- 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీల పెంపునకు ప్రపోజల్స్
- ముమ్మరంగాకొనసాగుతున్న సర్వే పనులు
- మార్చి చివరి నాటికి డీపీఆర్ రెడీ
- నీటిని విడుదల చేసేటప్పుడు విద్యుత్ ఉత్పత్తికి ప్లాన్
గద్వాల, వెలుగు: నెట్టెంపాడు లిఫ్ట్‌లో భాగంగా ధరూర్ మండలం గుడ్డెం దొడ్డి గ్రామ సమీపంలో నిర్మించిన గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు ఇరిగేషన్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం 1.19 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న రిజర్వాయర్‌ను 15 టీఎంసీలకు విస్తరించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు రబీ, ఖరీఫ్ పంటలకు నీటి కొరత లేకుండా ఉండేందుకు ఈ విస్తరణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సర్వే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మార్చి చివరి నాటికి సర్వే పూర్తి చేసి డీపీఆర్ సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రోజుకు అర టీఎంసీ ఎత్తిపోసేలా..
రిజర్వాయర్ కెపాసిటీ 15 టీఎంసీలకు పెంచిన తర్వాత జూరాల ప్రాజెక్టుకు వచ్చే వరద నీటిలో నుంచి రోజుకు అర టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా మోటార్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. 30 రోజుల్లోనే రిజర్వాయర్ నింపేలా పంపు సామర్థ్యాన్ని నిర్ణయించనున్నారు.
రూ.5 వేల నుంచి రూ.6 కోట్ల అంచనా..
విస్తరణకు సుమారు రూ.5 వేల నుంచి రూ.6 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ప్రస్తుతం 1,400 ఎకరాల భూసేకరణతో నిర్మించిన ఈ రిజర్వాయర్ కింద 64 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. విస్తరణకు మరో 700 ఎకరాల భూసేకరణ అవసరమవుతుందని అధికారులు తెలిపారు. ధరూర్ మండలంలోని రిజర్వాయర్ దిగువనున్న కొత్తపాలెం గుట్టలను ఆనుకొని కొత్తగా రిజర్వాయర్ నిర్మించనున్నారు. 11.150 కిలోమీటర్ల పొడవుతో కొత్త రూపకల్పన సిద్ధం చేస్తున్నారు.
నీటి విడుదలలోనే విద్యుత్ ఉత్పత్తి..
రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసే సమయంలో టర్బైన్‌ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ విధానం అమలు చేయాలని ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు.
రబీలో నీటి కష్టాలకు చెక్..
నడిగడ్డతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రబీ సీజన్‌లో నీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. విస్తరణ పూర్తయితే అవసరమైనప్పుడు గద్వాల జిల్లా ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులకు కూడా నీటిని సరఫరా చేయడం సులభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
సర్వే ముమ్మరం
రిజర్వాయర్ విస్తరణ సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.16 లక్షలు విడుదల చేసింది. సాయి గణేశ్ అసోసియేట్ కంపెనీ సర్వే పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నది. మార్చి చివరినాటికి డీపీఆర్ రెడీ చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాం.
– రహీముద్దిన్, ఎస్సీ, ఇరిగేషన్ శాఖ
