనమై రూ. 848 వద్ద ట్రేడవుతున్నాయి. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మే  పాలసీ బజార్ కూడా ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ కంపెనీ షేరు రూ.1,470 వద్ద ఆల్‌‌‌‌టైమ్ హైని టచ్ చేయగా, ప్రస్తుతం రూ. 755 కి పడిపోయింది. ఈ కంపెనీల షేర్లు లిస్టింగ్ టైమ్‌‌‌‌లో లేదా ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ఆల్‌‌‌‌టైమ్ హైని టచ్‌‌‌‌ చేయగలిగాయి. బిజినెస్ మోడల్స్ బాగుంటాయనే అంచనాలతో ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడానికి స్టార్టింగ్‌‌‌‌లో ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ కంపెనీల షేర్లను వదిలించుకుంటున్నారు. మార్కెట్ పడుతుండడంతో కూడా హై వాల్యుయేషన్‌‌‌‌లో ఉన్న ఇటువంటి షేర్లను ఇన్వెస్టర్లు అమ్మేస్తున్నారు.

ఇన్వెస్టర్లకు షాక్‌‌‌‌..

పేటీఎం మార్కెట్ క్యాప్‌‌‌‌ లిస్టింగ్ రోజు నుంచి చూస్తే  రూ. 45,597 కోట్లు తగ్గింది. లిస్టింగ్ రోజు ఈ కంపెనీ మార్కెట్ క్యాప్‌‌‌‌ ఏకంగా రూ. 1,01,400 కోట్లకు చేరుకోగా,  ప్రస్తుతం  రూ. 55,802 కోట్లకు దిగొచ్చింది.  నైకా మార్కెట్ క్యాప్ లిస్టింగ్ రోజు రూ. 1,04,361 కోట్లను టచ్ చేయగా, ప్రస్తుతం రూ. 71,309 కోట్లకు పడిపోయింది. ఇన్వెస్టర్లు రూ. 33,052 కోట్లు నష్టపోయారు. జొమాటో మార్కెట్ క్యాప్ లిస్టింగ్ రోజు రూ. 98,732 కోట్లుండగా, ప్రస్తుతం రూ. 66,872 కోట్లకు దిగొచ్చింది. పాలసీ బజార్ మార్కెట్ క్యాప్ కూడా రూ. 54,070 కోట్ల నుంచి  రూ. 34,870 కోట్లకు తగ్గింది.

యావరేజ్ చేయొద్దు..

ఇప్పటికే ఈ షేర్లలో ఇన్వెస్ట్ చేసి ఉంటే యావరేజ్‌‌‌‌‌‌ చేయొద్దని ఎలిక్సిర్‌‌‌‌‌‌‌‌ ఈక్విటీస్‌‌‌‌ డైరెక్టర్ దీపన్‌‌‌‌ మెహతా అన్నారు. పడుతున్న షేర్లను యావరేజ్ చేయొద్దని సలహాయిచ్చారు. కానీ, కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది మంచి టైమ్‌‌‌‌ అని పేర్కొన్నారు. ఇటువంటి షేర్లను అర్థం చేసుకోవడం కష్టమని, కానీ, ఇంకో మూడు నుంచి ఐదేళ్లలో ఈ కంపెనీలు సంపద క్రియేట్ చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కొత్త తరం టెక్ కంపెనీల్లో ఏవి దూసుకుపోతాయో చెప్పలేమని అన్నారు. ఫ్యూచర్ టెక్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ వాల్యూనైనా చెల్లించడానికి ఇన్వెస్టర్లు ముందుకొచ్చారని, ఈ కంపెనీలు ఏదో ఒక రోజు లాభాల్లోకి వస్తాయని అంచనావేశారని జేఎస్‌‌‌‌టీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ ఎనలిస్ట్ ఆదిత్య కొండ్వార్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. అందుకే జొమాటో, పేటీఎం లేదా నైకా వంటి కంపెనీల వాల్యుయేషన్ వాటి బిజినెస్ కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు డబ్బులు పెట్టడానికి వెనకడుగేయలేదని చెప్పారు. ఈ కంపెనీలు వాస్తవానికి దగ్గరగా ఎప్పడోకప్పుడు ప్రాఫిట్స్‌‌‌‌ను ప్రకటించాల్సి ఉంటుందని,  లేకపోతే ఇన్వెస్టర్లు కంపెనీని వదిలేస్తారని అన్నారు.  కొత్త తరం టెక్ కంపెనీల అడ్వర్టయిజ్‌‌‌‌మెంట్ అండ్ ప్రమోషన్ ఖర్చులు భారీగా పెరిగాయని చెప్పారు. కాగా, సాధారణంగా కొత్త తరం టెక్ కంపెనీలు స్టార్టింగ్‌‌‌‌లో నష్టాల్లోనే నడుస్తున్నాయని దీపన్ మెహతా అన్నారు. ఫేస్‌‌‌‌బుక్, అమెజాన్‌‌‌‌, ట్విటర్‌‌‌‌‌‌‌‌ వంటి కంపెనీలు  ఇలానే మల్టీనేషనల్‌‌‌‌ కంపెనీలుగా ఎదిగాయని చెప్పారు.

ఐపీఓకి రావడంలో ఆలస్యం..

ఇప్పటికే సెబీ అప్రూవల్స్‌‌ పొందిన యూనికార్న్ కంపెనీలు ఓయో హోటల్స్‌‌, డెల్హివరీలు ఐపీఓకి రావడానికి జంకుతున్నాయి. కొత్త తరం టెక్‌ కంపెనీల షేర్లు పడుతుండడంతో, ఈ కంపెనీలు కూడా తమ వాల్యుయేషన్‌‌ను తగ్గించుకోవాలనే ప్లాన్‌‌లో ఉన్నాయి. లేదా పరిస్థితుల చక్కబడేంత వరకు ఐపీఓకి రావడాన్ని వాయిదా వేయాలని చూస్తున్నాయి. కాగా, ఓయో, డెల్హివరీ రెండింటిలోనూ సాఫ్ట్‌‌ బ్యాంక్‌‌కు వాటాలు ఉన్నాయి. కొత్త తరం టెక్ కంపెనీల ఇన్వెస్టర్లకు భారీగా నష్టాలొస్తుండడంతో, దీనిపై విచారణ జరపాలని సెబీ చూస్తోంది. దీంతో కూడా ఈ కంపెనీలు ఐపీఓకి రావడంలో లేటవుతోంది.