ఇ–కామర్స్ రంగాన్ని ఒక ఊపు ఊపేసిన జాక్ మా సక్సెస్ స్టోరీ

ఇ–కామర్స్ రంగాన్ని ఒక ఊపు ఊపేసిన జాక్ మా సక్సెస్ స్టోరీ

అతను ఎక్కడికెళ్లినా ఓటమే ఎదురయ్యేది. ప్రైమరీ స్కూల్‌‌లో రెండు సార్లు , హై స్కూల్‌‌లో మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు. యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్షలో మరో మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు.  కానీ, ప్రయత్నాన్ని మాత్రం ఆపేవాడు కాదు. ఇంకా ఎక్కువగా ట్రై చేసేవాడు. అలా హార్వర్డ్ స్కూల్‌‌కు అప్లై చేసి పది సార్లు రిజెక్ట్ అయ్యాడు. ఉద్యోగం కోసం వెళ్తే అక్కడా రిజెక్షనే ఎదురైంది. అలా తిరిగి తిరిగి అలసిపోయి క‌‌సి పెంచుకున్నాడు. క‌‌సిలోంచి పుట్టింది ఒక ఆలోచ‌‌న‌‌. అదే ‘అలీబాబా’. 33 ఏండ్ల వయసులో జాక్‌‌ మా మొదలుపెట్టిన చిన్న వెబ్‌‌సైట్..  కొన్నేండ్లలో అతడ్ని ప్రపంచ కుబేరుడిగా మార్చింది. తన పట్టుదలతో ఇ–కామర్స్ రంగాన్ని ఒక ఊపు ఊపేసిన జాక్ మా సక్సెస్ స్టోరీ ఇది.

జాక్ మా అసలు పేరు ‘మా యున్’. అతను 1964 లో హాంగ్ చౌ పట్టణంలో ఒక పేద కుటుంబంలో పుట్టాడు. జాక్​కు అన్న, చెల్లి ఉన్నారు. జాక్​కు చిన్నప్పటి నుంచీ ఇంగ్లీష్ అంటే ఇష్టం. పన్నెండేండ్ల వయసులోనే ఒక పాకెట్ రేడియో కొనుక్కుని అందులో ఇంగ్లీష్ న్యూస్ వినేవాడు. స్కూల్ అయిపోగానే రోజూ 27 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ విదేశీ  టూరిస్టులు ఉండే హోటల్‌‌కు వెళ్లేవాడు. చైనాకు వచ్చే టూరిస్టులకు ఇంగ్లీష్  గైడ్‌‌గా ఉండేవాడు. ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం అలా తొమ్మిదేండ్లు ఉచితంగా పనిచేశాడు. అప్పుడే టూరిస్టుల్లో ఒకరు ‘మా యున్’ పేరు పిలవడానికి కష్టంగా ఉందని ‘జాక్’ అనే నిక్ నేమ్ పెట్టారు. అదే తర్వాతి రోజుల్లో ‘జాక్ మా’గా మారింది. 

ఇంగ్లీష్ నేర్చుకుని..

స్కూల్ చదువు పూర్తయ్యాక మంచి కాలేజీలో చదువుకోవాలనుకున్నాడు జాక్. కాలేజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే అందులో మ్యాథ్స్ సబ్జెక్ట్‌‌లో 120 మార్కులకు ఒక మార్కు వచ్చింది. అలా ఎన్నో సార్లు ట్రై చేయగా ఒకసారి 89 మార్కులొచ్చాయి. సీటు రావాలంటే మరో ఐదు మార్కులు కావాలి. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌‌లో మంచి స్కోర్ రావడంతో సీట్ కన్ఫర్మ్ అయింది. అలా హాంగ్ చౌ నార్మల్ యూనివర్సిటీలో చేరి బీఏ ఇంగ్లీష్ చదివాడు. ఈ మధ్యలో హార్వర్డ్ స్కూల్‌‌లో చదివేందుకు సుమారు పది సార్లు అప్లై చేశాడు. కానీ, అన్నిసార్లు రిజెక్ట్ అయ్యాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఉద్యోగం కోసం చాలా చోట్ల వెతికాడు. అప్పట్లో కొత్తగా పెట్టిన కెఎఫ్ సీలో ఉద్యోగం కోసం అప్లై చేశాడు. ఆ ఉద్యోగానికి మొత్తం 24 అప్లికేషన్లు వస్తే అందులో 23 మంది సెలక్ట్ అయ్యారు. ఒక్క జాక్ మా తప్ప.  ఆ తర్వాత పోలీస్ ఉద్యోగానికి అప్లై చేస్తే ‘ఉద్యోగానికి సరిపోవ’న్నారు. అలా 30 వేర్వేరు జాబ్స్‌‌కు ట్రై చేసినా ఫలితం లేదు. చివరికి ఒక కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్‌‌‌‌గా తక్కువ జీతానికి ఉద్యోగంలో చేరాడు.

