చుట్టూ పచ్చటి వాతావరణం ఉంటే.. ఈ లోకంతో పెద్దగా పనుండదు. ఆ పచ్చదనాన్ని చూస్తూ హాయిగా గడిపేయొచ్చు. అలాగే.. స్వచ్ఛమైన సముద్రం నిశ్చలంగా ఉండి.. దాని చుట్టూ పచ్చటి చెట్లు.. మధ్యలో మనం ఉంటే ఆ ఫీలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా! మీక్కూడా ఆ ఫీలింగ్ అనుభవించాలని ఉందా? అయితే.. మీకోసమే ఐఆర్సీటీసీ తక్కువ ధరలో టూర్ ప్యాకేజీలు తెచ్చింది. ఆ వివరాలు.. అండమాన్ అందాల కనువిందుతో ఈ స్టోరీ మీకోసం..
చాలారోజులుగా ఏదైనా మంచి ప్లేస్‌కి వెళ్లాలనుకుంటూ.. బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నింటినీ మరిచి హాయిగా.. రొటీన్ జీవితానికి, బోరింగ్ ప్రపంచానికి దూరంగా గడపాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎకానమీ క్లాస్‌లో హైదరాబాద్ నుంచి అండమాన్‌కు తీసుకెళ్లే టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్సీటీసీ. ఐదు రాత్రులు, ఆరు రోజులు అండమాన్‌లో గడిపే అద్భుతమైన అవకాశం టూరిస్టులు అస్సలు వదులుకోకండి అంటూ తొందరపెడుతోంది. ముప్పై వేల నాలుగు వందల రూపాయలు టూర్ ప్యాకేజీగా నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి అండమాన్ ట్రిప్ వచ్చేనెల అంటే.. సెప్టెంబర్ 6న స్టార్ట్ అవుతుంది. ఆహ్లాదకరమైన ఈ టూర్ ప్యాకేజ్ అందుకోవాలంటే.. irctctourism.com వెబ్సైట్ ఓపెన్ చేసి ప్యాకేజీ బుక్ చేసుకోవాలి.
ఏమేముంటాయి..
పర్యాటక ప్రేమికులకు అతి తక్కువ ధరలో అందించే ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టిక్కెట్లు, డీలక్స్ హోటల్లో బస, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతాయి. మధ్యాహ్న భోజనం, రూమ్ సర్వీస్, ఎంట్రీ టికెట్లు ఈ ప్యాకేజీలో కవర్ కావు. అంటే.. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ వరకే వాళ్లు చూసుకుంటారన్నమాట. మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్, ఎక్కడికైనా వెళ్తే.. ఎంట్రీ టిక్కెట్లు మనమే తీసుకోవాలి.
ఎలా సాగుతుంది?
సెప్టెంబర్ 6న హైదరాబాద్ నుంచి అండమాన్ బయల్దేరే ఫ్లైట్ ఉదయం 9 గంటల 40 నిమిషాలకు టేకాఫ్ అవుతుంది. మధ్యాహ్నం పన్నెండున్నరకు పోర్ట్‌బ్లెయిర్‌కు చేరుకుంటుంది. అక్కడ హోటల్లో బస చేసి లంచ్ పూర్తి చేసుకొని కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఆ తర్వాత కార్బినిస్ కోవ్ బీచ్‌కు ప్రయాణం. ఆ తర్వాత సెల్యులార్ జైల్ చూపిస్తారు. దీంతో ఆరోజు ప్యాకేజీ ముగుస్తుంది. ఆ రాత్రి పోర్ట్ బ్లెయిర్ హోటల్లోనే నిద్ర. సెప్టెంబర్ 7న ఉదయం ఐల్యాండ్‌లో విహారం ఉంటుంది. అక్కడి నుంచి ‘నార్త్ బే’ దీన్నే కోరల్ ఐల్యాండ్ అని కూడా అంటారు. రోజంతా ఐల్యాండ్‌లో గడిపి తిరిగి రాత్రికి మళ్లీ పోర్ట్‌బ్లెయిర్‌కు చేరుకుంటారు. సెప్టెంబర్ 8న ఉదయాన్నే హేవ్‌లాక్ ఐల్యాండ్‌కి ప్రయాణం. వెళ్లగానే హోటల్ రూం ఇస్తారు.
కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రాధానగర్ బీచ్‌లో విహరిస్తారు. తిరిగి రాత్రి మళ్లీ హేవ్‌లాక్ ఐల్యాండ్‌లోనే బస చేయాలి. మరుసటి రోజు అంటే.. సెప్టెంబర్ 9న ఉదయం కాలాపత్తర్ బీచ్‌లో విహరించాలి. అదే రోజు తిరిగి పోర్ట్‌బ్లెయిర్ చేరుకొని సెప్టెంబర్ 10న ఉదయం బారాతంగ్కు ప్రయాణం చేయాలి. అక్కడ లైమ్‌స్టోన్ కేవ్స్, మడ్ వాల్కనోస్ ప్రాంతాల్లో విహరించి తిరిగి రాత్రి పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటారు. ఆ రాత్రి పోర్ట్ బ్లెయిర్‌లోనే ఉండి.. సెప్టెంబర్ 11 మధ్యాహ్నం ఒంటిగంటకు పోర్ట్బ్లెయిర్లో ఫ్లైట్ ఎక్కితే.. అదేరోజు మధ్యాహ్నం మూడున్నరకు హైదరాబాద్‌లో దిగుతారు.
ఈ టూర్లో చూసేవి..
పోర్ట్ బ్లెయిర్, కార్బినిస్ కోవ్ బీచ్, సెల్యులార్ జైల్, కోరల్ ఐల్యాండ్, హేవ్‌లాక్ ఐల్యాండ్, రాధానగర్ బీచ్, కాలాపత్తర్ బీచ్, బారాతంగ్, లైమ్‌స్టోన్ కేవ్స్, మడ్ వాల్కనోస్.
