ఇండియాలో గుళ్లు, గోపురాలను టెర్రరిస్టులు టార్గెట్ చేశారా..

ఇండియాలో గుళ్లు, గోపురాలను టెర్రరిస్టులు టార్గెట్ చేశారా..

భారత్ పై ఉగ్రవాదులు మరోసారి దాడులు చేద్దామని ప్లాన్ చేశారా..? భారతదేశంలోని గుళ్లు, గోపురాలను టార్గెట్ చేశారా..? అవును..ఢిల్లీ పోలీసుల విచారణలో  ఈ భయంకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ పోలీసులు ఓ ఐసిస్ కార్యకర్తను పట్టుకుని విచారించిగా..సంచలన విషయాలు బయటకు వచ్చాయి. 

ఢిల్లీ పోలీసుల చేతికి చిక్కిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాది షానవాజ్‌ విచారణలో సంచలన విషయాలను వెల్లడయ్యాయి. 26/11 తరహా ఉగ్రవాద దాడి చేయడానికి భారతదేశం అంతటా ఐదు ప్రదేశాలలో  రెక్కీ నిర్వహించినట్లు విచారణలో షానవాజ్ పేర్కొన్నాడు.  నుహ్, మేవాత్, ఢిల్లీ, లక్నో,  రుద్రప్రయాగ్ దగ్గర పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు వెల్లడించాడు. వీటితో పాటు.. అహ్మదాబాద్, సూరత్,  బరోడాలోని ఆర్‌ఎస్‌ఎస్‌తో సహా హిందూ అనుబంధ సంస్థలకు చెందిన 15 ప్రాంగణాల్లో తాను రెక్సీ నిర్వహించానని చెప్పాడు. అంతేకాకుండా  మితవాద సంస్థలు, హిందూ నాయకులపై దాడి చేయాలని తాను భావించినట్లు విచారణలో షాన్ వాజ్ అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. 

ISIS ఉగ్రవాది అయిన షానవాజ్ ఢిల్లీ నివాసి. అతను NIT నాగపూర్ లో ఇంజనీరింగ్ చదివాడు. అతని తండ్రి హజారీబాగ్ లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. షాజవాజ్.. తరచూ ఢిల్లీకి వస్తుండేవాడు. క్రమం తప్పకుండా దార్స్‌కు హాజరయ్యేవాడు. క్రమంగా ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడు. ఈ సమయంలో రిజ్వాన్‌ అనే వ్యక్తిని కలిశాడు. 2019 -20లో షానవాజ్  IEDలను ఎలా తయారు చేయాలో నేర్చుకోవడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఒక విదేశీ హ్యాండ్లర్‌తో పరిచయం ఏర్పడింది. ఆన్‌లైన్ తరగతుల సహాయంతో IEDని ఎలా తయారు చేయాలో  విదేశీ  హ్యాండ్లర్.. రిజ్వాన్,  షానవాజ్ లకు నేర్పించాడు. 

తాను తయారు చేసిన పేలుడు పదార్థాలను పరీక్షించడమే కాకుండా..భారతదేశంలో  రహస్య స్థావరాలు,  లక్ష్యాలను గుర్తించడం కూడా షానవాజ్ ప్రారంభించినట్లు  అధికార వర్గాలు తెలిపాయి. విదేశీ హ్యాండ్లర్.. షానవాజ్‌ను పూణేకు వెళ్లమని కోరాడు.  చిత్తోర్‌గఢ్‌లో అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులను పూణేకు తరలించాలని హ్యాండ్లర్ షానవాజ్‌ను కోరాడు. షానవాజ్, రిజ్వాన్ గ్రూప్  చిత్తోర్‌గఢ్‌లోని మరో గ్రూప్ పూణేలో  వేర్వేరు ప్రదేశాల్లో బస చేసినప్పటికీ క్రమం తప్పకుండా కలుసుకుంటూనే ఉన్నాయి.  ప్రతీరోజూ ఐఈడీలు, పేలుడు పదార్థాలు తయారు చేస్తుండేవి. అయితే ఒక గ్రూప్ పోలీసులకు చిక్కడంతో...షానవాజ్, రిజ్వాన్ ఇద్దరు  ఢిల్లీకి పారిపోయారు. 

ఢిల్లీ, పూణేలో పనిచేసే ఐసిసి సంస్థకు షానవాజ్ మధ్యవర్తిగా పనిచేసినట్లు అధికారులు తెలిపారు. అతను కరుడుగట్టిన ఉగ్రవాది అని..ఉత్తరభారతదేశంలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.  అయితే ముస్లింలపై దౌర్జన్యాలతో  ఆగ్రహించిన ఉగ్రవాదుల  బృందం..ఎవరైతే దాడులకు పాల్పడ్డారో..వారిని విడిచిపెట్టొద్దని నమ్మింది. షానవాజ్.. ఇండియన్ ముజాహిదీన్‌తోనూ సంబంధాలు కలిగిఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హిందూ నాయకులను,  యూదులను బహిరంగ ప్రదేశాల్లో షానవాజ్ చంపాలనుకున్నాడు. షానవాజ్  అతని గ్రూప్ వెనుక పాకిస్తాన్ ఆధారిత హ్యాండ్లర్లు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  

ఐసిస్ సంస్థ ముంబైలో 26/11 తరహాలో దాని కంటే పెద్ద మారణహోమాన్ని సృష్టించాలని భావించినట్లు విచారణలో వెల్లడింది. భారీ సంఖ్యలో ప్రజలను చంపడమే కాకుండా దాడిని పెద్దదిగా చేసే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవాలనుకుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇందు కోసం  ముంబైలో చాబాద్ హౌస్, కోల్బా స్లమ్ ఏరియా సమీపంలోని నావల్ హెలిప్యాడ్ లను పరిశీలించినట్లు చెప్పారు. పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉండే ముంబైలోని ప్రధాన దేవాలయాలపై దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు చెప్పారు. భారతదేశ అభివృద్ధికి, పురోగతికి ముఖ్యమైన హైడ్రాలిక్ ప్రాజెక్టులపై కూడా ఐసిస్ ఉగ్రవాదులు దాడి చేయాలనుకున్నారని వెల్లడించారు. ఐసిస్ ఉగ్రవాదులు వీఐపీ మూమెంట్‌పై రీసెర్చ్ చేసినట్లు..షానవాజ్  ల్యాప్‌టాప్‌లోని డేటా కూడా వెల్లడించింది. అయితే ఐసిస్ ఉగ్రవాదులు ఎప్పుడు దాడి చేయాలనుకున్నారో సరైన సమయం ఫిక్స్ చేసుకోలేదని..ప్రస్తుతం ..రెక్కీ నిర్వహించే పనిలోనే ఉన్నట్లు పోలీసులు వివరించారు.