కలను నెరవేర్చుకున్న వెయిట్ లిఫ్టర్ జెరెమీ

కలను నెరవేర్చుకున్న వెయిట్ లిఫ్టర్ జెరెమీ

కలలు కనండి..వాటిని నెరవేర్చుకోండి అన్న అబ్దుల్ కలాం  మాటలను స్పూర్తిగా తీసుకున్నాడో లేక..స్వర్ణ పతకం సాధించి దేశ పతాకాన్ని రెపరెపలాడించాలని సంకల్పించాడో కానీ..వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్రి నుంగా అనుకున్నది మాత్రం సాధించాడు. కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించాలని పట్టుదలను పట్టుబట్టి నెరవేర్చుకున్నాడు. 19 ఏళ్ల జెరెమీ..300 కిలోల బరువు ఎత్తి స్వర్ణ పతకాన్ని మెడలో ధరించాడు. భారత త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపలాడించాడు. 

 గోల్డ్ మెడల్ నే  వాల్ పేపర్గా...

వెయిల్ లిఫ్టర్ జెరెమీ లాల్రి నుంగా తన ఫోన్ వాల్ పేపర్ను తరచూ మారుస్తుంటాడు. అయితే ఎప్పుడు స్నేహితులతో గడిపే ఫోటోలు..లేదా పచ్చబొట్లకు సంబంధించిన ఫోటోలను ఫోన్ వాల్ పేపర్గా పెట్టే జెరెమీ..మే 4న తొలిసారి కొత్త వాల్ పేపర్ను  పెట్టాడు. అదేమిటంటే కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్.  కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకులు పతకాలకు సంబంధించిన ఫోటోలను విడుదల చేయగా..వాటిని చూసిన జెరెమీ వెంటనే  గోల్డ్ మెడల్ చిత్రాన్ని తన వాల్ పేపర్ గా పెట్టేసుకున్నాడు. సరిగ్గా మూడు నెలలు తిరిగే సరికి కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ను సొంతం చేసుకున్నాడు. 
  
కామన్వెల్త్ గేమ్స్ పతకాల చిత్రాలు విడుదలైనప్పుడు, నేను వెంటనే సోషల్ మీడియా నుండి గోల్డ్ మెడల్ చిత్రాన్ని డౌన్‌లోడ్ చేశాను. దాన్ని నా వాల్‌పేపర్‌గా పెట్టుకున్నాను.  నా ఫోన్ వాల్‌పేపర్ అయినందున, ప్రతీ రోజూ ఉదయాన్నే నిద్రలేవగానే చూసుకునే వాడిని..అదే  నాకు పెద్ద ప్రేరణ ఇచ్చేది అని జెరెమీ లాల్ రి నుంగా తెలిపారు. 

మెడల్స్తో ఆడుకున్నాడు..

జెరెమీ తండ్రి లాల్ని హుట్లుంగా..నిష్ణాతుడైన బాక్సర్. అతను సబ్ జూనియర్ జాతీయ స్థాయిలో రెండు బంగారు పతకాలను గెలుచుకున్నాడు. వాటిని తన ఇంటి గోడలపై పెట్టుుకని మురిసిపోయేవాడు. అయితే జెరెమీకి ఎప్పుడు మెరిసిపోయే వస్తువులంటే ఇష్టపడేవాడు. అప్పుడప్పుడు తన అన్నదమ్ములతో కలిసి తండ్రి సాధించిన బంగారు పతకాలతో ఆడుకునేవాడు.  వాటి గురించి తండ్రి చెప్తూ ఉంటే ఆసక్తిగా వినేవాడు. తండ్రి వారసత్వమే క్రీడలవైపు జెరెమీ ప్రయాణం చేసేలా చేసింది. వెయిల్ లిఫ్టింగ్ పై ఆసక్తి పెంచుకున్న జెరెమీ..2011లో పూణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందేందుకు ఎంపికయ్యాడు. అదే అతని జీవితాన్ని మార్చేసింది.  

13 ఏళ్ల వయసులోనే పతకం కొట్టాడు

తన ప్రతిభతో 2016లో అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సంఘం దృష్టిని ఆకర్షించాడు. 13 ఏళ్ల వయసులో  పురుషుల 56 కేజీల విభాగంలో సిల్వర్ సాధించాడు. ఆ తర్వాత 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మరో రజతం, ఆ తర్వాత 2018 ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్‌లలో ఒక రజతం, కాంస్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక 2018లో యూత్ ఒలింపిక్స్‌లో బంగారు పతకంతో మెరిశాడు. 16  ఏళ్లకే గోల్డ్ సాధించిన వెయిట్ లిఫ్టర్ గారికార్డు సృష్టించాడు. 

