బిర్లాతో పోటికి రెడీ అయిన గౌతమ్ అదానీ

బిర్లాతో పోటికి రెడీ అయిన గౌతమ్ అదానీ

అల్ట్రాటెక్‌‌‌‌‌‌‌‌ను  దాటాలని చూస్తున్న అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌

బిజినెస్ డెస్క్‌‌, వెలుగు: రూ.100 లక్షల కోట్లు..దేశంలో ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌మెంట్‌‌కు ప్రభుత్వం చేస్తానన్న ఖర్చు.  అంటే  రానున్న కొన్నేళ్లలో  బ్రిడ్జ్‌‌లు, రోడ్లు, ఇతర ఇన్‌‌ఫ్రా ప్రాజెక్ట్‌‌లు పెరగడం చూస్తాం.  అందుకే గత కొంత కాలం నుంచి దేశంలో సిమెంట్ బిజినెస్ పెద్ద పెద్ద కంపెనీలను ఆకర్షిస్తోంది. ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌కు ఇప్పటికే  షాకిచ్చిన  గౌతమ్ అదానీ తాజాగా బిర్లాతో పోటికి రెడీ అయ్యారు.  ఒక్క డీల్‌‌తో దేశంలో రెండో అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీగా అదానీ గ్రూప్‌‌ను మార్చారు.   అక్కడితో ఆగక తన కెపాసిటీని మరింత పెంచుతామని ప్రకటించారు. నెంబర్ వన్ పోజిషన్‌లోని అల్ట్రాటెక్‌ సిమెంట్ (బిర్లా గ్రూప్ కంపెనీ) తో పోటీకి తెర లేపారు. అంబుజా, ఏసీసీ సిమెంట్‌‌లోని  హోల్సిమ్‌‌ ఇండియా  వాటాలను అదానీ గ్రూప్‌‌  6.5 బిలియన్ డాలర్లు (రూ. 54 వేల కోట్లు) పెట్టి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ బిజినెస్‌‌లను కొనుగోలు చేయడానికి అల్ట్రాటెక్,  జేఎస్‌‌డబ్ల్యూ గ్రూప్‌‌లు  కూడా తీవ్రంగా ప్రయత్నించాయి. అయినప్పటికీ  ఈ రెండు కంపెనీల కంటే ఎక్కువ చెల్లించి అంబుజాను,ఏసీసీని అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం అదానీ గ్రూప్ సిమెంట్ బిజినెస్ కెపాసిటీ  ఏడాదికి 70 మిలియన్ టన్నులుగా ఉంది.  ఈ కెపాసిటీని 2030 నాటికి  ఏడాదికి 140 మిలియన్ టన్నులకు  పెంచాలని చూస్తున్నారు.  అంబుజా, ఏసీసీలలో రూ. 20 వేల కోట్లను ఇన్వెస్ట్ చేస్తామని ఇప్పటికే గౌతమ్ అదానీ ప్రకటించారు. ఇందుకోసం  ఈ రెండు కంపెనీల్లోని షేర్లను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి లోన్లను పొందే పనిలో ఉన్నారు. కేవలం కెపాసిటీని పెంచడమే కాదు ఇతర సిమెంట్ కంపెనీలను కొనే ఆలోచనలో కూడా అదానీ గ్రూప్ ఉంది. తాజాగా జేపీ గ్రూప్‌‌కు చెందిన సిమెంట్ బిజినెస్‌‌ను రూ. 5 వేల కోట్లకు అదానీ గ్రూప్  కొనుగోలు చేయాలని చూస్తోందనే వార్తలు కూడా వచ్చాయి. కేవలం సిమెంట్ మాత్రమే కాదు బిర్లా అల్యూమినియం కంపెనీ హిందాల్కోకి పోటీగా అల్యూమినియం బిజినెస్‌లోకి కూడా అదానీ ఎంటర్ అయ్యారు.    

అల్ట్రాటెక్, జేఎస్‌‌డబ్ల్యూ కూడా అదే బాటలో ..

సిమెంట్ బిజినెస్‌‌ను మరింతగా విస్తరించాలని అల్ట్రాటెక్, జేఎస్‌డబ్ల్యూలు కూడా చూస్తున్నాయి. అల్ట్రాటెక్‌‌ సిమెంట్ తన కెపాసిటీని 2030 నాటికల్లా ఏడాదికి 160 మిలియన్ టన్నులకు పెంచుకోవాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది.  ప్రస్తుతం ఈ కంపెనీ కెపాసిటీ ఏడాదికి 120 మిలియన్ టన్నులుగా ఉంది.  కెపాసిటీని పెంచుకునేందుకు సుమారు రూ. 13 వేల కోట్లను ఇన్వెస్ట్ చేస్తామని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అంతేకాకుండా  ఇండియా సిమెంట్‌‌కు చెందిన మధ్యప్రదేశ్‌‌లోని ప్రాజెక్ట్‌‌ను కొనుగోలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించింది. కానీ, జేఎస్‌‌డబ్ల్యూ సిమెంట్ ఈ ప్రాజెక్ట్‌‌ను  దక్కించుకుంది.   ఇండియా సిమెంట్‌‌కు చెందిన  రాజస్థాన్‌‌లోని మరో ప్రాజెక్ట్‌‌ కోసం జేఎస్‌‌డబ్ల్యూ సిమెంట్‌‌, అల్ట్రాటెక్ సిమెంట్‌‌లు తీవ్రంగా  పోటీ పడుతున్నాయి.  జేఎస్‌‌డబ్ల్యూ సిమెంట్ కూడా తన కెపాసిటీని పెంచుకోవడానికి రూ.2 వేల కోట్లను సేకరించింది. ప్రస్తుతం ఈ కంపెనీ కెపాసిటీ ఏడాదికి 17 మిలియన్ టన్నులు కాగా, 2023–24 నాటికి 25 మిలియన్‌‌ టన్నులకు పెంచుకోవాలని చూస్తోంది. 

కంపెనీలను నడుపుతున్నదిదే

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం తన క్యాపిటల్ ఎక్స్‌‌పెండిచర్‌‌‌‌ను రూ. 7.5 లక్షల కోట్లు పెంచింది. ఇది కిందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 35%  ఎక్కువ. మోడీ ప్రభుత్వం దేశంలో ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను వేగంగా  డెవలప్ చేసేందుక భారీగా ఖర్చు చేయడానికి రెడీ అవుతోంది. పీఎం గతి శక్తి కింద ఇప్పటికే మొదలైన ప్రాజెక్ట్‌‌ల స్పీడ్‌‌ను పెంచనుంది.  నెట్‌‌వర్క్‌‌ ప్లానింగ్ గ్రూప్ 229 కీలక ప్రాజెక్ట్‌‌లను గుర్తించింది. రానున్న బడ్జెట్‌‌లోనూ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌పై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. కేవలం రోడ్లు, బ్రిడ్జీలు మాత్రమే కాదు ప్రభుత్వం అఫోర్డబుల్ హౌసింగ్‌‌పై కూడా ఫోకస్ పెడుతోంది.దీంతో సిమెంట్‌కు డిమాండ్‌ బాగా పెరుగుతుంది.