నా సక్సెస్ సీక్రెట్.. పుష్ప మూవీ డైలాగ్

నా సక్సెస్ సీక్రెట్.. పుష్ప మూవీ డైలాగ్

జేఈఈ అడ్వాన్స్‌డ్ తాజా ఫలితాల్లో సూరత్ కుర్రాడు మహిత్ గధివాలా మెరిశాడు. 360 మార్కులకుగానూ 285 మార్కులతో 9వ ర్యాంక్ ను సాధించాడు.  ‘మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి ?’ అని మహిత్ ను అడిగితే.. ‘పుష్ప’ మూవీలోని ఒక డైలాగ్ అని  చెబుతున్నాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీలోని ‘తగ్గేదేలే’ (మై ఝుకేగా నహీ) అనేడైలాగ్ ను ప్రేరణగా తీసుకొని జేఈఈకి ప్రిపేరయ్యానని అన్నాడు. ప్రిపరేషన్ క్రమంలో ఒత్తిడికి లోనైన  సందర్భాల్లో.. ఆ డైలాగే తనలో మనోధైర్యాన్ని నింపిందని చెప్పాడు. పుష్ప మూవీ స్టోరీ తన ఆలోచనా విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని చూసే తీరును కూడా మార్చేసిందని మహిత్ వివరించాడు. 

18 ఏళ్ల మహిత్ తల్లిదండ్రులిద్దరూ డెంటిస్ట్‌లు. మహిత్ ఎప్పటి నుంచో బీటెక్ చేయాలనుకునేవాడు.  చాలా కష్టపడి చదవగా.. జేఈఈ అడ్వాన్స్‌డ్ 9వ ర్యాంకు రూపంలో ఫలితం వచ్చింది. మహిత్  నీట్‌పరీక్ష కూడా రాశాడు. అందులో  720 మార్కులకి గానూ 600 మార్కులు సాధించాడు.  అయితే మెడిసిన్ పై మహిత్  కు అంతగా ఇంట్రెస్ట్ లేదు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో వచ్చిన మార్కులకు IIT -బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో అడ్మిషన్ తీసుకుంటానని.. తద్వారా తన కల కూడా నెరవేరుతుందని మహిత్ నమ్మకంగా ఉన్నాడు. 

జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష ఆగస్టు 28న జరిగింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1,55,538 మంది హాజరుకాగా 40,712 (26.17శాతం) మంది మాత్రమే అర్హత సాధించారు. అబ్బాయిల్లో 1,21,930 మందికిగానూ 34,196 (28శాతం) మంది, అమ్మాయిల్లో 33,608 మందికిగానూ 6,516 (19.38శాతం) మంది అర్హత సాధించారు. దివ్యాంగుల్లో 1,392 మందికిగానూ 375 మంది, విదేశీ విద్యార్థుల్లో 280 మందికిగానూ 145 మంది అర్హులుగా నిలిచారు.