ఆయుష్‌లో ‘యాప్‌’ రగడ

ఆయుష్‌లో ‘యాప్‌’ రగడ

వైద్యారోగ్యశాఖలో ఓ యాప్‌‌ చిచ్చు రేపుతోంది. ప్రభుత్వ దవాఖాన్లలో పన్జేస్తున్న ఆయుష్ డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్‌‌ నమోదుకు ఓ యాప్‌‌ను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయుష్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లోని స్వీపర్లు మొదలు డాక్టర్ల వరకూ ప్రతిఒక్కరూ తమ ఫోన్‌‌లో యాప్‌‌ను ఇన్‌‌స్టాల్‌‌ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ యాప్‌‌ ద్వారానే ప్రతిరోజూ అటెండెన్స్‌‌ నమోదు చేయడంతోపాటు లీవ్, లోన్ వంటి దరఖాస్తులనూ ఇందులోనే చేయాలని పేర్కొంది. ఆఫీస్‌‌ అవర్స్‌‌లో ఉన్నతాధికారులకు లొకేషన్‌‌ యాక్సెస్‌‌ ఇవ్వాలని సూచించింది. గైర్హాజరీని తగ్గించేందుకు తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అడవిలో జంతువుల మెడకు ట్యాగ్ కట్టినట్టు, మా కదలికలపై నిఘా పెట్టడమేందని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.

వ్యక్తిగత ఫోన్లలో యాప్‌‌ను ఇన్‌‌స్టాల్ చేసుకుని, ఇతరులకు యాక్సెస్‌‌ ఇవ్వడం వల్ల తమ ప్రైవసీకి భంగం వాటిల్లితే బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయుష్‌‌ రాష్ర్ట ఆఫీసర్ల బృందం జిల్లాలవారీగా ఈ యాప్ ఇన్‌‌స్టాలేషన్‌‌, పనితీరుపై సమావేశాలు నిర్వహిస్తోంది. ఉద్యోగుల ఫోన్లలో యాప్‌‌ ఇన్‌‌స్టాల్‌‌ చేసి వివరాలను అందులో నిక్షిప్తం చేస్తున్నారు. ఆస్పత్రి లొకేషన్‌‌ను ట్యాగ్‌‌(జియో ట్యాగింగ్‌‌) చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ప్రత్యేక యూజర్‌‌‌‌ ఐడీ కేటాయిస్తున్నారు. గురువారం సంగారెడ్డిలో  యాప్‌‌ ఇన్‌‌స్టాలేషన్‌‌ కార్యక్రమం నిర్వహించగా, డాక్టర్లు ఇతర సిబ్బంది వ్యతిరేకించారు. యాప్‌‌ ఇన్‌‌స్టాల్‌‌ చేసుకోకపోతే ఉద్యోగాల్లో నుంచి తీసేస్తామని ఉన్నతాధికారులు బెదిరించినట్లు డాక్టర్లు తెలిపారు.

నిరంతర నిఘా!

ఆయుష్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ పరిధిలో పన్జేస్తున్న క్లాస్ 4 ఉద్యోగి నుంచి డాక్టర్ల వరకూ అందరూ తమ ఫోన్లలో యాప్‌‌ ఇన్‌‌స్టాల్ చేసుకోవాలి. ఆఫీస్‌‌ అవర్స్‌‌లో లొకేషన్‌‌ యాక్సెస్ ఉన్నతాధికారులకు షేర్ చేయాలి. దీంతో డాక్టర్లు, సిబ్బంది ఆఫీస్‌‌లో ఉన్నదీ లేనిదీ అనుక్షణం పరిశీలిస్తారు. రోజూ ఉదయం ఆస్పత్రికి వెళ్లాకా ‘ఎంట్రీ’, ఇంటికెళ్లేటప్పుడు ‘ఎగ్జిట్‌‌’ నమోదు చేయాలి. ఆస్పత్రి లొకేషన్‌‌లో ఉంటేనే ఈ ఎంట్రీ, ఎగ్జిట్‌‌ వివరాలను యాప్‌‌ ఆమోదిస్తుంది. ఒకవేళ అత్యవసరంగా సెలవు తీసుకోవాలన్నా, యాప్‌‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మూడు రోజులు ఆస్పత్రికి ఆలస్యంగా వస్తే ఒకరోజు ఆబ్సెంట్‌‌ వేస్తారు.

ప్రభుత్వం ఫోన్లు ఇయ్యాలె..

వ్యక్తిగత సమాచారం లీకయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తూ డాక్టర్లు తమ ఫోన్లలో ఈ యాప్​ ఇన్​స్టాల్ ​చేసుకోబోమంటున్నారు. ఫోన్లు, సిమ్​కార్డులు కొనిస్తే.. యాప్​ఇన్​స్టాల్​చేసుకోవడానికి తమకేమీ అభ్యంతరంలేదంటున్నారు. ఆయుష్ డిస్పెన్సరీలలో సౌలతులు కల్పించాలని కోరుతున్నారు.

డాక్టర్లు జంతువులు కాదు

జియో ట్యాగ్ చేయడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే. ప్రపంచంలో ఎక్కడా ఇలా చేయలేదు. కదలికలను తెలుసుకునేందుకు డాక్టర్లు జంతువులో, వాహనాలో, నేరస్తులో కాదు. కొందరి అనాలోచిత నిర్ణయంతో ఇలాంటి దుస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి     – లాలు ప్రసాద్ రాథోడ్,                      ప్రెసిడెంట్, ప్రభుత్వ డాక్టర్ల సంఘం