ఒక యువకుడికి యాక్సిడెంట్లో పెద్ద దెబ్బలు తగిలాయి. రక్తం బాగా పోయింది. వెంటనే రక్తం ఎక్కిస్తే తప్ప బతికే చాన్స్ లేదు. డాక్టర్లు అప్పుడేం చేస్తారు? ముందుగా అతడి బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసుకుంటారు. ఆ గ్రూపు రక్తం ఎక్కిస్తారు. మరి ఆ గ్రూప్ బ్లడ్ దొరకకపోతే? ఇప్పటికైతే చేసేదేమీ లేదు. కానీ.. భవిష్యత్తులో కృత్రిమ రక్తం ఎక్కించి, ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. దానికి బ్లడ్ గ్రూపుతో సంబంధం కూడా ఉండదు. అలాంటి ఓ కృత్రిమ రక్తాన్ని జపాన్ టొకొరొజవా సిటీలోని నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజీ సైంటిస్టులు తయారు చేశారు. తీవ్రంగా గాయపడిన పది కుందేళ్లకు ఆ రక్తాన్ని ఎక్కించి పరీక్షించారు. అందులో ఆరు కుందేళ్లు బతికాయని సైంటిస్టులు చెబుతున్నారు. కుందేళ్లకు రక్తం గడ్డకట్టడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాలేదని చెప్పారు. సాధారణంగా మన రక్తాన్ని యాంటీబాడీస్, యాంటీజెన్స్ అనే ప్రొటీన్లను బట్టి వేర్వేరు గ్రూపులుగా గుర్తిస్తారు. యాంటీబాడీస్ అనేవి రక్తంలోని ప్లాస్మాలో, రోగ నిరోధక వ్యవస్థలో భాగంగా ఉంటాయి. యాంటీజెన్స్ అనేవి ఎర్ర రక్త కణాలపై అతుక్కుని ఉంటాయి. వీటి వల్లే కొన్ని గ్రూపుల రక్తం ఎక్కించినప్పుడు రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు వస్తాయి. అయితే, జపాన్ సైంటిస్టులు తయారు చేసిన కృత్రిమ రక్తంలో యాంటీబాడీస్, యాంటీజెన్స్ ఉండవు. అందుకే.. దీనిని ఎవరికైనా ఎక్కించొచ్చు. ఈ రక్తాన్ని దాదాపుగా ఎవరి శరీరమూ తిరస్కరించదని చెబుతున్నారు. ప్లేట్ లెట్లు, ఎర్ర రక్తకణాలను లైపోసోమ్స్ అనే చిన్న కొవ్వు సంచుల్లో ఉంచి స్టోర్ చేశారు. ఫ్రిజ్లో పెట్టకున్నా, మామూలు వాతావరణంలో ఏడాదిపాటు రక్తం నిల్వ ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.

