అంబానీని ఢీకొట్టిన జైపాల్‌‌ రెడ్డి

అంబానీని ఢీకొట్టిన జైపాల్‌‌ రెడ్డి

వెలుగు బిజినెస్​ డెస్క్​:  జైపాల్‌‌ రెడ్డి యూపీఏ హయాంలో పలు శాఖలలో మంత్రిగా ఉన్నా పెట్రోలియం శాఖలో ఆయన సాహసాన్ని ఇండియాలో ఎవరూ మర్చిపోలేరు. సహజవాయువు ధరలు పెంచాలనే రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌, దాని ప్రమోటర్‌‌ ముఖేష్‌‌ అంబానీ వత్తిడికి ఏ మాత్రం తలొగ్గకుండా, నిస్సంకోచంగా పెం చడం కుదరదని చెప్పగలిగారు జైపాల్‌‌ రెడ్డి. కేజీ డీ 6 బేసిన్‌‌లో ఉత్పత్తి తగ్గిపోవడం వెనక ఉన్న కారణాలేంటో తేల్చాల్సిందిగా కంప్ట్రోలర్‌‌ అండ్‌‌ ఆడిటర్ జనరల్‌‌ను కోరారు.

అప్పటికే నిర్ణయమైన సహజవాయువు ధరలు మళ్లీ 2014 లోనే నిబంధనల ప్రకారం సమీక్షించాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు ధరలు పెంచడం వీలు కాదని రిలయన్స్‌‌ వర్గాలకు నిర్మొహమాటంగా తెలిపారు. నిజానికి సహజవాయువు ధరలను పెంచాలని ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి కూడా జైపాల్‌‌ రెడ్డి మీద వత్తిడి తెచ్చేది. ఈ వత్తిళ్లకు అతీతంగా దేశ ప్రయోజనాలనే దృష్టిలో ఉంచుకుని ఆయన నిర్ణయం తీసుకున్నారని చెబుతారు. వేలాది కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి గండిపడకుండా  ఈ చర్య సాయపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

రిలయన్స్‌‌ సహజవాయువు విషయంలో తీసుకున్న నిర్ణయం వల్లే ఆయనను ఆ తర్వాత మరో మంత్రిత్వ శాఖకు మార్చారని చెబుతుంటారు. ధరలు పెంచమని కోరడంతో, అసలు ఉత్పత్తి ఎందుకు తగ్గిపోయిందని ఆరా తీయడం మొదలెట్టారు జైపాల్‌‌ రెడ్డి. సహజవాయువు నిల్వలు తగినంతగా లేకపోవడం వల్లే ఉత్పత్తి ఎక్కువ చేయలేకపోతున్నామనే రిలయన్స్‌‌ వాదనను ఆయన సమర్ధించలేకపోయారు.

దాంతో ఏం జరుగుతోందో క్షణ్ణంగా పరిశీలించాల్సిందిగా కాగ్‌‌ను ఆదేశించారు. ఉత్పత్తి వ్యయాన్ని ఎక్కువ చేసి చూపుతున్నారనే అనుమానమూ జైపాల్‌‌ రెడ్డికి కలిగింది. ఈ అంశంలో జైపాల్‌‌ రెడ్డి చూపిన శ్రద్ధ వల్ల,ముందుగా అనుకున్న స్కీమును రిలయన్స్‌‌ ఇక ఎప్పటికీ నెరవేర్చుకోలేకపోయింది.