కొత్త చక్రవర్తిగా బాధ్యతల స్వీకరణ
టోక్యో: జపాన్ కొత్త చక్రవర్తిగా నరుహితో మంగళవారం చామంతి సింహాసనాన్ని అధిష్టించారు. రాజభవనం ఇంపీరియల్ ప్యాలెస్‌లో వందలాది ఉన్నతాధికారుల సమక్షంలో, సంప్రదాయబద్ధంగా కిరీట ధారణ జరిగింది. తర్వాత పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించిన నరుహితో.. జపాన్ చక్రవర్తిగా తన పట్టాభిషేకాన్ని అధికారికంగా ప్రకటించారు. జపనీయుల సంతోషానికి, ప్రపంచ శాంతికి కృషి చేస్తానంటూ ప్రతిజ్ఞ చేశారు. జపాన్ అధికార ప్రతినిధిగా, జపనీయుల ఐకమత్యానికి పాటుపడుతూ తన విధులను నిర్వర్తిస్తానని ప్రామిస్ చేశారు. ఈ కార్యక్రమంలో నరుహితో భార్య, మహారాణి మసాకో ఆయన వెన్నంటే ఉన్నారు. ‘మా చక్రవర్తిగా, జపాన్ రాజ్య ప్రతినిధిగా మిమ్మల్ని గుర్తించి, గౌరవించుకుంటాం’ అంటూ జపాన్ ప్రజల తరఫున ప్రధాని షింజో అబె కొత్త చక్రవర్తితో చెప్పారు. తర్వాత ‘లాంగ్‌లివ్ ఎంపరర్’ అంటూ మూడుసార్లు నినదించారు.
విశేషాలు..
- రెండు వేల ఏళ్ల నుంచి కొనసాగుతున్న సంప్రదాయమిది.
- నరుహితో జపాన్‌కు 126వ చక్రవర్తి. 59 ఏళ్ల నరుహితో ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్నారు.
- ఈ కార్యక్రమానికి 26 వేల మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాట్లు.
- అరగంట పాటు సాగిన ఈ కార్యక్రమంలో మన ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు.
- 190 దేశాలకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
- హగిబీస్ తుఫాన్ నేపథ్యంలో రాయల్ పరేడ్‌ను వచ్చే నెలకు వాయిదా వేశారు.

