ఇన్ ఫ్రా కంపెనీల్లో ఐటీ దాడులు

ఇన్ ఫ్రా కంపెనీల్లో ఐటీ దాడులు

రాష్ట్రంలో నాలుగైదు రోజులుగా కొనసాగుతున్న ఐటీ దాడులు హాట్ టాపిక్ అయ్యాయి. భారీ కాంట్రాక్టు పనులు చేస్తున్న రియల్ ఎస్టేట్, ఇన్ ఫ్రా కంపెనీలపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 ప్రాంతాల్లో 23 బృందాలతో దాడులు కొనసాగిస్తున్నారు ఐటీ అధికారులు. హైదరాబాద్ లో 14 కంపెనీలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ కంపెనీలన్నీ గత ఏడెనిమిది ఏళ్లలోనే రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది. అయితే.. అనతికాలంలోనే ఇవి కోట్ల రూపాయల పనులు చేసినట్టు అధికారులు గుర్తించారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఈ 14 కంపెనీల డైరెక్టర్లు ప్రమోటర్లుగా ఉన్నారని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలోని ఇరిగేషన్,రోడ్డు పనుల్లో ఈ 14 కంపెనీలకు సబ్ కాంట్రాక్టులు ఉన్నాయని చెబుతున్నారు.

గత 4 రోజులుగా కంపెనీల ఆఫీసులు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగినట్టు సమాచారం. పౌలోమీ, నిమై, వెర్నస్, బృందావన్, వాట్సోల్, BVM, JMM కంపెనీలతో పాటు.. C5 ఇన్ ఫ్రా లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. C5 ఇన్ ఫ్రా ప్రమోటర్లు జువ్వాడి మదన్ మోహన్ రావ్, చెన్నాడి నిశాంత్ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. అమీర్ పేట లోని మధుఫల టవర్స్ లోని కంపెనీల ఆఫీసుల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. కూకట్ పల్లి రెయిన్ బో విస్తా రాక్ గార్డెన్, బంజారాహిల్స్ లోని C5 ఇన్ ఫ్రా సెంట్రల్ ఆఫీస్ లో ఐటీ అధికారులు సోదాలు  చేస్తున్నారు. కోట్లాది రూపాయల కాంట్రాక్టులు చేస్తున్నా.. ఐటీ ఫైలింగ్ లో తేడాలు వచ్చాయని.. వీటిపై ఫిర్యాదులు అందడంతోనే ఐటీ అధికారులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.