‘టైం’ బాలేదు!… వాచీ తెచ్చి జైలు పాలైన యువకుడు

‘టైం’ బాలేదు!… వాచీ తెచ్చి జైలు పాలైన యువకుడు

వాచీ తెచ్చి జైలు పాలైన యువకుడు

ఓ వ్యక్తి.. బ్యాంకాక్​ నుంచి వచ్చిన విమానం దిగిండు. చకచకా నడుచుకుంటూ పోతుండు. ఇంతలోనే ఎయిర్​ ఇంటెలిజెన్స్​ యూనిట్​ (ఏఐయూ) అధికారులు అతడిని ఆపిన్రు. బ్యాగులు చెక్​ చేసిన్రు. ఓ వాచీ దొరికింది. వెంటనే తీసుకెళ్లి జైల్లో వేసిన్రు!!!

…వాచీ దొరికితే జైల్లో వేస్తారా..? అంత నేరమా..? అని అనుకుంటున్నారు కదా. అది మామూలు వాచీ కాదు మరి. ₹2.7 కోట్ల విలువైన వాచీ. బంధువులకు గిఫ్ట్​ పేరిట దానిని దొడ్డి దారిన తెచ్చి ట్యాక్స్​ ఎగ్గొట్టినందుకు అతడు జైలుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన బుధవారం ముంబై విమానాశ్రయంలో జరిగింది. కవిన్​కుమార్​ మెహతా (24) అనే యువకుడు, అత్యంత ఖరీదైన ఆస్ట్రానమియా సోలార్​ జోడియాక్​ వాచీని అతడు అడ్డదారిలో తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అమెరికా లగ్జరీ వాచీల బ్రాండ్​ జాకబ్​ అండ్​ కో ఆ వాచీలను తయారు చేస్తోంది. ఆ వాచీని స్వాధీనం చేసుకున్న అధికారులు ముందు ₹1.8 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

అతడిని అదుపులోకి తీసుకుని వాచీ వివరాలు తెలుసుకునేందుకు రోజ్​ ద వాచ్​ బార్​ అనే డీలర్​ దగ్గరకు పంపించారు. జీఎస్​టీ , డాలర్​ రేటుతో కలుపుకుని ఆ వాచీ ధర ₹2.7 కోట్లకు తేలింది. ఇలాంటి వాచీలపై 38 శాతం కస్టమ్​ సుంకం చెల్లించాల్సి ఉంటుందని, కానీ, దాన్ని ఎగ్గొట్టేందుకు కవిన్​ కుమార్​ బంధువుల పేరు చెప్పి స్మగ్లింగ్​ చేయడానికి ప్రయత్నించాడని అధికారులు అంటున్నారు. దేశంలోని ఇలాంటి ఖరీదైన వాచీలను అడ్డదారుల్లో తేవడానికి ప్రయత్నిస్తే జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు. కొందరు ఇలాంటి వాచీలనే తెస్తున్నా, పాత వాటిని తెచ్చి కొత్తగా మార్చి ధనవంతులకు అమ్మేస్తున్నారని చెబుతున్నారు. హాంకాంగ్​, మకావు, దుబాయ్​, బ్యాంకాక్​లలో వెస్టర్న్​ టూరిస్టులు కాసినోల్లో డబ్బులు పోగొట్టుకుని, డబ్బుకు బదులు ఇలాంటి వాచీలను అక్కడ పెట్టేసి వస్తున్నారని, వాటినే  కొందరు స్మగ్లింగ్​ చేస్తున్నారని అంటున్నారు.