6 నెలలు.. 10 కోట్ల దాడులు: ఐవోటీ డివైస్​లపై హ్యాకర్ల పంజా

6 నెలలు.. 10 కోట్ల దాడులు: ఐవోటీ డివైస్​లపై హ్యాకర్ల పంజా

    2.76 లక్షల ఐపీ అడ్రస్‌‌‌‌‌‌‌‌ల నుంచి ఎటాక్స్ 

    30% దాడులు చైనాపైనే

     సైబర్ ఎటాక్​లపై  కాస్పర్​స్కై రిపోర్ట్​

     ‘ఐవోటీ: ఏ మాల్ వేర్ స్టోరీ’ పేరుతో నివేదిక

వర్చువల్ అసిస్టెంట్.. చిన్న డబ్బాలానే ఉంటది. కానీ ఇంటర్నెట్​తో కనెక్ట్ అయి మనకు ఎన్నో పనులు చేసి పెడ్తది. పాటలు వినిపిస్తది. వార్తలు చదువుతది. అలారం సెట్ చేస్తది. ఏ టైంకు ఏ పని చేయాల్నో గుర్తు చేస్తది. ఇంకా ఎన్నో పనులను చేసి పెడ్తది. అలాగే స్మార్ట్ టీవీ.. బోలెడు చానెళ్లు చూసుకోవచ్చు. గేమ్స్ ఆడుకోవచ్చు. కంప్యూటర్​గానూ  వాడుకోవచ్చు. స్మార్ట్ డోర్ లాక్, స్మార్ట్ ఫ్రిజ్, స్మార్ట్ ఏసీలు, స్మార్ట్ హీటింగ్ సిస్టంల వంటివన్నీ ఇప్పుడు మన ఇండ్లను స్మార్ట్ హోమ్స్​గా మార్చేస్తున్నాయి.

ఇంటర్నెట్​తో కనెక్ట్ అయి ఉండి పనిచేసే పరికరాలనే ఇంటర్నెట్ ఆఫ్​ థింగ్స్ (ఐవోటీ) అంటున్నం. అయితే, ఇలాంటి ఐవోటీ డివైస్​లను సైబర్ క్రిమినల్స్ చాలా ఈజీగా హ్యాక్ చేసేస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఐవోటీలపై ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా10 కోట్లకు పైగా సైబర్ దాడులు జరిగాయట. ఐవోటీ డివైస్​లను సైబర్ నేరగాళ్లు ఎలా కంట్రోల్​లోకి తీసుకుంటున్నారు? సమస్య ఎంత తీవ్రంగా ఉంది? అన్నవి తెలుసుకునేందుకు తాము హనీపాట్స్ నెట్ వర్క్స్​  ఎరగా వేయగా ఐపీ అడ్రస్ లతో సహా హ్యాకర్ల సీక్రెట్స్ తెలిశాయని మల్టీనేషనల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘కాస్పర్ స్కై’ వెల్లడించింది. దీనిపై  ‘ఐవోటీ: ఏ మాల్ వేర్ స్టోరీ’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది.

2018 కంటే 9 రెట్లు ఎక్కువ

వివిధ దేశాల్లోని ఐవోటీ డివైస్​లపై ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో మొత్తం10.50 కోట్ల సైబర్ దాడులు జరిగాయని కాస్పర్ స్కై వెల్లడించింది. 2.76 లక్షల ఐపీ అడ్రస్​ల నుంచి హ్యాకర్లు ఈ దాడులు చేశారని తెలిపింది. అయితే గత ఏడాది మొదటి ఆరునెలల్లో 69 వేల ఐపీ అడ్రస్​ల నుంచి 1.2 కోట్ల దాడులు మాత్రమే జరిగాయని, ఈ ఏడాది సైబర్ దాడులు ఏకంగా 9 రెట్లు ఎక్కువయ్యాయని పేర్కొంది. ఐవోటీ డివైస్​లను హ్యాక్ చేయడం ద్వారా మాల్ వేర్​ను వ్యాప్తి చేయడం, ఆ డివైస్​లను కంట్రోల్​లోకి తీసుకుని డబ్బు డిమాండ్ చేయడం, ఇతర రకాలుగా డబ్బు సంపాదించేందుకు వాడుకోవడం వంటివి చేశారని తెలిపింది. మాల్ వేర్స్ వ్యాప్తి చేసిన తర్వాత ఆ డివైస్​లను కంట్రోల్లోకి తీసుకుని, డీడీఓఎస్ తరహా ఎటాక్స్ చేయడం లేదా వాటిని తమ హ్యాకింగ్ యాక్టివిటీస్ కోసం ప్రాక్సీలుగా వాడుకోవడం కూడా చేస్తున్నారని తెలిపింది.