గాయంతో గడ్డు కాలం..

2018 తర్వాత వెయిల్ లిఫ్టింగ్ లో తన విభాగాన్ని జెరెమీ మార్చుకున్నాడు.అయితే అప్పుడే అతను గాయాలపాలయ్యాడు. 2021 ప్రారంభంలో మోకాలి వెనుక భాగంలో ఉన్న తిత్తికి శస్త్రచికిత్స చేయాల్సి రావడంతో..2021 ఆసియా ఛాంపియన్‌షిప్‌, జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పతకం లేకుండా తిరిగి వచ్చాడు. 

 నా జీవితం వెయిట్ లిఫ్టింగ్కు అంకితం..

11 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు జెరెమీ వెయిట్ లిఫ్టింగ్‌కు నన్ను నేను అంకితం చేసుకున్నాను. నేను తొమ్మిదేళ్ల వయస్సు నుండి వారికి దూరంగా శిక్షణ పొందుతున్నాను. వెయిట్ లిఫ్టింగ్ వల్ల  కుటుంబానికి దూరంగా ఉంటున్నా. నేను చివరిసారిగా 2020 జూలైలో ఇంటికి వెళ్లాను. నేను నా సోదరుల వివాహానికి హాజరు కాలేకపోయాను. 2017 నుండి నేను ఇంట్లో క్రిస్మస్ వేడుకలు జరుపుకోలేదు. నేను మా అమ్మను మిస్ అవుతున్నాను. ఒకప్పుడు నార్త్ ఇండియా ఫుడ్ తినే వాడిని కాదు..కానీ ఇప్పుడు నార్త్ ఇండియన్ ఫుడ్ తినడం అలవాటు చేసుకున్నాను. నేను ఎక్కడైనా జీవించగలిగేలా తయారయ్యాను. కానీ నేను ఎప్పుడూ నా తల్లి వండే ఆహారం గురించి ఆలోచిస్తాను అని జెరెమీ తెలిపాడు. వర్క్ అవుట్ చేసే ముందు పంజాబీ పాటలు వింటాను. కానీ నేను శిక్షణ పూర్తి చేసిన తర్వాత  నా ఇంటిని గుర్తు చేసుకునేందుకు మిజో సంగీతాన్ని వింటాను. 

నా లక్ష్యం ఒలింపిక్స్..

కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణాన్ని సాధించేందుకు ఎంతో కష్టపడ్డానని జెరెమీ తెలిపాడు. నిత్యం తనకు ప్రేరణ ఇవ్వాలన్న ఉద్దేశంతో  గోల్డ్ మెడల్నే  తన ఫోన్ వాల్ పేపర్ పెట్టుకున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం తన లక్ష్యం నెరవేరిందన్నాడు. ఇప్పుడు గర్వంతో స్వర్ణం పతకంతో తన ఇంటికి వెళ్తానంటున్నాడు. అలాగే ఈ ఏడాది చివర్లో వరల్డ్ ఛాంపియన్ షిప్ ఉందని వాటిపైనే తన దృష్టి పెట్టానని చెబుతున్నాడు. దాని తర్వాత ఒలింపిక్స్ కు అర్హత పోటీలు మొదలవుతాయని..ఎలాగైన ఒలింపిక్స్ కు అర్హత పొంది..అక్కడ కూడా పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జెరెమీ లాల్ రి నుంగా చెబుతున్నాడు. 

దూసుకెళ్తున్న వెయిట్‌లిఫ్టర్లు

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు దూసుకెళ్తున్నారు. వెయిట్‌ లిఫ్టింగ్‌ 55కిలోల విభాగంలో 23 ఏళ్ల బింద్యారాణి రజతం గెలుచుకుంది. స్నాచ్‌లో 86, క్లీన్ అండ్ జెర్క్‌లో 116.. మొత్తం 202 కేజీల స్కోర్ చేసిన బింద్యారాణి.. భారత్‌కు నాలుగో పతకాన్ని సాధించి పెట్టింది. ఇప్పటికే మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణం, పురుషుల 55 కేజీల్లో సంకేత్‌ రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ పూజారి కాంస్యం నెగ్గారు. దీంతో పతకాల పట్టికలో భారత్‌ టాప్-10లో నిలిచింది.