చైనా పేజెస్

ఎన్నిసార్లు రిజెక్ట్ అయినా జాక్ మా పట్టుదల మాత్రం తగ్గలేదు. తన ఇంగ్లీష్ పై తనకు పూర్తి నమ్మకం ఉండేది. చిన్నప్పుడే గైడ్‌‌గా చేసిన అనుభవం ఉంది. అందుకే  1994లో ‘హాంగ్ చౌ హైబో’ అనే  ట్రాన్స్‌‌లేషన్ ఏజెన్సీ మొదలుపెట్టాడు. బిజినెస్ పనుల మీద విదేశాలకు వెళ్లే చైనీస్‌‌కు ట్రాన్స్‌‌లేటర్‌‌‌‌గా ఉండేవాడు. అలా 1995 లో హైవే కన్‌‌స్ట్రక్షన్ అధికారులతో కలిసి ఒకసారి అమెరికా వెళ్లాడు. అప్పుడే మొదటిసారి కంప్యూటర్ గురించి, ఇంటర్నెట్ గురించి తెలుసుకున్నాడు. ఇంటర్నెట్‌‌లో ఏ దేశం గురించి సెర్చ్ చేసినా వివరాలు వచ్చేవి. కానీ, చైనాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇంటర్నెట్‌‌లో ఉండేది కాదు. అది గమనించిన జాక్ మా.. దాన్ని అవకాశంగా మార్చుకున్నాడు. వెంటనే స్నేహితుల సాయంతో ‘చైనా పేజెస్’ అనే వెబ్‌‌సైట్ మొదలుపెట్టాడు. చైనా కంపెనీలకు వెబ్‌‌సైట్స్ తయారుచేసే కంపెనీ అది.  అలా 1995 మే 10 న చైనా పేజెస్​ వెబ్‌‌సైట్ స్టార్ట్ చేశాడు. వెబ్‌‌సైట్ లాంచ్ అయిన మూడు గంటల్లోనే చైనా వ్యాపారవేత్తల నుంచి జాక్ మాకు మెయిల్స్ వచ్చాయి. చాలామంది పార్టనర్స్‌‌గా చేర్చుకోమని అడిగేవాళ్లు.  జాక్ మా వాళ్లందరినీ కాదని చైనా ప్రభుత్వంతో పార్టనర్ షిప్ చేసుకున్నాడు. కానీ, ఆ తర్వాతి రోజుల్లో చైనా ప్రభుత్వం కంపెనీపై పూర్తి అధికారం చెలాయించడంతో జాక్ మా కంపెనీ నుంచి తప్పుకున్నాడు.

అలీబాబా మొదలైందిలా..

తన కంపెనీ నుంచి తనే తప్పుకోవాల్సి వచ్చినా జాక్ మా దాన్ని ఫెయిల్యూర్‌‌‌‌గా తీసుకోలేదు. తనకున్న పరిచయాల ద్వారా ‘మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ ట్రేడ్‌‌’లో ఉద్యోగం సాధించాడు. ఇంటర్నెట్ గురించి, వరల్డ్ ట్రేడ్ గురించి మరింత లోతుగా రీసెర్చ్ చేశాడు. ఇంటర్నెట్ ద్వారా అద్భుతాలు సాధించొచ్చని అర్థం చేసుకున్న జాక్ మా.. చిన్న వ్యాపారాలు చేసేవాళ్లకోసం ఒక ఇ–కామర్స్ ప్లాట్‌‌ఫామ్ తయారుచేయాలనుకున్నాడు. అలా పుట్టిందే అలీబాబా.  ప్రభుత్వ ఉద్యోగానికి రిజైన్ చేసి, అమెరికాలోని సిలికాన్ వ్యాలీ అంతా తిరిగాడు. ఇ–కామర్స్ ఐడియా గురించి చాలామందికి చెప్పి చూశాడు. అందరూ అదొక ‘బ్యాడ్ ఐడియా’ అని కొట్టిపారేశారు. దాంతో 1999లో మళ్లీ మరొక కంపెనీ పెట్టేందుకు రెడీ అయ్యాడు జాక్. తన స్నేహితులతో కలిసి లోన్ తీసుకుని ఒక అపార్ట్‌‌మెంట్‌‌లో 16 మందితో కలిసి, ‘అలీబాబా డాట్‌‌కామ్’ను మొదలుపెట్టాడు. 