ఈ మూడు మాల్ వేర్​లతోనే..

సైబర్ క్రిమినల్స్ ఈ ఏడాది మిరాయ్, న్యాడ్రాప్, గాఫ్జిట్ అనే మూడు రకాల మాల్ వేర్​లనే ఎక్కువగా ఉపయోగించారట. ఈ ఏడాది 39 % సైబర్ దాడులకు మిరాయ్​ను వాడారట. ఈ మాల్ వేర్ ఐవోటీ డివైస్​లలోని లోపాలను ఆసరాగా చేసుకుని, వాటిలోకి చేరి కంట్రోల్​లోకి తీసుకుంటున్నాయని కాస్పర్ స్కై తెలిపింది. అలాగే పాస్ వర్డ్​లను తెలుసుకునేందుకు బ్రూట్ ఫోర్సింగ్ వంటి పద్ధతులు వాడుతున్నారని పేర్కొంది. న్యాడ్రాప్​ను 38.75% దాడులకు వాడారట. ఇది మిరాయ్ డౌన్​లోడర్​గా పనిచేస్తుందట. వీటి తర్వాత గాఫ్జిట్ మాల్ వేర్​ను 2.12% దాడులకు ఉపయోగించారని తేలింది.

ఎక్కువ సైబర్ దాడులు చైనాపైనే..  

సైబర్ దాడులు ఏయే దేశాల్లో ఎన్ని జరిగాయన్న వివరాలను కూడా కాస్పర్ స్కై పరిశీలించింది. దీంతో ఈ ఏడాది చైనాలో అత్యధికంగా 30 శాతం సైబర్ దాడులు జరిగాయని తేలింది. ఆ తర్వాత బ్రెజిల్​లో 19 శాతం, ఈజిప్ట్​లో 12 శాతం దాడులు జరిగాయని వెల్లడైంది. గత ఏడాది బ్రెజిల్​లో 28 శాతం, చైనాలో 14 శాతం, జపాన్​లో 11 శాతం సైబర్ ఎటాక్స్ జరిగాయని తేలింది.

ఐవోటీ డివైస్‌‌‌‌‌‌‌‌లను ఇలా రక్షించుకోవచ్చు..

ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్ అప్​డేట్​లను ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఏవైనా లోపాలు ఉంటే అప్​డేట్​లతో వాటిని నివారించే అవకాశం ఉంటుంది.

పాస్​వర్డ్​లను తరచూ మార్చాలి. క్యాపిటల్, లోయర్ కేస్ అక్షరాలు, నెంబర్లు, సింబల్స్ కలిపి కష్టమైన పాస్​వర్డ్​లను సెట్​ చేసుకోవాలి.

పరికరాల్లో ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే రీబూట్ చేయాలి. దీనివల్ల ఇదివరకే వచ్చిన మాల్​వేర్ నుంచి రక్షణ ఉంటుంది.

ఐవోటీ పరికరాలను లోకల్ వీపీఎన్, హోమ్ నెట్ వర్క్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయాలి. వైర్ గార్డ్ లు, ఓపెన్ సోర్స్ వీపీఎన్ సొల్యూషన్ వంటివీ ఉపయోగపడతాయి.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి