అక్కడికెళ్తే సీఎం పదవి పోతుందనే మూఢనమ్మకం

  అక్కడికెళ్తే సీఎం పదవి పోతుందనే మూఢనమ్మకం
  •     అక్కడికెళ్తే సీఎం పదవి పోతుందనే మూఢనమ్మకం
  •     1980ల్లో పదవులు కోల్పోయిన బహదూర్ సింగ్, ఎన్డీ తివారీ
  •     అప్పటి నుంచి అదే ప్రచారం
  •     నోయిడాకు పోని అఖిలేశ్, ములాయం, రాజ్‌‌‌‌నాథ్
  •     అవేమీ పట్టించుకోని యోగి 

లక్నో: నోయిడా.. దేశ రాజధాని ఢిల్లీకి దగ్గరగా ఉండే సిటీ. రెసిడెన్షియల్ సొసైటీలు, కార్పొరేట్ ఆఫీసులతో కళకళలాడుతూ ఉంటుంది. కానీ రాజకీయాల్లో మాత్రం ఈ సిటీపై ఒక మూఢనమ్మకం ఉంది. ప్రస్తుతం సీఎంగా ఉన్న నేత నోయిడాకు వెళ్తే.. తర్వాత తన పదవిని కోల్పోతారనే ప్రచారం ఉంది. అలా కొందరు పదవులు కోల్పోయారు కూడా. దీంతో పలువురు సీఎంలు నోయిడాను వీలైనంత వరకు అవైడ్ చేసే వారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు రిమోట్ ద్వారానే చేసే వారు. ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఈ మూఢనమ్మకాలను పట్టించుకోలేదు. ఇప్పటికే పలుమార్లు నోయిడాలో పర్యటించారు.

1980ల్లో మొదలు..

1980ల్లో నోయిడా పర్యటన తర్వాత ఇద్దరు సీఎంలు వీర్ బహదూర్ సింగ్, ఎన్డీ తివారీ తమ పదవులు కోల్పోయారు. మాయావతి, కల్యాణ్ సింగ్ కూడా.. నోయిడాకు వెళ్లడం వల్లే తాము ఓడిపోయామని భావించారు. దీంతో ఆ తర్వాతి కాలంలో అఖిలేశ్ యాదవ్, ములాయంసింగ్ యాదవ్, కల్యాణ్ సింగ్, రాజ్‌‌‌‌నాథ్ సింగ్ తదితరులు నోయిడాకు దూరంగానే ఉండిపోయారు. అయితే 2012 నుంచి 2017 దాకా యూపీ సీఎంగా అఖిలేశ్ పని చేశారు. ఆ సమయంలో నోయిడాలో పర్యటించేందుకు ఆయన వెనుకాడారు. కానీ తర్వాతి ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. మరోవైపు ఈ మూఢనమ్మకాన్ని యోగి పట్టించుకోలేదు. ఒక్కసారి కాదు.. చాలా సార్లు నోయిడాలో పర్యటించారు. కరోనా పరిస్థితిపై రివ్యూ చేసేందుకు చివరగా జనవరిలో వెళ్లారు. దీంతో అఖిలేశ్ కొత్త థియరీ తెరపైకి తెచ్చారు. ‘‘సీఎం పదవిలో ఉన్న వ్యక్తి నోయిడాకు వెళ్తే ఎన్నికల్లో ఓడిపోతారు. కానీ అక్కడి వెళ్లిన వాళ్లు.. తర్వాతి ఎన్నికల్లో గెలుస్తారు”అన్న నమ్మకం కూడా ఉంది.  2011లో నోయిడాలో తాను సైకిల్ యాత్ర చేసి, ఎన్నికల్లో గెలిచానంటున్నారు.  అయితే,  నేతలను ఈ సిటీ నుంచి దూరంగా ఉంచాలనే బ్యూరోక్రాట్లు ఈ ప్రచారం చేశారని పలువురు చెప్తున్నారు.   

గోవాలో కాంగ్రెస్ అభ్యర్థులూ నేడు ప్రతిజ్ఞ..

పార్టీ మారబోమంటూ ఆప్ అభ్యర్థులు చేసిన ప్రతిజ్ఞ తరహాలో.. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ప్రతిజ్ఞ చేయనున్నారు. శుక్రవారం  గోవాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలోనే క్యాండిడేట్లు లాయల్టీ ప్రకటించనున్నారు.

6న పంజాబ్ సీఎం అభ్యర్థి ప్రకటన   

పంజాబ్ సీఎం క్యాండిడేట్‌‌‌‌ను ఆదివారం ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 6న రాహుల్ గాంధీ లూథియానాకు వస్తున్నారని, తాము మళ్లీ అధికారంలోకి వస్తే సీఎం పదవి చేపట్టబోయే లీడర్ ఎవరనేది ఆయన ప్రకటిస్తారని వెల్లడించాయి. మరోవైపు ఆప్ మాదిరే కాంగ్రెస్ కూడా ప్రస్తుతం ఫోన్ కాల్స్ ద్వారా ప్రజా అభిప్రాయాన్ని సేకరిస్తున్నది. తమ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందో చెప్పాలని అడుగుతోంది.  ఫోన్‌‌‌‌ కాల్స్‌‌‌‌లో మొదటి రెండు ఆప్షన్లుగా సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ సిద్ధూ పేరును చెప్పి అభిప్రాయం అడుగుతున్నారు. ‌‌

దోపిడీలు తగ్గినయ్: అమిత్ షా  

యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దోపిడీలు 70 శాతం తగ్గాయని కేంద్ర హోం మంత్రి అమిత్​షా చెప్పారు. గురువారం యూపీలోని లోనిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2017లో బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రం నుంచి మాఫియా రూల్​ను సక్సెస్​ఫుల్​గా తరిమికొట్టిందన్నారు. మర్డర్లు 29 శాతం, అత్యాచారాలు 30 శాతం, కిడ్నాప్​లు 35 శాతం తగ్గాయన్నారు. ఇపుడు జరగబోయే ఎన్నికలు 25 ఏండ్ల యూపీ అభివృద్ధిని నిర్ణయిస్తాయన్నారు. 

మా హయాంలో మత హింస లేదు: యోగి

యూపీలో తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మత హింస, టెర్రరిస్టుల దాడులు జరగలేదని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఐదేండ్ల పాలనలో తన ప్రభుత్వం సాధించిన విజయాలను గురువారం మీడియా ముందు వెల్లడించారు. లా అండ్ ఆర్డర్ సమస్యల వల్ల గతంలో ఎవరూ యూపీలో పెట్టుబడులకు ముందుకు రాలేదన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో14వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు రెండో ప్లేస్​లోకి తెచ్చామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి మహిళా పోలీసు ఉన్న ఏకైక రాష్ట్రం యూపీ అని ఆదిత్యనాథ్‌‌‌‌ తెలిపారు. అన్ ఎంప్లాయ్ మెంట్ రేటు కూడా  3 శాతానికి తగ్గిందన్నారు.