అతిపెద్ద ఐపీఓ

అలీబాబా కంపెనీ పెట్టిన మూడేండ్ల వరకూ నష్టాల్లోనే నడిచింది. ఒక స్టేజ్‌‌లో దివాలా తీసేవరకూ వెళ్లింది. కానీ ఈ సారి జాక్ మా తన ఆలోచన మార్చుకోలేదు. ప్రపంచానికి ఆన్‌‌లైన్ మార్కెట్ల అవసరం ఉందని బలంగా నమ్మాడు. కానీ, అప్పటి జనాలు ఆన్‌‌లైన్ మార్కెట్లను అంతగా నమ్మేవాళ్లు కాదు. దాంతో అలీబాబాకు రిటైలర్లు, కస్టమర్లు ఉండేవాళ్లు కాదు. నష్టాలు వస్తున్నా  కొన్నేండ్లు భరించాడు. అలా 2003 నాటికి అలీబాబాపై చైనా ప్రజలకు కొంత నమ్మకం కుదిరింది. ముఖ్యంగా కొత్త వ్యాపారులు, యువ వ్యాపారులు అలీబాబాకు కస్టమర్లుగా మారారు.  దాంతో అప్పటివరకూ ఈ కామర్స్ బిజినెస్‌‌లో దూసుకెళ్లిన అమెరికా కంపెనీ ‘ఈబే’ను అలీబాబా వెనక్కి నెట్టేసింది.  ఆ తర్వాత అలీబాబా సేవలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. 2014లో అలీబాబా గ్రూప్ సంస్థ ఐపీఓకు వచ్చి ఇప్పటివరకూ జరిగిన ఐపీఓల్లో అతిపెద్ద ఐపీఓగా చరిత్ర సృష్టించింది. ఒకానొక దశలో చైనా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి కూడా అలీబాబా కారణమైందంటే ఆ క్రెడిట్ జాక్ మాదే. 

యాంట్ గ్రూప్

దాదాపు పదేండ్లు కష్టపడిన తర్వాత అలీబాబా సంస్థ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్‌‌ఫాంగా అవతరించింది. 66 వేలకు పైగా ఫుల్ టైం ఉద్యోగులతో 420 బిలియన్ డాలర్ల విలువతో మార్కెట్ విస్తరించింది. ఒకప్పుడు జాక్ మాను రిజెక్ట్ చేసిన కేఎఫ్‌‌సీలో అలీబాబాకు 5.3 శాతం వాటా ఉంది. అలీబాబా గ్రూప్‌‌లో చాలా కంపెనీలు పుట్టుకొచ్చాయి. అలా ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగాడు జాక్ మా. ప్రస్తుతం అలీబాబా నెట్‌‌వర్త్ సుమారు మూడు లక్షల కోట్లు. అలీబాబాతో పాటు జాక్ మా.. ‘యాంట్‌‌ గ్రూప్‌‌’ పేరుతో ఫైనాన్షియల్ కంపెనీ కూడా స్టార్ట్ చేశాడు. అందులో ‘యాంట్‌‌ ఫినాన్షియల్‌‌’, ‘అలీపే’ వంటి సంస్థలుంటాయి.  ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టార్టప్‌‌గా ఇది రికార్డు సృష్టించింది. ఈ కంపెనీ విలువ 150 బిలియన్‌‌ డాలర్లు.  చైనాలో మూడోవంతు జనాభా ఈ సంస్థకు కస్టమర్లు.

తన సంస్థలో 47 శాతం ఉద్యోగాలు ఆడవాళ్లకు కేటాయిస్తానని, అదే తన స‌‌క్సెస్ సీక్రెట్ అని చెప్తాడు జాక్ మా. “ఈ రోజు నీ దగ్గర కొన్ని వందల మిలియన్ల సంపద ఉండొచ్చు. కానీ, ఆ సంపదను ఇచ్చింది సమాజమే అని గుర్తుంచుకోవాలి’ అంటాడు. ఒక సాధార‌‌ణ లెక్చరర్‌‌‌‌తో మొదలై తన వ్యాపార ఆలోచ‌‌న‌‌ల‌‌తో ప్రపంచం గ‌‌ర్వించే  వ్యవ‌‌స్థను నిర్మించిన జాక్ మా జీవితం నుంచి ఈ జనరేషన్ యూత్ ఎన్నో బిజినెస్ పాఠాలు నేర్చుకోవచ్చు.